వైసీపీ అనుమతులిచ్చిన బ్రాండ్లు ఎన్ని? ఆ బ్రాండ్లే కొంప ముంచాయా?
ఏపీ మద్యం స్కాంలో వైసీపీ నేతలు అడ్డంగా బుక్కాయారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.;
ఏపీ మద్యం స్కాంలో వైసీపీ నేతలు అడ్డంగా బుక్కాయారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కాంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని బుకాయిస్తున్నప్పటికీ.. సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయని చెబుతున్నారు. ప్రధానంగా పాపులర్ బ్రాండ్లను తరి మేసిన అప్పటి ప్రభుత్వ పెద్దలు తమ జమానాలో కొత్త బ్రాండ్లను తీసుకురావడంతోపాటు ఆయా బ్రాండ్లకు నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఆర్డర్లు ఇచ్చారని సిట్ ఆధారాలు సంపాదించిందని చెబుతున్నారు. నిబంధనలు పక్కనపెట్టి అప్పట్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోనే అడ్డంగా దొరికిపోయారని అంటున్నారు.
వాస్తవానికి గత ప్రభుత్వంలోనే మద్యం బ్రాండ్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమయాయి. అయితే తాము ఒక్క కొత్త బ్రాండుకు అనుమతి ఇవ్వలేదని, చంద్రబాబు ప్రభుత్వం అనుమతించిన డిస్టలరీ, బ్రాండ్ల వద్దే మద్యం కొనుగోలు చేసి విక్రయిస్తున్నామని అప్పట్లో వైసీపీ ఆ విమర్శలను తిప్పికొట్టేది. అయితే సిట్ విచారణ తర్వాత వైసీపీ విమర్శల్లో వాస్తవం లేదన్న విషయం వెలుగు చూసిందని అంటున్నారు. వాస్తవంగా ఒక మద్యం బ్రాండుకు అనుమతి రావాలంటే నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. కొన్నిసార్లు ఏళ్లు గడిచినా కొత్త బ్రాండ్లకు అనుమతి లభించని ఉదంతాలు ఉన్నాయని అంటున్నారు. కానీ, జగన్ ప్రభుత్వంలో కొత్త బ్రాండ్లకు అడిగిన వెంటనే అనుమతించారని సిట్ ఆధారాలు సంపాదించినట్లు చెబుతున్నారు.
నిబంధనల ప్రకారం కొత్తగా వచ్చిన బ్రాండ్లకు తొలి నెలలో పది వేల కేసులకు మించి ఆర్డర్లు ఇవ్వకూడదనే నిబంధన స్పష్టంగా ఉందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కానీ, గత ప్రభుత్వంలో కొన్ని బ్రాండ్లకు అనుమతి పొందిన నెలలోనే లక్షల కేసుల్లో ఆర్డర్లు ఇచ్చారని చెబుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఎస్పీవై హెచ్డీ గోల్డ్ విస్కీకి అనుమతి లభించిందని అంటున్నారు. ఆ తర్వాత ఏడాదిన్నర కాలంలో మరో 18 బ్రాండ్లకు అనుమతించారని సమాచారం. ఇలా అనుమతించిన బ్రాండ్లకు లక్షల కేసుల ఆర్డర్లు ఇవ్వడమే స్కాంలో ప్రధాన అంశంగా సిట్ చెబుతోంది.
స్కాం ఛేదించడానికి సిట్ సేకరించిన పలు ఆధారాల్లో కొత్త బ్రాండ్లు, వాటికి ఇచ్చిన ఆర్డర్లు ప్రధానంగా ఉదహరిస్తున్నారు. ఎస్పీవై హెచ్డీ గోల్డ్ విస్కీకి 2019 నవంబర్ 22న అనుమతి లభిస్తే, ఆ వెంటనే డిసెంబరు నెలలో ఆ బ్రాండుకు ఏకంగా లక్షా 51 వేల 600 కేసుల మద్యం ఆర్డర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి బినామీ కంపెనీగా అనుమానిస్తున్న ఆదాన్స్ సుప్రీం బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ బ్రాండుకు 2020 మే 21న అనుమతి లభించిందని రికార్డులు చెబుతున్నాయి. అదే ఏడాది జులైలో ఆ బ్రాండుకు లక్ష కేసుల ఆర్డర్ ఇచ్చారు. ఇలా కేవలం నెల వ్యవధిలోనే లక్ష కేసుల ఆర్డర్ ఇవ్వడం ముందస్తుగా కుమ్మక్కు అవ్వడమే అని సిట్ ఆరోపిస్తోంది. అదేవిధంగా 2021 మార్చి 7న లైసెన్స్ పొందిన లీలాస్ బ్రిలియంట్ బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ బ్రాండ్ కు కేవలం రెండు నెలల వ్యవధిలో 69,300 కేసుల మద్యం ఆర్డర్ ఇచ్చారని, 2020 జూన్ 19న అనుమతి పొందిన ఎస్పీవై సెలబ్రిటీ బ్రాండ్ బ్రాందీకి అక్టోబరులో 35 వేల కేసుల ఆర్డర్ ఇచ్చారని సిట్ ఆధారాలు సేకరించింది.
ఇలా దాదాపు 18 కొత్త బ్రాండ్లకు అనుమతిలిచ్చిన జగన్ సర్కారు వాటికి లక్షల్లో మద్యం ఆర్డర్లు ఇవ్వడంతోపాటు రూ.వందల కోట్ల కమీషన్ కొల్లగొట్టినట్లు సిట్, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే గతంలో ఈ బ్రాండ్లు అన్నింటికి 2019 ముందు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే అనుమతిలిచ్చిందని వైసీపీ వాదిస్తోంది. అయితే వైసీపీ వాదనను తిప్పికొడుతూ ఆయా బ్రాండ్లకు ఎప్పుడు అనుమతి లభించిందనే అంశంపై ఆధారాలతోసహా పేపర్లు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. దీంతో లిక్కర్ స్కాంలో జగన్ ప్రభుత్వం అనుమతించిన బ్రాండ్ల మద్యం విక్రయాలతోనే అంతా బుక్కైపోయారనే టాక్ వినిపిస్తోంది.