మంత్రులకు ఇన్ ఫ్లుయెన్సర్ రగడ.. !
రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ పోస్టుల భర్తీకి.. అలానే గుర్తించేందుకు కూడా జీవో జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ పోస్టుల భర్తీకి.. అలానే గుర్తించేందుకు కూడా జీవో జారీ చేసింది. ప్రభుత్వం చేస్తున్న మంచిని, పథకాలు, పెట్టుబడుల ద్వారా వచ్చే ఉద్యోగాలు, ఇప్పటి వరకు కల్పించిన ఉపాధి.. ఇలా సర్కారుకు సంబంధించిన అన్ని పాజిటివిటీలను `ఇన్ ఫ్లుయెన్సర్`లు ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. ఇప్పటి వరకు కొందరు అనధికారికంగా సర్కారుకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు వారిని అధికారికంగా మార్చనున్నారు.
ఇదేసమయంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎంత మందిని తీసుకుంటారు? ఏయే జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాలి..? అనే అంశాలు ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయి.. ఈ నెల 15 నాటికి `ఇన్ ఫ్లుయెన్సర్`వ్యవహారంపై సర్కారుకు స్పష్టత రానుంది. అయితే.. ఇప్పటికే చాలా మంది `ఇన్ ఫ్లుయెన్సర్`లు.. మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు అవకాశం ఇవ్వాలంటే.. తమకు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా విశాఖ, విజయవాడ, తిరుపతికి చెందిన పలువురు `ఇన్ ఫ్లుయెన్సర్`లు మంత్రుల సిఫారసుల కోసం వేచి చూస్తున్నారు.
అయితే.. నిబంధనల మేరకు వ్యూయర్ షిప్, వారు చేస్తున్న వీడియోలకు వస్తున్న లైకులును ప్రామాణికంగా తీసుకుంటారు. అయినప్పటికీ మంత్రుల చలవ ఉంటే ఇన్ ఫ్లుయెన్సర్ పోస్టులు దక్కించుకోవచ్చని కొందరు ప్రయత్నాలు మొదలు పెట్టారు. విజయనగరం, విశాఖల్లో ఎక్కువ మంది `ఇన్ ఫ్లుయెన్సర్`లు.. మంత్రులను కలిసేందుకు రెడీ అయ్యారు. అయితే.. ఈ విషయంలో వస్తున్న అభ్యర్థనలపై మంత్రులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.
వివాదాలు కూడా..
మరోవైపు సర్కారు తీసుకువచ్చిన ఇన్ ఫ్లుయెన్సర్ జీవోపై విమర్శలు, వివాదాలు కూడా వస్తున్నాయి. మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, జనసేన మాజీ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ సహా పలువురు విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఈ పాలసీపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఇంకోవైపు.. తమకు అవకాశాలు ఇవ్వాలని `ఇన్ ఫ్లుయెన్సర్`లు మంత్రుల వెంట పడుతున్నారు. దీంతో ఇప్పుడు ఏ మంత్రిని కదిలించినా.. పది నుంచి 15 మంది `ఇన్ ఫ్లుయెన్సర్`ల పేర్లను చెబుతున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాలి.