భూ రిజిస్ట్రేషన్లపై అదిరిపోయే ఆఫర్.. ఇకపై కేవలం రూ.100 మాత్రమే..
ఏపీ ప్రభుత్వం ప్రజలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. రిజిస్ట్రేషను చార్జీల భారాన్ని అమాంతం ఒకేసారి తగ్గించేసింది.;
ఏపీ ప్రభుత్వం ప్రజలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. రిజిస్ట్రేషను చార్జీల భారాన్ని అమాంతం ఒకేసారి తగ్గించేసింది. కేవలం రూ.100 చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ప్రకటించింది. అయితే ఈ సౌకర్యం కేవలం వారసత్వంగా వచ్చే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కు మాత్రమే పరిమితం. రాష్ట్రంలో కొన్ని వేల భూ సమస్యలకు కారణం ఆయా భూములను రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడమే అని ప్రభుత్వం గుర్తించింది. తొలుత అన్నదమ్ముల మధ్య నోటి మాటలు, పెద్ద మనషుల సమక్షంలో కాగితాలపై రాయించుకుంటున్నారని, ఆ తర్వాత వారసుల మధ్య వివాదాలు పెరుగుతున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రతి లావాదేవీ రిజిస్ట్రేషన్ చేయించాలని నిర్ణయించింది.
అయితే అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలను రిజిస్ట్రేషన్ చేయంచుకోవడం పెను భారంగా మారుతోందని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించలేక కొందరు తమ భూములను రిజిస్టర్ చేయించుకోవడం లేదని గుర్తించింది. దీనివల్ల రైతులకు దక్కాల్సిన ప్రయోజనాలు కూడా అందడం లేదని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 55 వేల భూ సమస్యలు రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల పెండింగులో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చార్జీలను నామమాత్రం చేసి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ తాజా ఉత్తర్వులు ప్రకారం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి రూ.10 లక్షల లోపు ఉంటే రూ.100, ఆపైన ఉంటే రూ.1000 ఫీజును స్టాంపు డ్యూటీ కింద చెల్లించాల్సివుంటుంది. భూ యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే ఆస్తిని మాత్రమే ఈ ఫీజులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ కు ఆ ఆస్తి మార్కెట్ విలువలో ఒక శాతాన్ని స్టాంపు డ్యూటీగా వసూలు చేసేవారు.
సాధారణంగా తల్లిదండ్రుల మరణాంతరం వారసత్వంగా వస్తున్న ఆస్తులను వారసులు కాగితాలపై రాసి తమ పేర్లపై మ్యుటేషన్లు చేయాలని తహశీల్దార్ కు దరఖాస్తు చేసుకుంటున్నారు. కేవలం కాగితాలపై రాసుకోవడం వల్ల తహశీల్దార్ కార్యాలయాల్లో మ్యుటేషన్ చేయడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇదేసమయంలో రికార్డుల్లో లోపాల వల్ల భూ వివాదాలు ఎక్కువైపోతున్నాయి. గత ఏడాది ఇలా వారసత్వ భూములకు సంబంధించిన దాదాపు 55 వేల ఫిర్యాదులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీలునామా రాయకుండా యజమాని మరణిస్తే, వారసులు ఆ ఆస్తులను భాగాలుగా చేసుకుని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.100 నామమాత్రపు రుసుం తీసుకుని రిజిస్ట్రేషన్ చేయనున్నారు.