పోలీసులకు టఫ్ టాస్క్ ఇచ్చిన చంద్రబాబు
ఏపీలో పోలీసు అమరవీరుల దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. మంగళగిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.;
ఏపీలో పోలీసు అమరవీరుల దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. మంగళగిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీసుల పనితీరుని మెచ్చుకుంటూనే వారికి దిశా నిర్దేశం చేశారు. ఏపీ పోలీసులు దేశానికే ఒక బ్రాండ్ అని వారి ఘనతను గుర్తు చేస్తూనే ఇంకా పెద్ద చాలెంజ్ లను ఎదుర్కోవాలని కోరారు. అంతే కాదు రానున్న కాలం టెక్నాలజీ వాటికి అనుగుణంగా పెరిగిపోతున్న నేరాలు ఒక పెను సవాల్ కాబోతున్నాయని వాటిని కూడా అంతే సమర్థతతో పోలీసులు చేదించి సాధించాలని ముఖ్యమంత్రి కోరారు.
ఇంటెలిజెంట్ క్రైమ్స్ అంటూ :
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటెలిజెంట్ క్రైమ్స్ అన్న పదం వాడారు. అవును టెక్నాలజీ పెరిగిన తరువాత ఈ కొత్త రకం నేరాలు ఆవిష్కృతం అవుతున్నాయి. నేరస్తుడు ఎక్కడో ఉంటాడు, నేరం మాత్రం జరిగిపోతుంది, మూలాలు కనుగొనాలీ అంటే చాలానే చేయాలి, దాంతో ఈ తరహా నేరాల పట్ల పూర్తిగా అలెర్ట్ గా ఉండాలని బాబు పోలీస్ శాఖను కోరారు. ఇంటెలిజెంట్ క్రైమ్స్ విషయంలో నేరస్తుల కంటే పోలీసు యంత్రాంగం ముందుండాలని బాబు కోరారు. ఆ విధంగా చేయగలిగితేనే వీటిని పూర్తిగా అరికట్టగలమని అన్నారు.
రాజకీయ ముసుగులో :
ఇది చాలా టఫ్ చాలెంజ్ గా పోలీసుల ముందు ఉంది. నిజానికి చెబితే రాజకీయ పలుకుబడితోనే ఎక్కువగా నేరాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఈ రోజున కూడా అయితే పుట్టలేదు, చాలా కాలంగానే ఉంది. అయితే ఇటీవల కాలంలో అధికం అయింది. నేరాలు చేసేవారికి ఒక అండ దొరుకుతోంది. వారు పైకి ముసుగు వేసుకుంటున్నారు. లోపల జరిగేది వేరుగా ఉంటోంది. ఏమంటే రాజకీయ వేధింపులుగా చెబుతున్నారు. కానీ జరగాల్సిన అకృత్యాలు తెర వెనక సాగిపోతూంటాయి. ఈ విధంగా రాజకీయ ముసుగు వేసుకుని నేరాలు చేసే వారి ముసుగు తొలగించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పోలీసులకు సూచించారు. వీటిని అరికట్టకపోతే ఏపీలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుందని అందువల్ల పూర్తి అప్రమత్తతతో ఉండాలని ఆయన హెచ్చరించారు.
ట్రెడిషనల్ డ్యూటీ మైండ్ సెట్ నుంచి :
అయితే ఇది ఏమంత సులువు అయితే కాదు, టఫ్ జాబ్, ఎందుకంటే కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా రాజకీయాల వెనక ఉన్న నేరాలు ముసుగు వ్యవహారాలు ఉంటాయి. వీటి విషయంలోనే ఎక్కువగా పోలీసులు ఆందోళన చెందుతూంటారు, వీటి కారణంగానే వారు ఇబ్బందులు పడడమే కాకుండా విమర్శలు ఎదుర్కొంటూంటారు. కానీ ఏపీలో అంతా సజావుగా ఉండాలంటే పోలీసులు తమ విధులను కచ్చితంగా నిర్వహించడమే కాకుండా ట్రెడిషనల్ డ్యూటీ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి మరింత స్మార్ట్ గా వ్యవహరించాలని చంద్రబాబు కోరారు.
ఇన్విజిబుల్ పోలీసింగ్ అవసరం :
విజిబుల్ పోలీసింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఎదురుగా ఖాకీ డ్రస్ తో సిబ్బంది ఉంటారు. కానీ ఇన్విజిబుల్ పోలీసింగ్ గురించి కూడా తెలుసుకోవాలి. పోలీస్ ప్రత్యక్షంగా లేకపోయినా నేరాలను అదుపు చేయడం. పోలీసు ఎల్లెడలా ఉండేలా చేయడం, ప్రజలకు ఆ విధగా భరోసా కల్పించడమే కాదు నేరస్తులకు హెచ్చరికగా వ్యవహరించడం. ఈ తరహా పోలీసింగ్ అతి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అందుకోసం టెక్నాలజీని పోలీసులు విస్తృతంగా వాడుకోవాలని ఆయన సూచించారు.
సీసీ కెమెరాలతో :
ఇక చూస్తే అంతటా నేరాల రూపం స్వభావం తీరు అన్నీ మారుతున్నాయని బాబు చెప్పారు. పెద్ద ఎత్తున సైబర్ క్రైమ్, వైట్ కాలర్ నేరాలు పెరుగుతున్నాయని ఆయన అందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రతి 55 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. అంతే కాకుండా డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం మాఫియాలను గుర్తించి పూర్తి స్థాయిలో అణచివేస్తున్నామని ఆయన వివరించారు. ఓల్డ్ థాట్స్ ని పకకన పెట్టేసి పోలీసులు కూడా కొత్త వెర్షన్‌గా మారాలని బాబు కోరారు.
పెట్టుబడులకు లింక్ :
ఏ రాష్ట్రంలో అయితే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటుందో అక్కడే పెట్టుబడులే పెద్ద ఎత్తున వస్తాయని బాబు చెప్పారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అంటే దానికి కారణం సమర్ధ నాయకత్వంతో పాటు ప్రశాంత వాతావరణం అన్నారు. ఇక శాంతి భద్రతలతోనే అభివృద్ధి, సంక్షేమం ముడిపడి ఉంటాయని బాబు చెప్పారు. రాష్ట్రంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావని అందుకే ఏపీలో క్రైమ్ రేట్‌ను అణచివేయడంలో తాను ఎక్కడా ఎప్పుడూ రాజీపడే ప్రశ్నే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో ఏపీలో అయిదు కోట్ల మంది జనాల రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నది పోలీసులేనని ఆయన కితాబు ఇచ్చారు. మొత్తానికి చూస్తే కనుక ఏపీ పోలీసుల సామర్థ్యాన్ని కొనియాడుతూనే వారు మరింత అప్టూడేట్ గా ఉండాలని టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని బాబు దిశా నిర్దేశం చేశారు.