నాగబాబు ఇన్...ముగ్గురు అవుట్ ?

ఏపీలో మంత్రివర్గ విస్తరణ విషయంలో మరోసారి ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.;

Update: 2025-05-07 22:30 GMT

ఏపీలో మంత్రివర్గ విస్తరణ విషయంలో మరోసారి ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గ సభ్యుల పనితీరుని మధింపు చేస్తూ కొందరి విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశారు అన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక మంత్రుల పనితీరు విషయంలో ప్రతీ మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు దిశా నిర్దేశం చేస్తూనే వస్తున్నారు అని అంటున్నారు.

అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటికీ తన తీరు మార్చుకోని వారి విషయంలో ఇక సీరియస్ గానే కూటమి పెద్దలు ఉంటారని వార్తలు వస్తున్నాయి. ఆ విధంగా చూస్తే ముగ్గురు మంత్రుల విషయంలో అయితే తీవ్ర అసంతృప్తి ఉందని వారిని తప్పించే చాన్స్ ఉందని కూడా కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఇంతకీ ఆ మంత్రులు ఎవరు అంటే ఎవరికి తోచిన పేర్లు వారు చెబుతున్నారు. అయితే వారు తమ శాఖల పట్ల ఈ రోజుకీ మెరుగుదల చూపించలేకపోయారు అని అంటున్నారు. అంతే కాదు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల మీద కూడా ఫోకస్ పెట్టి జనంలోకి తీసుకుని వెళ్ళడం లేదు అని అంటున్నారు.

ఇక చూస్తే కనుక చంద్రబాబు మంత్రివర్గంలో 25 మందిని తీసుకునే అవకాశం ఉంది. అయిత 2024 జూన్ 12న జరిగిన కూటమి ప్రమాణంలో 24 మందికి మాత్రమే చోటు కల్పించారు. ఒక బెర్త్ ఈ రొజుకీ ఖాళీగానే ఉంది. దానిని జనసేన ప్రధాన కార్యదర్శి మెగా బ్రదర్ నాగబాబుకు ఇస్తారని అంటున్నారు. దీంతో జనసేనకు మంత్రివర్గంలో నాలుగు మంత్రి పదవులు దక్కుతాయన్న మాట.

ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలాగే నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ జనసేన కోటాలో మంత్రులుగా కొనసాగుతున్నారు ఇపుడు నాగబాబుకు సైతం మంత్రి పదవి ఇస్తే వీరితో పాటే కొనసాగుతారు.

ఇక జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే నాలుగు మంత్రి పదవులు ఇస్తే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న తమకు రెండు మంత్రి పదవులు అయినా ఇవ్వాలని బీజేపీ కోరుతోంది అని అంటున్నారు. దాంతో కూటమిలో మిత్రులను మరింతగా దగ్గర చేసుకోవడానికి బీజేపీకి కూడా మరో మంత్రి పదవి ఇస్తారని ప్రచారం ఉంది. ఇప్పటికే ఆ పార్టీ తరఫున సత్యకుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నారు.

ఇక బీజేపీకి రెండవ మంత్రి పదవి ఇవ్వాలంటే కూటమిలో మంత్రివర్గంలో ప్రస్తుతం కొనసాగుతున్న వారి నుంచి ఎవరో ఒకరిని తప్పించాలి. అదే విధంగా టీడీపీలో కూడా ఆశావహులు కొందరు మంత్రి పదవుల విషయంలో ఆశలు పెట్టుకున్నారు. అలా మరో ఇద్దరికి చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు.

దాంతో ముగ్గురు మంత్రులను తప్పించి కొత్తగా మరో ముగ్గురుని తీసుకుంటారు అన్న ప్రచారం అయితే ఊపందుకుంటోంది. అదే కనుక జరిగితే ఏపీ మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని అంటున్నారు. పలువురి శాఖలలో సైతం మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇక మంత్రివర్గంలో మార్పుచేర్పులకు జూన్ 12 తరువాత సరైన ముహూర్తం ఎంచుకుంటారు అని అంటున్నారు జూలైలో ఆషాడ మాసం శూన్య మాసం కావడంతో జూన్ నెలాఖరు లోగా ఈ మార్పులు చేర్పులూ అనుకుంటే చేయాల్సి ఉందని అంటున్నారు. మరి జరుగుతున్న ప్రచారంలో ఎంత వరకూ నిజం ఉందో కానీ అదే కనుక జరిగితే రాజకీయంగా కొంత సంచలనమే అవుతుంది.

అయితే బొత్తిగా ఏడాదే కదా మంత్రులు బాధ్యతలు తీసుకుని అయింది అన్నది కనుక ఆలోచిస్తే మాత్రం మరింత కాలం వేచి చూడవచ్చు. లేదా ఒక్క నాగబాబుతోనే సరిపెట్టవచ్చు అని అంటున్నారు. ఈ మొత్తం ప్రచారంలో నాగబాబుకు మంత్రి పదవి మాత్రం సాధ్యమైనంత తొందరలోనే దక్కుతుందని అంటున్నారు.

Tags:    

Similar News