అమరావతికి చట్టబద్ధతతో కేంద్రం బాధ్యత సరేనా?

ఏపీకి రాజధాని అమరావతి అన్న దాని మీద చట్టబద్ధత కల్పించే విషయం కూడా లేటుగా జరిగింది.;

Update: 2026-04-01 19:30 GMT

ఉమ్మడి ఏపీని అడ్డగోలుగా నాటి యూపీఏ ప్రభుత్వం విభజించింది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా పూర్తి మద్దతు ప్రకటించింది. దాంతోనే ఈ విభజన సాధ్యమైంది. ఇక 2014 ఎన్నికల ముందు ఏపీలో నాటి ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్ధిగా పర్యటించిన నరేంద్ర మోడీ అనేక చోట్ల మాట్లాడుతూ ఢిల్లీని తలదన్నే రాజధానిని ఏపీకి నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే పుష్కర కాలం గడచింది కానీ ఏపీ రాజధాని ఇంకా ఒక రూపునకూ షేపునకూ రాలేదు, కేంద్రం అయితే ఏపీ రాజధాని విషయంలో తమకేమీ సంబంధం లేనట్లుగానే వ్యవహరించింది అన్న విమర్శలు ఉన్నాయి.

చట్టబద్ధత లేటుగా:

ఏపీకి రాజధాని అమరావతి అన్న దాని మీద చట్టబద్ధత కల్పించే విషయం కూడా లేటుగా జరిగింది. ఇక అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా చేస్తున్న ఆర్థిక సాయం ఎంత అన్నది చూస్తే నిరాశే కలుగుతుంది. మొత్తం మీద గడచిన పుష్కర కాలంలో రెండు వేల అయిదు వందల కోట్ల రూపాయల దాకా ఇచ్చినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇంత తక్కువ మొత్తంతో రాజధాని అన్నది పూర్తి అయితే కాదు, అయితే ఏపీలో టీడీపీ ప్రభుత్వం అతి పెద్ద రాజధానికి పూనుకుంది. దాంతో దానికి అయ్యే భారీ ఖర్చుని కేంద్రం భరించకపోవచ్చు కానీ కేంద్రం ఇవ్వాలనుకున్న మొత్తం కనీసంగా ఏ పాతిక వేల కోట్ల రూపాయలుగానో అయిన ఉంటేనే అమరావతి రాజధాని వేగంగా నిర్మాణం జరుపుకుంటుంది. ఇది గ్రాంట్ ఇని ఎయిడ్ కింద కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో వివిధ ఏజెన్సీల ద్వారా రుణాలను ఇప్పించే విషయంలో కేంద్రం పూచీకత్తు పడడం మంచిదే కానీ కేంద్రం కూడా ఏపీని ఆదుకోవాల్సి ఉంది అని అంటున్నారు.

వీటి సంగతేంటి :

ప్రతీ ఏటా యాభై లక్షల కోట్ల రూపాయలకు తక్కువ లేకుండా కేంద్ర బడ్జెట్ ని ప్రవేశ పెడుతున్నారు అందులో ఏపీ వంటి విభజన గాయాలతో బాధపడుతున్న రాష్ట్రానికి ఏపీ పునర్ నిర్మాణం కోసం కేంద్రం ఉదారంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదా అన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం చూస్తే పూర్తిగా ఏపీకి చెందిన ఎంపీల మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. అయినా సరే అమరావతికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు విదల్చలేదన్నది అంతా గమనిస్తున్నారు. ఇక ప్రత్యేక హోదా విషయం కూడా తాజాగా లోక్ సభలో జరిగిన చర్చలో పలువురు ఎంపీలు కేంద్రానికి గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాని కనీసం పదేళ్ళు అయినా ప్రకటించాల్సి ఉంది. అలాగే విభజన హామీలను కేంద్రం పట్టించుకుని నెరవేర్చాలి. అంతే కాకుండా భారీ రెవిన్యూ లోటుతో విడిపోయిన రాష్ట్రానికి అన్ని విధాలుగా అండగా ఉంటూ కేంద్రం ఏపీని మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడే స్థాయిలో ఉంచాల్సి ఉంది అని అంటున్నారు.

అనైక్యత అడ్వాంటేజ్ గా :

ఏపీలో రాజకీయమే కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి అడ్వాంటేజ్ గా ఉంది అని అంటున్నారు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఏ ఒక్క అంశంలోనూ ఐక్యత లేదు, కలసికట్టుగా కేంద్రం మీద ఒత్తిడిని తెచ్చే కార్యక్రమం లేదు, దాంతోనే కేంద్ర ప్రభుత్వం నిర్పూచీగా ఉంటోంది అని అంటున్నారు. లోక్ సభలో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే అంశం మీద జరిగిన చర్చలో అనేక మంది ఏపీ కోసం చాలా విషయాలు చెప్పారు, సూచనలు చేశారు. కానీ అధికార బీజేపీ నుంచి ఏ ఒక్క హామీ అయితే రాలేదు అన్నది గుర్తుంచుకోవాలి. ఇపుడు అమరావతికి చట్టబద్ధత ఇచ్చామని అదే గొప్ప అన్నట్లుగా కేంద్రం చెప్పుకుంటే ఏపీ ప్రజలకు ఒరిగేది ఏముంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఏపీ రాజధాని విషయంతో పాటు పోలవరం, ప్రత్యేక హోదా ఇతర విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని అంతా కోరుతున్నారు. చూడాలి మరి కేంద్రం స్పందన ఎలా ఉంటుందో.

Tags:    

Similar News