విద్యుత్ చార్జీల మోతకు కారణం ఇదే.. ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు!

అవును... ఏపీ ఎస్పీడీసీఎల్‌ మాజీ ఛైర్మన్‌ సంతోష్‌ రావు హయాంలో భారీగా అవినీతి జరిగిందని రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరావు ఆరోపించారు.;

Update: 2025-10-23 10:46 GMT

గత ప్రభుత్వ హయాంలో దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)లో జరిగిన భారీ అవినీతి కారణంగానే రాష్ట్రంలో వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం పడుతోందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. డిస్కంలో రూ.40వేల కోట్ల అవినీతి జరిగిందని.. విచారణ జరిపించాలని అన్నారు.

అవును... ఏపీ ఎస్పీడీసీఎల్‌ మాజీ ఛైర్మన్‌ సంతోష్‌ రావు హయాంలో భారీగా అవినీతి జరిగిందని రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరావు ఆరోపించారు. తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్‌ కార్యాలయంలో సీఎండీ శివశంకర్‌ ను కలిసిన ఆయన... డిస్కంలో రూ.40వేల కోట్ల అవినీతి జరిగిందని.. విచారణ జరిపించాలని కోరారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కర్మను తప్పించుకోగలమేమో గానీ, కరెంటు బిల్లును మాత్రం తప్పించుకోలేమని మొదలుపెట్టిన ఆయన... మన పిల్లలైనా ఆ బిల్లులు కట్టాల్సిందే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో చేసిన అవినీతికి సామాన్య వినియోగదారుడు ఎందుకు భారం మోయాలని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.

గత ప్రభుత్వ హయాంలో సంతోష్‌ రావు ఇష్టానుసారంగా ప్రవర్తించారని.. 2023లో రూ.కోట్లలో అవినీతి బయటపడిందని.. రూపాయి విలువ చేసే వస్తువును మూడు రూపాయలకు కొనుగోలు చేసి, ఆ భారాన్ని ప్రజలపై మోపడం అన్యాయమని అన్నారు. విద్యుత్‌ రంగంలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.

అయితే... గత ప్రభుత్వ హయాంలో అలా జరిగితే.. ప్రభుత్వం మారినా సంతోష్‌ రావు మాత్రం కొనసాగారని.. 12 సార్లు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సమాచారం అడిగినా ఇవ్వలేదని.. ఆయన అవినీతిపై సంపూర్ణ ఆధారాలు సేకరించామని తెలిపారు. అధికారులు, కంపెనీలు కుమ్మక్కై అవినీతి సొమ్మును పంచుకున్నారని ఆరోపించారు.

వాళ్లకు రూ.23 లక్షలు, 10 ఎకరాలు ప్రజాధనం నుంచి ఎలా ఇచ్చారు?:

మరోవైపు కందుకూరు హత్య కేసులో లక్ష్మినాయుడు కుటుంబానికి ప్రభుత్వ సాయంపై ఏబీ వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలో హత్యలు, కుల గొడవలపై దృష్టి పెడుతున్నారని.. ఏడాదికి 900 హత్యలు జరుగుతుంటే అందరికీ పరిహారం ఇస్తారా అని ప్రశ్నించారు.

కాగా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుఫున లక్ష్మీనాయుడు భార్యకు రెండెకరాల భూమి, రూ.5 లక్షల నగదు అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా... లక్ష్మీనాయుడు ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమితో పాటుగా రూ.5లక్షల నగదును బ్యాంకులో ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

మరోవైపు ఈ ఘటనలో గాయపడిన పవన్‌ కు నాలుగు ఎకరాల భూమి, ఐదు లక్షల రూపాయల నగదును, భార్గవ్‌ కు మూడు లక్షలు పరిహారం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీనిపైనే ఏబీ వెంకటేశ్వర రావు అభ్యంతరం వ్యక్తం చేశారు!

Tags:    

Similar News