ఏపీ రెవెన్యూ మంత్రిపై విమర్శలు.. ఎందుకిలా ..!
ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చుట్టూ విమర్శలు ముసురుకుంటున్నాయి. ఆయనను టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు వస్తున్నాయి.;
ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చుట్టూ విమర్శలు ముసురుకుంటున్నాయి. ఆయనను టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు వస్తున్నాయి. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశం అనంతరం.. అనగానితో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్రంలో రెవెన్యూ శాఖపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండ డంతో పాటు స్వయంగా ప్రజలు తనకే తమగోడు చెప్పుకోవడంపట్ల కూడా సీఎం సీరియస్ అయినట్టు తెలిసింది.
వాస్తవానికి ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయిన..రెవెన్యూ శాఖే కీలకం. ఈ విషయంలో తిరుగులేదు. ప్రభుత్వానికి విమర్శలు వచ్చినా.. ఆదాయం వచ్చినా ఈ శాఖ నుంచే కావడం విశేషం. అయితే.. ఏపీలో వైసీపీ హయాంలో చేపట్టిన రీ సర్వే కారణంగా.. అనేక లోటుపాట్లు చోటు చేసుకున్నాయి. అదేసమయంలో తప్పుడు కొలతలు కూడా కొలిచారు. దీంతో చాలా మంది రైతులకు నష్టం వాటిల్లింది. వీటిని ఇప్పుడు సరిదిద్దాల్సి ఉంది. అయితే.. ఈ విషయంలోనే రెవెన్యూ శాఖ ఇబ్బందులు పడుతోంది.
మంత్రిది తప్పుందా.. ?
ఈవిషయంలోమంత్రిది తప్పులేదన్నది స్వయంగా చంద్రబాబు చెబుతున్న మాట. కానీ, ఆయన తన కింది అధికారులను సరైన రీతిలో నడిపించడం లేదన్నది ప్రధాన విమర్శ. ఇటీవల కొందరు రెవన్యూ అధికారులు మంత్రిని కలిసి.. ప్రమోషన్ల విషయాన్ని ప్రస్తావించారు. ఈ సమయంలోనే మంత్రి వారికి క్లాస్ ఇచ్చారు. కానీ, తెల్లారే సరికి రెవెన్యూ శాఖకు చెందిన ఇద్దరు కీలక అధికారులు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇది మంత్రికి ఇబ్బందిగా మారింది.
ఇక, ఫిర్యాదుల పరంపర కూడా భారీగా నే ఉంటోంది. స్వయంగా చంద్రబాబు సైతం ప్రజల నుంచి రెవె న్యూశాఖపైనే ఫిర్యాదులు రావడం గమనార్హం. క్షేత్రస్థాయిలో చిన్నపాటి సమస్యలు పరిష్కరించేందుకు కూడా అధికారులు వారాల తరబడి సమయం తీసుకోవడం చికాకుగా మారింది. అదే సమయంలో సిబ్బంది కొరత కూడా రెవెన్యూ శాఖను వేధిస్తోంది. వెరసి.. మంత్రి చుట్టూ విమర్శలు ముసురుకున్నాయి.