టీడీపీ, వైసీపీలకు హైకోర్టు షాక్ !
ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన 105, 1065 జీవోలను కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని, ఈ జీఓలు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది.
ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. అదే సమయంలో సర్ ప్రక్రియ పూర్తయ్యాక, బీసీ జనగణన అనంతరమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ కూడా కొట్టివేసింది. ఆరు వారాల్లోగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. వార్డుల పునర్విభజన మీద దాఖలు చేసిన పిటిషన్ కూడా తోసిపుచ్చిన నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది.
సర్ ప్రక్రియ అక్టోబర్ 10 నాటికి పూర్తి అవుతుంది. ఈ నెల 16 నాటికి తుది ఓటర్ల జాబితా వచ్చే అవకాశం ఉంది. దసరా తర్వాత లేదా నవంబర్ మొదటి వారంలో మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ భావిస్తున్నది. ఈ విషయంలో నోటిఫికేషన్ విడుదల అయితే ఒక స్పష్టత వస్తుంది. ఎన్నికల నిర్వహణకు సిద్దం ఉన్నట్లు ఎన్నికల కమీషన్ ఇప్పటికే ప్రకటించింది.
ఏపీలో మొత్తం 13,351 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిని రూర్బన్, గ్రేడ్ 1,2,3లుగా విభజించారు. దీంతో పాటు 17 కార్పోరేషన్లతో కలిపి 123 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్రం నుంచి వచ్చే ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్లు వెనక్కి వెళ్లకుండా తొందరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
టీడీపీ, బీజేపీలతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు రూరల్ లో 34 శాతం, అర్బన్ లో 33.33 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించింది. బీసీల జనాభా 50 శాతం పైగా ఉందని జీఓలు జారీచేసింది. ఇప్పుడు హైకోర్టు తీర్పు నేపథ్యంలో 50 శాతం రిజర్వేషన్లు మించకుండా రిజర్వేషన్ ప్యాటర్న్ రూపొందించి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.