ఇక మిగిలింది 15 లక్షలు.. చంద్రబాబుకు బిగ్ టార్గెట్
ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై ఫోకస్ చేస్తోంది.;
ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై ఫోకస్ చేస్తోంది. సూపర్ సిక్స్ హామీలిచ్చి అధికారం అందుకున్న కూటమి నేతలు.. ఆర్థిక ఇబ్బందులు చూపి తొలి ఏడాది సంక్షేమ పథకాల ఊసులేకుండా కాలం నెట్టుకొచ్చారు. ఇక రెండో ఏడాదిలోకి అడుగు పెడుతూనే తల్లికి వందనం పథకంతో సంక్షేమ పథకాల జాతరకు తెర తీశారు. ఆ తర్వాత అన్నదాతా సుఖీభవ, స్త్రీశక్తి పథకాలను అమలు చేశారు. ఇక తాజాగా ఎన్నికల హామీ కాకపోయినా, ఆటోడ్రైవర్ల సేవలో పథకానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన 20 లక్షల ఉద్యోగాల కల్పనకు వడివడిగా అడుగులు వేస్తున్నారు.
కూటమి సూపర్ సిక్స్ హామీల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రధానమైనది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి చూపే ఈ హామీపై ప్రజలు చాలా ఆశలే పెట్టుకున్నారు. ఎన్ని నగదు బదిలీ పథకాలు ప్రవేశపెట్టినా ప్రజలకు దక్కని సంతృప్తి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం ద్వారా శాశ్వత ఆనందం కల్పించవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. దీంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతో గత ఎన్నికల్లో భారీ విజయాన్ని కట్టబెట్టారని అంటున్నారు. ఇక అధికారం చేపట్టిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పై చేసిన చంద్రబాబు.. 16 నెలల తరవాత దాదాపు 16 వేల మందికి పోస్టింగులిచ్చారు.
నిజానికి మెగా డీఎస్సీ ద్వారా ఎప్పుడో ఉద్యోగాలను భర్తీ చేయాల్సివున్నా, అనేక న్యాయవివాదాల వల్ల నోటిఫికేషన్ జారీ చేయడమే పెద్ద సవాల్ గా మారింది. అన్నిరకాల అవాంతరాలను అధిగమించిన తర్వాత నోటిఫికేషన్ జారీ చేసి 150 రోజుల్లోనే నియామక ప్రక్రియ భర్తీ చేయడం ఉపాధ్యాయ అభ్యర్థులను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా ఇకపై ఏటా డీఎస్సీ ప్రకటన ఉంటుందని చెప్పడం ద్వారా నిరుద్యోగుల్లో సరికొత్త ఆశలు రేకెత్తించారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఒక్కపోస్టు కూడా భర్తీ చేయకపోవడం, తన 15 ఏళ్ల పాలనలో 14 డీఎస్సీలు వేసిన చంద్రబాబు ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలకు బ్రాండ్ అంబాసిడరుగా పేరు తెచ్చుకున్నారు. ఇక ప్రస్తుత ప్రభుత్వంలో మెగా డీఎస్సీ ద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పనలో తొలి అడుగు వేసిన చంద్రబాబు.. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కలిపి ఇప్పటివరకు 4.71 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెబుతున్నారు.
ఉపాధ్యాయులు, పోలీసు, వివిధ ప్రైవేటు శాఖల్లో కాంట్రాక్టు ఔటు సోర్సింగ్ సిబ్బందితోపాటు నైపుణ్య శిక్షణ ద్వారా లక్షలాది ఉద్యోగాలు కల్పించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇక ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఇంకా 15 లక్షల ఉద్యోగాలను సాధించాల్సివుందని అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చారు. వీటిద్వారా 9 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు నిర్మాణ పనులు ప్రారంభించడం, ఐటీ పరిశ్రమలు ప్లగ్ అండ్ ప్లే విధానంలో కార్యలాపాల నిర్వహణకు సిద్ధంగా ఉండటంతో త్వరలో మరికొన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలోనే వచ్చే నెలలో విశాఖలో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో భారీగా పెట్టుబడులు సాధించాలని టార్గెట్ పెట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించిందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులు పలు దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలను కలుస్తూ విశాఖ సదస్సుకు ఆహ్వానిస్తున్నారు. దీంతో వచ్చేనెలలో ఏపీలో పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నారు. కనీసం పది లక్షల కోట్ల పెట్టుబడులు పది లక్షల ఉద్యోగాలు వచ్చేలా ఒప్పందాలు చేసుకోడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అంటున్నారు. దీంతో కూటమి ఎన్నికల హామీ 20 లక్షల ఉద్యోగాల కల్పనను నెరవేర్చే దారి లభిస్తుందని భావిస్తున్నారు. ఇక వచ్చే మూడేళ్లలో ఈ పెట్టుబడులను గ్రౌండింగ్ చేయడం వల్ల యువత ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉందంటున్నారు. ఈ కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ 15 లక్షల ఉద్యోగాలు అన్న ఆశయంతో అడుగులు వేస్తున్నట్లు కూటమి నేతలు చెబుతున్నారు.