ఫ్యూచర్ సిటీ వర్సెస్ అమరావతి.. పోటాపోటీగా గురుశిష్యులు!

అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు.;

Update: 2025-10-01 17:30 GMT

ఏపీ రాజధాని అమరావతి, తెలంగాణ నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రెండు రాష్ట్రాలూ ఆర్థిక విప్లకం కోసం ఈ రెండు నూతన నగరాలను ప్రతిపాదిస్తున్నాయి. రాజధాని లేని రాష్ట్రంగా ఆవిర్భవించిన ఏపీలో దాదాపు పదేళ్ల క్రితం అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. అయితే వివిధ రాజకీయ కారణాల వల్ల ఈ రాజధాని నగర నిర్మాణంలో తీవ్రమైన జాప్యం జరిగింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు 4.0 ప్రభుత్వంలో ప్రస్తుతం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తన మార్కు చూపించుకునేందుకు ఫ్యూచర్ సిటీని నిర్మించాలని కదులుతున్నారు.

రెండు రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయి నగరాలుగా నిర్మిస్తున్న అమరావతి, ఫ్యూచర్ సిటీపై అనేక అంచనాలు, ఆశలు పెట్టుకున్నాయి ప్రభుత్వాలు. అయితే ఈ రెండు నగరాలను ఆయా రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు తిరస్కరిస్తున్నాయి. అమరావతిని తొలి నుంచి విభేదిస్తున్న వైసీపీ ఇప్పటికీ తన తీరు మార్చుకోలేదని, ఇటీవల కురిసిన వర్షాలను అడ్డుపెట్టుకుని తన వైఖరి మరోసారి బయటపెట్టింది. ఇక తెలంగాణలో ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై బీఆర్ఎస్ కూడా తీవ్ర వ్యతిరేకత చూపుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు మహానగరాల నిర్మాణం రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.

అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. పూర్తిగా ప్రణాళికాబద్దంగా నవ నగరాల కాన్సెప్ట్ తో అమరావతికి పునాదులు వేయగా, నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదనంగా మరిన్ని ప్రాజెక్టులను జత చేసి అమరావతి నుంచి నవశకానికి నాంది పలుకుతున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. ఏఐ సిటీ, డ్రోన్ క్యాపిటల్, క్వాంటం వ్యాలీ ఇలా దేశంలోనే టెక్ కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దాలని చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి సైతం ఫ్యూచర్ సిటీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద 500 ఫార్చూన్ ఇండిస్ట్రీలను హైదరాబాద్ లోని ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తానని ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా న్యూయార్క్, టోక్యో వంటి మహానగరాలను మించిన సదుపాయాలతో ఆయా నగరాలను మరిపిస్తానని చెబుతున్నారు.

లక్షల కోట్లతో 50 వేల ఎకరాల్లో అమరావతిని... దాదాపు 30 వేల కోట్లతో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి రెండు ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభమై చురుకుగా సాగుతుండగా, రెండు రోజుల క్రితం ఫ్యూచర్ సిటీకి పునాది రాయి పడింది. ఈ పరిస్థితుల్లో తెలుగు నేలపై ప్రపంచ స్థాయి నగరాల నిర్మాణంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇద్దరు ముఖ్యమంత్రులు చెబుతున్నట్లు నిర్దేశిత సమయంలో ఈ రెండు నగరాలు నిర్మాణం పూర్తయితే లక్షల ఉద్యోగాలు కొత్తగా పుట్టుకు రావడం ఖాయమంటున్నారు. అయితే లక్ష కోట్లు అవసరమైన అమరావతికి, 30 వేల కోట్లు అవసరమైన ఫ్యూచర్ సిటీకి నిధుల సమస్య వెంటాడుతోంది. అమరావతికి ఇప్పటివరకు 30 వేల కోట్లు సమకూరగా, మిగిలిన నిధులు సర్దుబాటు సవాల్ విసురుతోంది. అదే సమయంలో తెలంగాణలో ఫ్యూచర్ సిటీతోపాటు మెట్రో ఇతర పనుల కోసం వేల కోట్లు ఎలా సమకూరుతాయనేది ఉత్కంఠకు గురిచేస్తోంది.

అయితే నిధుల సమస్య ఎలా ఉన్నప్పటికీ ఇద్దరు ముఖ్యమంత్రులు పోటాపోటీగా తమ డ్రీమ్ ప్రాజెక్టు పనులను పరిగెత్తించేలా పనిచేస్తుండటమే విశేషంగా చెబుతున్నారు. ఇప్పటికే హైటెక్ సిటీ కట్టిన అనుభవంతో చంద్రబాబు దూకుడు చూపుతుండగా, ఆయన శిష్యుడిగా సహచరుడిగా రేవంత్ రెడ్డి కూడా తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నారని చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రం సహకరిస్తూ కొంత భారం పంచుకునేందుకు ముందుకు వస్తోందని అంటున్నారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ భారాన్ని ఎలా అధిగమిస్తారనేది చూడాల్సివుంది. ఏదిఏమైనా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఈ పోటీ వాతావరణం చర్చకు దారితీస్తోంది.

Tags:    

Similar News