మెడికల్ వార్ లోకి ఆమరావతి...ముడి పెట్టేసిన వైసీపీ !
అయితే అమరావతి రాజధాని విషయంలో వైసీపీ గతంలో ఎలా ఉన్నా ఇపుడు సౌండ్ మార్చింది. అధికంగా ఖర్చులు నిర్మాణాలకు వెచ్చిస్తున్నారు అని అంటోంది తప్ప రాజధాని అక్కడే ఎందుకు అని మాత్రం అనడం లేదు.;
ఏపీలో అమరావతి టీడీపీ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రయారిటీ అన్నది అందరికీ తెలిసిందే. అందుకే 2024 లో అధికారం ఇలా చేతిలో పడగానే అలా అమరావతి మీదనే ఫుల్ ఫోకస్ పెట్టేసింది. 2029 ఎన్నికల నాటికి తొలి దశ పనులు పూర్తి చేయాలని కూడా నిర్ణయించింది. ఈసారి అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలిస్తూండడంతో కూడా కూటమికి కలసి వస్తోంది. కేంద్రంలో తమ ఎంపీల మద్దతుతో మోడీ ప్రభుత్వం ఏర్పాటు కావడం కూడా మరో అదృష్టంగానే ఉంది. దీంతో తాము అనుకున్నట్లుగా ఏదో రూపునకూ షేపునకూ అమరావతిని తీసుకుని వచ్చి 2029 ఎన్నికలకు వెళ్ళాలని టీడీపీకి పట్టుదలగా ఉంది.
రాజధాని ఓకే కానీ :
అయితే అమరావతి రాజధాని విషయంలో వైసీపీ గతంలో ఎలా ఉన్నా ఇపుడు సౌండ్ మార్చింది. అధికంగా ఖర్చులు నిర్మాణాలకు వెచ్చిస్తున్నారు అని అంటోంది తప్ప రాజధాని అక్కడే ఎందుకు అని మాత్రం అనడం లేదు. పైగా తాము వచ్చినా అక్కడ నుంచే పాలిస్తామని కూడా నమ్మబలుకుతోంది. సో అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ మారుకుంది అని అంటున్నారు. అదే సమయంలో మిగిలిన ప్రాంతాల అభివృద్ధి గురించి కూడా వైసీపీ మాట్లాడకుండా సమగ్ర అభివృద్ధి అన్న అజెండాను కూటమి ఎత్తుకుని ముందుకు సాగుతోంది. అలాగని నిధులు మిగిలిన ఓట్ల ఏ మేరకు వెచ్చిస్తోంది అన్నది కూడా వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.
లాజిక్ తో కొడుతున్న వైనం :
ఇదిలా ఉంటే ఏపీలో అమరావతి అన్నది లక్షల కోట్ల వ్యవహారం అన్నది తెలుసు. దాని కోసం వేల కోట్ల నిధులను కూడా రుణాల రూపంలో తెస్తున్నారు. అది కూడా అందరికీ తెలుసు. అయితే ఎంత రుణం తెచ్చినా అమరావతి రాజధాని కోసమే కదా అని జన సామాన్యంలో అనుకుంటున్న నేపథ్యం ఉంది. సరిగ్గా ఇక్కడే వైసీపీ ఒక లాజిక్ పాయింట్ ని లేవదీస్తోంది. అమరావతి రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు కదా మెడికల్ కాలేజీల నిర్మాణానికి అయిదు వేల కోట్లు కూడా లేని ప్రభుత్వం ఎలా రాజధాని నిర్మిస్తుంది అని లా పాయింట్ లాగి మరీ ఇరకాటంలో పెట్టేసింది.
నిజమే కదా అనుకునేలా :
ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో చెబుతున్నది ఏమిటి అంటే ప్రభుత్వం బ్రహ్మాండమైన భవనాలు కట్టించాలని పీపీపీ మోడల్ కి మెడికల్ కాలేజీలను ఇస్తున్నామని. మరి కేవలం అయిదు వేలు ఖర్చు పెడితే రాష్ట్రవ్యాప్తంగా పదిహేడు కళాశాలలు అందుబాటులోకి వస్తాయి కదా ఆ ఖర్చుకు కూడా సర్కార్ వద్ద డబ్బులు లేవని తెలుస్తోంది అని వైసీపీ విమర్శిస్తోంది. అందుకే పీపీపీ అంటోంది అని ఎకసెక్కమాడుతోంది. ఇంత తక్కువ నిధులే లేకుంటే లక్షల కోట్లతో అమరావతి ఎలా కడతారు అని అతి పెద్ద డౌటానుమానం వైసీపీ వ్యక్తం చేస్తూ దానినే జనంలోకి పంపిస్తోంది.
జనంలో కట్టలేరంటూ :
చంద్రబాబు అమరావతిని జన్మలో కట్టలేరు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు, మెడికల్ కాలేజీలకే డబ్బులు లేవని ప్రైవేట్ రాగాలు ఆలపిస్తున్న వారు లక్షల కోట్లతో ఎలా రాజధానిని కడతారు అని ఆయన నిలదీస్తున్నారు. ఈ లాజిక్ తో కూడిన ప్రశ్నలకు కూటమి పెద్దలు ఎలా జవాబు చెబుతారో తెలియదు కానీ అమరావతికి మెడికల్ కాలేజీలకు వైసీపీ ముడి పెట్టేసి చోద్యం చిత్తగిస్తోంది అని అంటున్నారు.