తెలంగాణ రాజకీయాల్లో మరో వాసురుడి ఎంట్రీ..!
తెలంగాణ రాజకీయాల్లో మరో వారసుడి ఎంట్రీ గురించి ఇప్పుడు చర్చ మొదలైంది. కవిత కుమారుడు ఆదిత్య తాజాగా ఖైరతాబాద్ చౌరస్తాలో జరిగిన బీసీ రిజర్వేషన్ల బంద్ నిరసనలో పాల్గొనడం ఈ చర్చకు నాంది పలికింది.;
తెలంగాణ రాజకీయాల్లో మరో వారసుడి ఎంట్రీ గురించి ఇప్పుడు చర్చ మొదలైంది. కవిత కుమారుడు ఆదిత్య తాజాగా ఖైరతాబాద్ చౌరస్తాలో జరిగిన బీసీ రిజర్వేషన్ల బంద్ నిరసనలో పాల్గొనడం ఈ చర్చకు నాంది పలికింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో కలిసి ఆదిత్య కూడా మానవహారం కార్యక్రమంలో పాల్గొని నినాదాలు చేయడం, తన చేతిలో ‘42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి’ అని రాసిన ఫ్లకార్డు పట్టుకోవడం ఇవన్నీ సాధారణంగా కాదని ఇది వారసుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.
తల్లితో పాటు పాల్గొన్న కుమారుడు..
ఇది కేవలం తల్లి కార్యక్రమంలో కుమారుడి పాల్గొనడం కాదు.. కొత్త రాజకీయ వారసత్వ సంకేతం కూడా కావచ్చు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత, ఆమె రాజకీయ జీవితం కొత్త మార్గంలో నడుస్తున్న వేళ, ఆదిత్య రంగప్రవేశం ఆమెకు నూతన ఉత్సాహం ఇచ్చే పరిణామం అవుతుంది. ఒకప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు వంటి వారసులు తెలంగాణ రాజకీయానికి కొత్త దిశ చూపినట్లే, ఇప్పుడు ఆదిత్య కూడా ఆ వారసత్వాన్ని మరో తరానికి కొనసాగించబోతున్నాడనే చర్చ వేగంగా వ్యాపిస్తోంది.
రీసెంట్ గా ఇండియాకు..
విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తి చేసి తాజాగా ఇండియాకు తిరిగి వచ్చిన ఆదిత్య, నిరసనలో తన మాటలతో ఆకట్టుకున్నాడు. ‘కేవలం మా అమ్మ మాత్రమే పోరాటం చేస్తే సరిపోదు, ప్రతి ఇంటి నుంచి అందరూ బయటకు రావాలి’ అన్న ఆయన వ్యాఖ్య, తనలోని సామాజిక అవగాహనను, రాజకీయ మద్దతును సూచిస్తోంది. ఒక యువ నాయకుడిగా తాను మొదటి అడుగు వేస్తున్న సంకేతం ఇది.
కవితకు కొత్త ఉత్సాహం..
ఈ దృశ్యం కేవలం ఒక నిరసన కాదు.. ఒక కొత్త రాజకీయ సన్నివేశం పుట్టుక. తల్లి కవిత తన రాజకీయ స్వతంత్రతను రుజువు చేసేందుకు కృషి చేస్తుండగా.. కుమారుడు ఆదిత్య ఆ యత్నానికి కొత్త ఉత్సాహం తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తెలంగాణ రాజకీయ వేదికపై ‘కల్వకుంట్ల ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్’ ప్రవేశమని చెప్పవచ్చు.
ఆదిత్య ఏ మేరకు ఉపయోగపడగలడు..?
అయితే, ఈ ప్రయాణం సులభం కాదు. రాజకీయ వారసత్వం అంటే కేవలం పేరు కాదు.. అది ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే సుదీర్ఘ ప్రయాణం. ఆదిత్యకు ఆ మార్గం కొత్తదే అయినా, ప్రజల్లో తల్లి కవితకు ఉన్న అనుభవం, ప్రజాస్పందన అతనికి మార్గదర్శకంగా ఉండవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో యువతీ యువకుల భాగస్వామ్యం పెరుగుతున్న వేళ, ఆదిత్య వంటి కొత్త ముఖాలు ప్రజల్లో కొత్త శక్తిని రగిలించగలవు.
ఒకప్పుడు కవిత ‘జాగృతి’ తో తెలంగాణ సాంస్కృతిక చైతన్యాన్ని మేల్కొలిపితే, ఇప్పుడు ఆమె కుమారుడు అదే ‘జాగృతి’ స్ఫూర్తిని రాజకీయ వేదికపై కొనసాగించవచ్చని భావన మొదలైంది. తల్లీ కుమారుడు కలిసి ప్రజా నిరసనలో నిలబడిన ఆ దృశ్యం, ఒక కుటుంబం కాదు ఒక రాజకీయ పునరుద్ధరణకు ప్రతీకగా నిలిచింది.
ఇక ప్రశ్న ఒకటే ఈ వారసత్వం తెలంగాణ ప్రజల హృదయాలను ఆకట్టుకుంటుందా? ఆదిత్య నిజంగా ప్రజల ఆశయాలకు ప్రతినిధిగా నిలవగలడా? సమాధానం కాలమే చెబుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం అవుతుంది. తెలంగాణ రాజకీయాల్లో మరో వారసుడి ఎంట్రీ మొదలైందని చర్చలు మాత్రం వినిపిస్తున్నాయి.