పాకిస్థాన్ ఘోర దుశ్చర్య... ముగ్గురు ఆఫ్గనిస్తాన్ క్రికెటర్లు మృతి!
ఆఫ్గాన్ – పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. బుధవారం సాయంత్రం 6:00 గంటల నుంచి 48 గంటల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.;
ఆఫ్గాన్ – పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. బుధవారం సాయంత్రం 6:00 గంటల నుంచి 48 గంటల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే అది పాక్ వ్యూహాత్మక సీజ్ ఫైరా అనే అనుమానం వచ్చే ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఆఫ్గాన్ పై పాక్ వైమానిక దాడి చేసింది.
అవును... పాకిస్తాన్ - ఆఫ్గనిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. ఇందులో భాగంగా... ఆఫ్గన్ భూభాగంపై పాక్ భారీగా వైమానిక దాడులకు దిగింది. ఈస్ట్రన్ పాక్టికా ప్రావిన్స్ పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు క్రికెటర్లు ఉన్నారనే విషయం వైరల్ గా మారింది.
తాజాగా ఈ విషయంపై స్పందించిన అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ).. పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో మృతిచెందినవారిలో ముగ్గురు దేశవాళీ క్రికెటర్లు ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ పోస్టు పెట్టింది. ఈ విషయం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారింది. క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాద వార్తగా మారింది.
ఈ విషయాలపై స్పందించిన ఏసీబీ... పాక్టికా ప్రావిన్స్ లోని ఉర్గున్ జిల్లాకు చెందిన ముగ్గురు క్రికెటర్లు పాక్ వైమానిక దాడిలో ప్రాణాలు విడిచారని.. పాక్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన దాడిలో అఫ్గాన్ పౌరులు మృతి చెందారని చెబుతూ... దీనిపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని వెల్లడించింది. మృతి చెందిన 8 మందిలో ముగ్గురు క్రికెటర్లు ఉన్నారని తెలిపింది.
ఈ క్రమంలో... పాక్టికా ప్రావిన్స్ రాజధాని శరణకు స్నేహపూర్వక మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన ముగ్గురు క్రికెటర్లు కబీర్ అఘా, సిబ్గుతుల్లా, హరూన్ తిరిగి ఉర్గున్ వస్తుండగా ఈ దాడి జరిగిందని.. వారి మృతి అఫ్గాన్ అథ్లెట్, క్రికెటింగ్ ఫ్యామిలీకి తీరని లోటుగా భావిస్తున్నామని చెబుతూ... మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించింది.
ట్రై సిరీస్ నుంచి వైదొలిగిన ఆఫ్గన్!:
తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆఫ్గన్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి... పాకిస్తాన్ - ఆఫ్ఘనిస్తాన్ - శ్రీలంక జట్ల మధ్య నవంబర్ 17 నుండి 29 వరకు ఈ ముక్కోణపు సిరీస్ జరగాల్సి ఉంది. రావల్పిండి, లాహోర్ దీనికి వేదికలు కాగా... సెప్టెంబర్ లో పాక్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్ ను ప్రకటించింది. అయితే.. ఆజా పరిణామాల నేపథ్యంలో ఈ ట్రై – సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఏసీబీ ప్రకటించింది.
స్పందించిన రషీద్ ఖాన్!:
పాకిస్తాన్ సైనిక దాడుల్లో ముగ్గురు యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడంపై ఆఫ్గన్ కెప్టెన్ రషీద్ ఖాన్ స్పందిస్తూ.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో... త్రైపాక్షిక సిరీస్ నుండి వైదొలగడాన్ని సమర్థించారు. ఈ సందర్భంగా... పాక్ వైమానిక దాడులు అనైతికమైనవి, అనాగరికమైనవిగా అభివర్ణించారు. ఈ దాడుల్లో తమదేశ అమాయక పౌరుల మరణం తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.
పౌరులను లక్ష్యంగా చేసుకోవడం మానవ హక్కుల ఉల్లంఘన అని రషీద్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ దుర్ఘటనలో మహిళలు, పిల్లలు, అలాగే ప్రపంచ వేదికపై తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన మరో అంతర్జాతీయ ఆటగాడు మహ్మద్ నబీ మాట్లాడుతూ... ఈ సంఘటన పాక్టికాకు మాత్రమే కాదు, మొత్తం ఆఫ్గన్ క్రికెట్ కుటుంబానికి, మొత్తం దేశానికి విషాదమని అన్నారు. ఈ ఊచకోత క్షమించరాని నేరం అని ఆఫ్గన్ అంతర్జాతీయ క్రికెటర్ ఫజల్హాక్ ఫరూఖీ ఫేస్ బుక్ లో రాశారు.