తమిళ తంబీల నయా క్రష్ అన్నామలై.. దళపతి విజయ్, డీఎంకేలకు అసలు సిసలు టెన్షన్!
తమిళనాడు భారత రాజకీయాల్లోనే అత్యంత విలక్షణమైన గడ్డ. ద్రావిడ భావజాలం, సినిమా గ్లామర్, ప్రాంతీయ సెంటిమెంట్ల చుట్టూ తిరిగే అక్కడి రాజకీయాలు ఇప్పుడు ఒక సరికొత్త మలుపు తిరిగాయి.
తమిళనాడు భారత రాజకీయాల్లోనే అత్యంత విలక్షణమైన గడ్డ. ద్రావిడ భావజాలం, సినిమా గ్లామర్, ప్రాంతీయ సెంటిమెంట్ల చుట్టూ తిరిగే అక్కడి రాజకీయాలు ఇప్పుడు ఒక సరికొత్త మలుపు తిరిగాయి. ఫైర్ బ్రాండ్ లీడర్, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై బీజేపీకి గుడ్ బై చెప్పి ప్రారంభించిన 'వుయ్ ద పీపుల్' రాజకీయ ఉద్యమం ఇప్పుడు తమిళ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే దాదాపు 15 లక్షల మంది వాలంటీర్లు ఈ ఉద్యమం వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అసలు అన్నామలై ప్లాన్ ఏంటి, ఈ పరిణామాలు అధికార టీవీకేతోపాటు సంప్రదాయ ద్రవిడ పార్టీలకు ఎలాంటి సవాల్ విసరనుందనేదే ఆసక్తి రేపుతోంది.
తమిళనాడులో బీజేపీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో అన్నామలై పాత్ర చిన్నదేమీ కాదని విశ్లేషిస్తున్నారు. తన 'ఎన్ మణ్, ఎన్ మక్కల్' పాదయాత్రతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి యువతలో అన్నామలై విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే, గత 18 నెలలుగా బీజేపీ అధిష్ఠానంపై ఉన్న అన్నామలై కొద్దిరోజుల క్రితమే పార్టీకి రాజీనామా చేశారు. ప్రాంతీయ సెంటిమెంట్లు బలంగా ఉండే తమిళనాడులో ఢిల్లీ మార్క్ పాలిటిక్స్ వర్కవుట్ కాదని గ్రహించిన అన్నామలై చివరకు కమలానికి కటీఫ్ చెప్పారు. నేను సామాన్య ప్రజల కోసం, ఒక సామాన్యుడిలా రాజకీయం చేస్తా అంటూ ఆయన సరికొత్త పంథా ఎంచుకున్నారు. బీజేపీ అధిష్ఠానం ఆయన రాజీనామాను ఆమోదించిన నిమిషాల వ్యవధిలోనే అన్నామలై సోషల్ మీడియా వేదికగా ప్రజల ముందుకు వచ్చి, 'వుయ్ ద పీపుల్' పేరుతో రాజకీయ ఉద్యమాన్ని లాంచ్ చేశారు. ఆ మరుసటి రోజుకల్లా ఏకంగా 15 లక్షల మంది యువత, వాలంటీర్లు వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఆయనకు మద్దతు ప్రకటించారు.
ఒక కొత్త ఉద్యమానికి ఈ స్థాయిలో డిజిటల్ రెస్పాన్స్ రావడం తమిళ రాజకీయ చరిత్రలోనే అరుదైన పరిణామంగా వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా అన్నామలై తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. తనకు ప్రధాని మోదీ ఆశీస్సులు కూడా ఉన్నాయని అన్నామలై ప్రకటించడం గమనార్హం. అయితే దీనిపై ప్రస్తుత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ తీవ్రంగా స్పందించారు. తొందరపడి అన్నామలై వైపు వెళ్లిన వారు మళ్లీ బీజేపీలోకి రావచ్చని, వారిపై చర్యలు ఉండవని చెబుతూనే, మోదీ ఆశీస్సులు ఉన్నాయనడం విడ్డూరమంటూ కొట్టిపారేశారు.
తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీవీకే పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని అన్నామలై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. యువత, సినిమా అభిమానుల మద్దతుతో ముఖ్యమంత్రి విజయ్ దూసుకుపోతుండగా, ఇప్పుడు అన్నామలై రూపంలో ఆయనకు గట్టి పోటీ ఎదురైందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా విజయ్ ని గెలిపించిన యువత ఇప్పుడు అన్నామలై 'వుయ్ ద పీపుల్' వైపు భారీగా ఆకర్షితులవుతుండటం చర్చనీయాంశం అవుతోంది. మాజీ ఐపీఎస్ అధికారిగా అన్నామలైకి ఉన్నఇమేజ్, అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్, అవినీతిపై ఆయన దూకుడు విమర్శలు విద్యావంతులను, తటస్థులను బాగా ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు. దీంతోనే ఆయన ఉద్యమానికి భారీ స్పందన వస్తుందని విశ్లేషిస్తున్నారు.
మరోవైపు ఈ పరిణామాలు సంప్రదాయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే నాయకత్వాలను కలవరానికి గురిచేస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే పార్టీ పెట్టిన రెండేళ్లకే ఘన విజయం సాధించిన విజయ్ రూపంలో రాజకీయంగా నష్టపోయిన ఆ రెండు పార్టీలకు భవిష్యత్తులో అన్నామలై రూపంలోనూ ప్రమాదం పొంచివుందని అంటున్నారు. ప్రస్తుతం అన్నామలైకి లభిస్తున్న అసాధారణ మద్దతు భవిష్యత్తులో ఏ తీరానికి చేరుస్తుందోననే ఆందోళన రెండు పార్టీల నేతలను వెంటాడుతోందని అంటున్నారు. తమిళనాడు రాజకీయం ఒకప్పుడు కేవలం రెండు ద్రావిడ పార్టీల మధ్య మాత్రమే ఉండేదని, అది ఇప్పుడు చతుర్ముఖ పోటీగా మారుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.