పవన్ ని విమర్శిస్తానా...నాకు బుద్ధి లేదా ?

ఈ మాటలు అన్నది వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయన అన్న వేదిక కూడా విశేషమైనదే. తాజాగా హనుమాన్ జంక్షన్ వద్ద కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.;

Update: 2025-12-01 18:27 GMT

ఈ మాటలు అన్నది వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయన అన్న వేదిక కూడా విశేషమైనదే. తాజాగా హనుమాన్ జంక్షన్ వద్ద కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు చెందిన కాపు నాయకులు అంతా హాజరయ్యారు. ఇక అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు. ఆయన స్పీచ్ లో చిరంజీవిని పొగిడారు, రంగాను గుర్తు చేసుకున్నారు, ఇంకా చాలా మంది గురించి చెప్పారు, కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తావన అయితే ఎక్కడా చేయలేదు. దాంతో అదే హాట్ టాపిక్ అయింది.

ఆలా చేయొద్దంటూ :

ఇక అంబటి ఉత్సాహంగా దూకుడుగా తన ప్రసంగం చేస్తూండగా వేదిక దగ్గరకు వచ్చిన కొందరు మా పవన్ కళ్యాణ్ గురించి విమర్శించకండి అంటూ అంబటికి సూచించారు. దాంతో కాస్తా ఆగ్రహించిన అంబటి రాంబాబు, నేను ఏమైనా తెలివి తక్కువ వాడినా నాకు బుర్ర లేదా బుద్ధి లేదా అంటూ చిర్రుబుర్రులాడారు. మీ ముందుకు వచ్చి పవన్ ని విమర్శిస్తానా అంటూ ఫైర్ అయ్యారు. నేను రాజకీయ విమర్శలు చేసుకోవాలీ అంటే ఇంతకు మించిన పెద్ద వేదికలు ఉన్నాయని అంబటి చెప్పడం విశేషం. అంతే కాదు నాకు ఎక్కడ ఏమి మాట్లాడాలో బాగా తెలిసిన వ్యక్తిని, పిచ్చి పనులు చేసే కాదు అసలైన సిసలైన కాపుని అని అంబటి గట్టిగా చెప్పారు.

నమ్మకం లేదంటూ :

ఇక కాపులు రాష్ట్రంలో నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదిగారు కానీ రాజ్యాధికారం సాధించలేకపోయారు అని అంబటి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1989 నుంచి కాపులే పార్టీలను అధికారంలోకి తెస్తున్నారు అని ఆయన అన్నారు. ఆనాడు కాంగ్రెస్ వచ్చినా వారిదే ఘనత అన్నారు. 2024లో చంద్రబాబు గెలవడానికి కారణం కూడా కాపులే అని ఆయన చెబుతూ 2019లో వైసీపీ గెలుపు వెనక కాపులే ఉన్నారని అందుకే అత్యధిక శాతం కాపు ఎమ్మెల్యేలు గెలిచారు అన్నారు. ఇక బాబుకు కాపులు మద్దతు ఇవ్వడం వెనక అనేక కారణాలు ఉన్నాయని నర్మగర్భ వ్యాఖ్యలు ఆయన చేయడం విశేషం. అదే సమయంలో కాపులకు రాజ్యాధికారం తమ కాలంలో చూస్తామన్న నమ్మకం లేదని ఎవరైనా అది చేస్తే చూసి సంతోషించేవాడినే తాను అన్నారు.

టాలెంట్ ముఖ్యమంటూ :

చిరంజీవి సినిమాల్లో ఎదిగారు అంటే టాలెంట్ ఉండడం వల్లనే అని అన్నారు. అలాగే అంతటి సత్తా ఉన్న వారు కాపులలో పుడితే రేపటి రోజున అధికారం కూడా కాపులకు దక్కవచ్చేమో అని అంబటి అన్నారు. ఇక ప్రస్తుతం జనసేన వైపు కాపులు ర్యాలీ అయి ఉన్నారు. మరి సమీప భవిష్యత్తులో పవన్ సీఎం అవుతారని అంబటి అనుకోవడం లేదా అన్న చర్చ కూడా ఉంది. అయితే పదిహేనేళ్ళ పాటు కూటమి అధికారంలో ఉండాలని పవన్ కోరుకోవడం వల్లనే ఆయన ఈ అభిప్రాయానికి వచ్చారా అన్నది మరో మాటగా ఉంది. ఏది ఏమైనా కాపులలో రాజ్యాధికారం లేదన్న అసంతృప్తి ఉంది అన్న దానిని అంబటి రాంబాబు హైలెట్ చేయగలిగారు. ఒక విధంగా దూకుడుగా మాట్లాడిన రాంబాబు తాను కమిట్ మెంట్ ఉన్న నాయకుడిని అని అందుకే ఒకే పార్టీని నమ్ముకున్నాను అని చెప్పారు. మొత్తం మీద వైసీపీ ముద్ర నుంది కాస్తా బయటపడీ పడకుండా అంబటి కాపుల సభలో తన స్పీచ్ ని ఇచ్చారు. అయితే జనసేన యువత మాత్రం అంబటి స్పీచ్ ఇస్తూంటే మా పవన్ గురించి మాట్లాడొద్దు విమర్శలు చేయవద్దు అంటూ చెప్పడమే హైలెట్ పాయింట్ గా ఉంది.

Tags:    

Similar News