అమరావతికి చట్టబద్ధత.. ఆ డౌట్ క్లియర్ చేసిన అమిత్ షా!
ఇక మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ తో రాజధాని అంశంపై కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.;
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తి భరోసా ఇచ్చారు. రాజధాని అంశంపై కేంద్రం ఏం చేస్తుందన్న ఉత్కంఠ నడుమ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విషయమై హోంమంత్రి అమిత్ షాను ఆరా తీశారు. శనివారం అసెంబ్లీలో అమరావతిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపగా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం హోంమంత్రికి ఫోన్ చేశారు. ఏపీ ప్రజల భావోద్వేగానికి సంబంధించిన రాజధానిపై చట్టం చేసే అంశంపై స్పష్టత కోరారు.
ఇక మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ తో రాజధాని అంశంపై కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తన శాఖ పరిధిలో తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామని, హోంశాఖ క్లియరెన్స్ ఇవ్వడంతో బిల్లును కేబినెట్ ముందు పెట్టడమే మిగిలివుందని అమిత్ షా వెల్లడించారు. ఈ విషయాన్ని వెంకయ్య స్థానిక మీడియాకు తెలియజేశారు. దీంతో ఏప్రిల్ 1న జరగనున్న కేంద్ర కేబినెట్ భేటీలో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానం ఆమోదించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శనివారం ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించేలా చూడాలని హోంమంత్రి అమిత్ షాను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తాను హోంమంత్రిని కోరినట్లు వెంకయ్య మీడియాకు వెల్లడించారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభ్యర్థనపై హోంమంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారని, కేబినెట్లో బిల్లును చర్చించి ఆమోదించడమే తరువాయి అని స్పష్టత ఇచ్చారన్న ప్రచారంతో రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2014లోనే రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన రకరకాల కారణాలతో కేంద్రం అమరావతిని ఇప్పటివరకు అధికారికంగా గుర్తించలేదని అంటున్నారు. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటం వల్ల అమరావతిని రాజధానిగా గుర్తించలేకపోయారని, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగిసి ఒకటిన్నరేళ్లు కావడంతో అమరావతికి లైన్ క్లియర్ అయిందని చెబుతున్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం సూచనలతో అమరావతిపై తీర్మానాన్ని కట్టదిట్టంగా చేసిందని చెబుతున్నారు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రాంతం మొత్తం రాజధానిగా గుర్తించాలని సూచించడంతోపాటు ‘ఎట్ అమరావతి’ అన్న పదం చేర్చడంతో భవిష్యత్తులో రాజధాని విషయంలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుందని వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి సైతం రాజధానిపై కీలక సమాచారం వెల్లడించడంతో ఏప్రిల్ 1 నుంచి రాజధానిగా అమరావతికి కేంద్రం కూడా గుర్తిస్తుందని అంటున్నారు.