గుంతల రోడ్లకు కొత్త పరిష్కారం.. రోటి తినేలోగానే రోడ్ల మరమ్మతులు పూర్తి!
గుంతల రహదారుల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల వాహనాలు తరచూ అదుపు తప్పడం, ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారింది.;
ఏపీలో రోడ్ల మరమ్మతులకు కొత్త టెక్నాలజీని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఈ కొత్త సాంకేతికత వల్ల మంచి ఫలితాలు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో సమస్యగా మారిన రోడ్ల గుంతలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి చాలావరకు రోడ్లు గుంతలు ఏర్పడ్డాయి. దీంతో రోడ్ల మరమ్మతులను పూర్తి చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. గత ఏడాది రోడ్ల మరమ్మతులకు దాదాపు 800 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించింది. దీంతో కొన్ని రోడ్లు బాగుపడ్డాయని ప్రజలు ఉపిరిపీల్చుకోగానే మళ్లీ వర్షాకాలం రావడం, యథావిధిగా రోడ్లు గుంతలు పడటంతో కష్టాలు మొదటికి వస్తున్నాయి. దీంతో రోడ్ల గుంతలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
గుంతల రహదారుల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల వాహనాలు తరచూ అదుపు తప్పడం, ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారింది. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో గాయపడుతున్నారు. దీంతో కలవరం చెందిన కేంద్ర రహదారి పరిశోధన సంస్థ (సీఆర్ఆర్ఐ) సీనియర్ ముఖ్య శాస్త్రవేత్త సతీష్ పాండే కొత్త టెక్నాలజీతో రోడ్ల గుంతలు పూడ్చే పద్ధతిని కనుగొన్నారు. దీనివల్ల రోడ్లపై గుంతలను నిమషాల్లోనే పూర్తి చేయొచ్చు. ఈ విధానం వల్ల త్వరగా పాడేయ్యే అవకాశం కూడా ఉండదని అంటున్నారు. ఎకోఫిక్స్ పేరుతో తీసుకువచ్చిన ఈ కొత్త టెక్నాలజీతో రోటి తినేలోగా రోడ్డు మరమ్మతులు పూర్తి చేయొచ్చని శాస్త్రవేత్త సతీష్ పాండే చెప్పారు.
ఉక్కు వ్యర్థాలను ప్రాసెస్ చేసి తయారు చేసే ఎకోఫిక్స్ తో రోడ్లు ధ్రుడంగా తయారయ్యే అవకాశం ఉందంటున్నారు. స్టీల్ ప్లాంట్లలో వచ్చే వ్యర్థాలను ఉపయోగించి వెంటనే వాడగలిగే విధంగా ఈ ఎకోఫిక్స్‌ను డాక్టర్ సతీష్ పాండే తయారు చేశారు. ఉక్కు వ్యర్థాలను ప్రాసెస్ చేసి, వాటికి ఓ ప్రత్యేక పాలిమరిక్ బైండర్ను కలుపుతారు. దాంతో అది బాగా రోడ్డుకు అతుక్కుని, నీటిని తట్టుకుని, దీర్ఘ కాలం వరకు మన్నుతుంది. దీనికి అయ్యే ఖర్చు 10 నుంచి 20 శాతం తక్కువ, మన్నిక ఎక్కువని శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ పాండే వివరించారు. కర్ణాటకలోని 141వ నంబరు రాష్ట్ర రహదారిపై గుంతలను ఎకోఫిక్స్‌తో విజయవంతంగా పూడ్చి చూపించారు.
గుంతల్లో నీళ్లు తీయకుండానే రోడ్డుకు మరమ్మతులు చేసి వెంటనే ట్రాఫిక్ పునరుద్ధరించడంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఒకే రోజు 3,400 గుంతల్ని ఈ విధానంతో పూడ్చారు. ఇప్పటికే ఈ విధానాన్ని రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చూపించారు. ఏపీలో ఆర్అండ్ బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో రాజధాని అమరావతి ప్రాంతంలో గుంతలను ఎకోఫిక్స్ తో పూడ్చిచూపించారు. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంటులో ఉన్న దాదాపు 20 నుంచి 30 టన్నుల వ్యర్థాలను దీనికి ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.