ప్రధాన నగరాల్లో యాచకులకు చెక్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు
దీనిని త్వరలోనే జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టి సభామోదం తీసుకుంటారు. అనంతరం గవర్నర్ ఆమోదంతో అమల్లోకి తీసుకువస్తారు.;
ఏపీలోని కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంత్రి వర్గం.. గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ప్రధానంగా యాచక (అడుక్కోవడం) వృత్తిని నిరోధించే `ఏపీ యాచక నిరోధక చట్టసవరణ ముసాయిదా బిల్లు`కు ఆమోదం తెలిపారు. దీనిని త్వరలోనే జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టి సభామోదం తీసుకుంటారు. అనంతరం గవర్నర్ ఆమోదంతో అమల్లోకి తీసుకువస్తారు.
ఈ బిల్లు ప్రకారం.. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో యాచక వృత్తిని నిషేధిస్తారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, కర్నూలు, అమరావతి, గుంటూరు, రాజమండ్రి, విజయనగరంతోపాటు, ప్రముఖ ఆలయాలైన బెజవాడ దుర్గమ్మ, అన్నవరం సత్యదేవుడు, తిరుమల, విజయనగరం రామతీర్థం, విశాఖ సింహాద్రి అప్పన్న ఆలయాల వద్ద కూడా.. యాచక వృత్తిని నిషేధిస్తారు. ఆయా నగరాలను యాచకులు లేని నగరాలుగా తీర్చిదిద్దనున్నారు.
తద్వారా.. పెట్టుబడులను మరింత ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాచకులు ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా, తమిళనాడు రెండో స్థానంలోను, ఢిల్లీ మూడో స్థానంలోను ఉంది. నాలుగో స్థానంలో ఏపీ ఉంది. దీనివల్ల.. పెట్టుబడులు, పర్యాటక ప్రాంతాలపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో యాచకులను తొలగించి.. వారికి ఉపాధి కల్పిస్తారు. విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించి.. వారిని సాధారణ పౌరులుగా జీవించేలా చేస్తారు. అంతేకాదు.. షెల్టర్‌లేని వారికి షెల్టర్లు కూడా నిర్మించి ఇస్తారు.
ఇతర నిర్ణయాలు ఇవీ..
+ రాష్ట్రంలో వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చే బిల్లుకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
+ రాష్ట్ర పర్యాటకాన్ని పరుగులు పెట్టించేలా పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాంచనుంది. కనీసం 100 కోట్లు పెట్టుబడి పెట్టేవారికి భూములు లీజు ప్రాతిపదికన ఇవ్వనున్నారు.
+ అమరావతిలో వివిధ సంస్థలకు భూములు కేటాయించనున్నారు.
+ పంచాయతీల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తారు.
+ గుంటూరు జిల్లాలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి ప్రస్తుతం ఉన్న 33 ఏళ్ల లీజును 99 సంవత్సరాలకు పొడిగించారు.
+ లిక్కర్ ధరలను మరింత తగ్గించే నిర్ణయానికి కూడా మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. తద్వారా ప్రధాన ప్రీమియం బ్రాండ్ల ధరలు తగ్గనున్నాయి.