అమరావతికి పదేళ్ళు...దసరా ఎపుడు ?

అలాంటిదే ఏపీలో అమరావతి రాజధాని వ్యవహారం. అమరావతి రాజధాని ఎపుడు పూర్తి అవుతుంది అంటే కూటమి పాలకులు మొదటి దశ 2028 నాటికి పూర్తి చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.;

Update: 2025-10-02 13:46 GMT

కొన్ని విషయాల్లో ఎందుకు అలా జరుగుతుంది అంటే జవాబు ఎవరూ చెప్పలేరు. ఊహలకే వదిలేయాలి. అలాంటిదే ఏపీలో అమరావతి రాజధాని వ్యవహారం. అమరావతి రాజధాని ఎపుడు పూర్తి అవుతుంది అంటే కూటమి పాలకులు మొదటి దశ 2028 నాటికి పూర్తి చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే ఎంతో మేలు జరిగినట్లే అని అంటున్నారు. అయితే అమరావతి రాజధాని విషయంలో ఏమి జరిగింది, ఏమి జరగబోతోంది అన్నది కూడా చాలా ఆసక్తికరమైన వ్యవహారమే అని భావించాలి.

విజయదశమి ముహూర్తం :

అమరావతి రాజధానికి 2025 విజయదశమితో అక్షరాలా పదేళ్ల కాలం పూర్తి అయింది. 2015 అక్టోబర్ 22న అంటే ఆ రోజున విజయదశమి వచ్చింది. ఆనాడు అమరావతి రాజధానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆనాడు కేంద్ర మంత్రి హోదాలో ఎం వెంకయ్యనాయుడు హాజరయ్యారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు వచ్చారు ఇక పొరుగున ఉన్న తెలంగాణా నుంచి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారు. చాలా అంగరంగ వైభవంగా ఏపీ రాజధానికి శ్రీకారం చుట్టారు. అది మొదలు అమరావతి రాజధాని మీద అయిదు కోట్ల జనాలు ఆశలు మోసులు గా చేసుకుని వేచి చూస్తున్నారు

మూడున్నరేళ్ళ అధికారం :

ఇక అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశాక మూడున్నరేళ్ళ పాటు తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంది. 2019 జూన్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం తొలి ఆరు నెలల పాటు అమరావతి గురించి ఏమీ మాట్లాడలేదు సరిగ్గా 2019 డిసెంబర్ లో జరిగిన శీతాకాల సమావేశంలో మూడు రాజధానుల ప్రతిపాదనతో అందరికీ షాక్ తినిపించింది. ఆ తరువాత అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు కోర్టు కేసులు ఉద్యమాలు ఇలా అనేక విధాలుగా కాలం గడచిపోయింది ఈ మధ్యలో అమరావతి రాజధాని విషయంలో రాజకీయం పూర్తిగా చేరి అసలు ఆ వైపు కూడా చూసే పరిస్థితి కనిపించలేదు

వస్తూనే జోరుతో :

ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి కట్టి అధికారంలోకి వచ్చింది. వస్తూనే అమరావతి రాజధాని విషయంలో జోరు పెంచింది. వివిధ రకాల ఏజెన్సీల వద్ద నుంచి రుణాలను తీసుకుని వచ్చింది. అమరావతి పునర్నిర్మాణం

పనులకు మరోసారి ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. దాంతో ప్రస్తుతం పనులు అయితే జరుగుతున్నాయి. అయితే అమరావతి ప్రాజెక్టు పూర్తిగా ఎపుడు అవుతుంది అన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అమరావతి రాజధాని 33 వేల ఎకరాలను విస్తరించి ఉంది. అన్నీ ఒకేసారి రావు. అంతా ఒకేసారి జరగదు.

దశల వారీగానే :

అమరావతి విషయంలో చూసుకుంటే దశల వారీగానే నిర్మాణం పనులు అవుతాయని అంటున్నారు. తొలిదశలో ప్రభుత్వ భవనాలు ఉద్యోగుల నివాసాలు ఇతరత్ర పూర్తి చేస్తారు. అంతే కాదు ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూములలో వారి కార్యకలాపాలు పూర్తి చేసేందుకు కూడా తదుపరి దశలలో ఉంటుంది. ఇక పెట్టుబడులను తీసుకుని వచ్చి అమరావతిలో సంస్థలను స్థాపించేది మరో దశలో ఉంటుంది. మౌలిక సదుపాయాల కల్పన అన్నది కూడా ప్రతీ దశలోనూ ఉంటుంది. దానిని చేయాల్సిన బృహత్తర బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇది భారీ నిధులతో పాటు ఇతరత్రా అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

రైతులకు న్యాయం :

మరో వైపు చూస్తే తాము ఇచ్చిన భూములకు బదులుగా కమర్షియల్ ప్లాట్స్, అలాగే రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు పదేళ్ళు అయినా వారి కలలు అలాగే ఉండిపోయాయి. అయితే వారికి పూర్తి న్యాయం జరగాలని డిమాండ్ అయితే ఉంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అసెంబ్లీలో అమరావతి రైతుల గురించి ప్రస్తావించారు. మొత్తం మీద అమరావతికి శ్రీకారం చుట్టిన తరువాత ఇది పదవ విజయదశమిగా అంతా గుర్తు చేసుకుంటున్నారు. మరి అమరావతి రాజధాని పూర్తి అయి అందరి కళ్ళలో ఇళ్ళలో దసరా ఎపుడు వస్తుంది అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. దాని కోసమే ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News