కూటమి ప్రభుత్వంలో ఇంచార్జ్ మంత్రుల కష్టాలు.. అన్నీ ఇన్నీ కావయ్యా...!
సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గంలోని మినిస్టర్లకు..ఒక్కొక్క జిల్లా బాధ్యత అప్పగించారు.;
సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గంలోని మినిస్టర్లకు..ఒక్కొక్క జిల్లా బాధ్యత అప్పగించారు. ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రచారం చేయడంతోపాటు.. పార్టీని ముందుండి నడిపించడం లోనూ.. కీలక పాత్ర పోషించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అంతేకాదు.. అంతర్గత కుమ్ములాటలు కూడా రాకుండా చూడాలని తేల్చి చెప్పారు. ఇలా.. ప్రతి జిల్లా బాధ్యతలను ఒక్కొక్క మంత్రికి అప్పగించారు. అయితే.. జిల్లాల్లో ఆయా మంత్రులు పర్యటిస్తున్నారా? అంటే.. ప్రశ్నార్థకమే.
ఏదో చంద్రబాబు అదిలించినప్పుడు.. కదిలించినప్పుడు మాత్రమే చూచాయగా..చుట్టపుచూపుగా.. మంత్రులు ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. లేకపోతే.. మౌనంగా ఉంటున్నారు. అసలు తమకు అప్పగించిన జిల్లాల్లో ఒక్కసారి కూడా పర్యటించని మంత్రులు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ.. ఉన్నారు. వీరిలో ముందు వరుసలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఏలూరు జిల్లా ఇంచార్జ్‌గా జనసేన మంత్రి నాదెండ్లకు బాధ్యతలు అప్పగించారు. కానీ, ఇప్పటి వరకు ఆయన ఒక్కసారి కూడా సమీక్షించలేక పోయారు.
అలాగే.. అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ మంత్రిగా కొల్లు రవీంద్రను నియమించారు. ఆయన అసలు అక్కడ అడుగే పెట్టలేదు. దీనికి ఆయన ప్రయత్నం చేసినా.. ఓ కీలక నాయకుడు.. అడ్డు పడుతున్నారన్న చర్చ ఉండడం గమనార్హం. ఇక, మంత్రి రామానాయుడుకు.. రెండు జిల్లాల బాధ్యతలను అప్పగించారు. తూర్పుగోదావరి సహా కర్నూలు జిల్లా బాధ్యతలను పర్యవేక్షించాల్సి ఉంది. కానీ, తూర్పుకే పరిమితం అవుతున్న మంత్రి నిమ్మల.. కర్నూలును పట్టించుకోవడం లేదనేటాక్ వినిపిస్తోంది.
అయితే..ఇలా మంత్రులు పట్టించుకోకపోవడానికి కూడా అంతర్గత వ్యవహారాలతోపాటు..తమ దైనందిన బిజీ షెడ్యూలే కారణమని చెబుతున్నారు. మరోవైపు.. కర్నూలు, అనకాపల్లి.. వంటి జిల్లాల్లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలను తాము పరిష్కరించే ప్రయత్నం చేయలేమన్న ఆవేదన కూడా మంత్రుల్లో ఉంది. ఆయా జిల్లాల్లో సీనియర్లు.. జూనియర్ల మధ్య రాజకీయం జోరుగా సాగుతోంది. దీంతో మంత్రులు చాలా వరకు వాటి జోలికి పోకుండా తమ పనులు తాము చేసుకుంటున్నారు. దీంతో జిల్లాల్లో ఇంచార్జ్ మంత్రుల హవా కనిపించడం లేదన్నది వాస్తవం.