ఇండియా కూటమి సారధిగా అఖిలేష్...బీఆర్ఎస్ వైసీపీ ఓకేనా ?
ఇక ఎప్సీ అధినేత అఖిలేష్ యాదవ్ తాజాగా తెలంగాణా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.;
ఇండియా కూటమిలో భారీ మార్పులు రాబోతున్నాయా అన్న చర్చ సాగుతోంది. ఎందుకు అంటే ఈ మధ్యనే బీహార్ ఎన్నికల ఫలితాలు కూటమిలో కొత్త చర్చను లేవదీశాయి. కాంగ్రెస్ పార్టీ మీద ఇండియా కూటమిలోని పార్టీలు అన్నీ గుర్రు మీద ఉన్నాయి. కాంగ్రెస్ తో పెట్టుకుని దారుణంగా సీట్లను తగ్గించుకున్నామని ఒక వైపు ఆర్జేడీ కూడా మధన పడుతోంది. ఇంకో వైపు ఆప్ వంటి పార్టీలు ఇప్పటికే దూరం పాటిస్తున్నాయి. ఈ సమయంలోనే ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన, డీఎంకే వంటి పార్టీలు కూడా ఇండియా కూటమిలో మార్పులు అవసరం అని నొక్కి చెప్పాయి. ఇక యూపీలో కీలక ప్రతిపక్షంలో ఉన్న ఎస్పీ అధినేత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఇండియా కూటమి నాయకత్వంలో మార్పు రావాలని నినదించారు.
కాంగ్రెస్ ని తగ్గించాలని :
కట్ చేస్తే ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రాధాన్యతను తగ్గించాలని ఇతర పార్టీలు చూస్తున్నాయి. ఇక అఖిలేష్ యాదవ్ కి సారధ్య బాధ్యతలు అప్పగించాలని కూడా కోరుతున్న వారూ పెరుగుతున్నారు ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ సైతం విపక్ష శిబిరానికి నాయకత్వం వహించేందుకు ఉత్సాహంగా ఉన్నారని అంటున్నారు కాంగ్రెస్ తరువాత పెద్ద పార్టీగా ఎస్పీ ఉంది అన్నది తెలిసిందే. యూపీ నుంచి ఏకంగా 37 ఎంపీ సీట్లతో ఎస్పీ కీలకంగా ఉంది. ఈ నేపధ్యంలో యూపీ అంటేనే దేశ రాజకీయాలను మలుపు ఇప్పే స్టేట్ గా చెబుతారు. దాంతో ఈ యువ నేత ఇండీ కూటమికి నాయకత్వం వహించాలని చూస్తున్నారు అని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల వైపు :
ఇక ఎప్సీ అధినేత అఖిలేష్ యాదవ్ తాజాగా తెలంగాణా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అదే విధంగా విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ని కూడా కలిసారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కాలమెప్పుడు ఒక్కలా ఉండదని రాష్ట్రంలో మార్పులు వస్తాయని చెప్పుకొచ్చారు. అంటే బీఆర్ఎస్ కి అధికారం దక్కుతుందని ఆయన అన్నారని అనుకోవాలని అంటున్నారు పక్కనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ని పెట్టుకుని అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఆలోచనలు ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది. మరో వైపు ఎస్పీ ని దాని అధినాయకుడినీ కేటీయార్ పొగిడారు. యూపీలో 37 ఎంపీ సీట్లు సాధించి పెద్ద పార్టీగా ఉన్న ఎస్పీ తనకు స్పూర్తి అని కేటీయార్ చెప్పుకున్నారు.
ఇండీ కూటమిలోకి :
ఇక ఇండియా కూటమిలో ఇప్పటికే అనేక పార్టీలు ఉన్నాయి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ తో నేరుగా పోరు ఉండడంతో ఆ పార్టీ నాయకత్వం వహిస్తున్న ఇండీ కూటమిలో బీఆర్ఎస్ చేరలేదని అంటున్నారు. అయితే ఇండీ కూటమి నాయకత్వం మారి అది అఖిలేష్ యాదవ్ చేతికి వస్తే కనుక బీఆర్ఎస్ తన ఆలోచనలు మార్చుకోవచ్చు అని అంటున్నారు. అపుడు జాతీయ స్థాయిలో ఒంటరి తనాన్ని తటస్థ వాదాన్ని వీడి బీఆర్ఎస్ కూడా ఇండీ కూటమిలో చేరవచ్చు అని అంటున్నారు.
వైసీపీ సంగతేంటి :
మరో వైపు చూస్తే ఏపీలో వైసీపీది కూడా ఇదే రకమైన పరిస్థితి అని అంటున్నారు. కాంగ్రెస్ తో ఎప్పటికీ పడని రాజకీయ వైరాన్ని వైసీపీ కంటిన్యూ చేస్తోంది. అయితే అఖిలేష్ యాదవ్ తో జగన్ కి మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ అఖిలేష్ యాదవ్ చేతికి నాయకత్వం వస్తే ఇండియా కూటమిలో చేరేందుకు వైసీపీకి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు అన్న మాటా వినిపిస్తోంది. మొత్తానికి అఖిలేష్ యాదవ్ చూపు కూడా జాతీయ రాజకీయాల మీద ఉందని అందుకే తెలుగు రాజకీయాల మీద ఫోకస్ పెట్టారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.