వయసు 95.. సర్పంచ్ గా విజయం.. ఆ పెద్దమనిషి మరో స్పెషల్ ఉంది

ఇంతకూ ఈ విచిత్రం ఎక్కడ జరిగింది? 95 ఏళ్ల వయసులో సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..;

Update: 2025-12-12 03:44 GMT

అరుదైన ఉదంతం ఒకటి తెలంగాణలో జరుగుతున్న తాజా పంచాయితీ ఎన్నికల్లో చోటు చేసుకుంది. 95 ఏళ్ల వయసులో ఎవరైనా ఎలా ఉంటారు? అందుకు విరుద్ధంగా తన పనులు తాను చేసుకోవటమే కాదు.. మంది సమస్యల్ని సైతం తీర్చే సత్తా తనలో టన్నుల కొద్దీ ఉన్నట్లుగా చెప్పటమే కాదు.. పంచాయితీ ఎన్నికల బరిలో దిగి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న వైనం చూస్తే.. వావ్ అనకుండా ఉండలేం. ఇంతకూ ఈ విచిత్రం ఎక్కడ జరిగింది? 95 ఏళ్ల వయసులో సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. 95 ఏళ్ల వయసులో సర్పంచ్ గా విజయం సాధించింది మరెవరో కాదు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డి. వయసు అన్నది ఒక నెంబర్ మాత్రమే అన్న విషయాన్ని ఆయన నిరూపించారని చెప్పాలి. దేశ రాజకీయ చరిత్రలో ఆయన విజయం ఒక రికార్డుగా పలువురు అభివర్ణిస్తున్నారు.

సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచి అభ్యర్థిగా బరిలోకి దిగారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి. విపక్ష బీఆర్ఎస్ మద్దతులో ఎన్నికల బరిలో దిగిన ఆయన.. 95 ఏళ్ల వయసులోనూ ప్రజలకు సేవ చేసే సత్తా తనలో ఉందన్న విషయాన్ని ప్రచారంలో చెప్పటమే కాదు.. ఆయన తీరుకు ఓటర్లు సైతం ఫిదా అయ్యారని చెప్పాలి. గ్రామానికి తన కుటుంబం చేసిన సేవల్ని గుర్తు చేస్తూ ఓటర్లను ఓట్లు అడిగిన ఆయన.. అందుకు తగ్గట్లే తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించారు. అత్యంత పెద్ద వయస్కుడైన సర్పంచిగా నిలిచారని చెప్పాలి.

ఇదిలా ఉంటే 101 ఏళ్ల వయసులో ఎన్నికల్లో ఓటేసేందుకు ఉత్సాహాన్ని ప్రద్శించారో పెద్దమనిషి. ఈ ఉదంతం జగిత్యాల జిల్లా ఇబ్రహీం పట్నం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పంచాయితీ ఎన్నికల్లో తన ఓటుహక్కును వినియోగించేందుకు వచ్చిన ఆ పెద్దాయన (లింగన్న) వయసు చూసిన పోలింగ్ సిబ్బంది సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వందేళ్లు దాటిన ఆ పెద్దాయన కర్ర సాయంతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారు. నిజానికి లింగన్న వయసు 105 ఏళ్లుగా పేర్కొంటూ.. ఆధార్ లో మాత్రం పుట్టిన సంవత్సరం 1924గా నమోదు కావటంతో అధికారికంగా 101 ఏళ్లుగా ఆయన వెంట వచ్చిన మనమడు తెలిపారు. ఓటేసేందుకు వచ్చిన ఆయన్ను పలువురు ఆసక్తిగా చూశారు.

పంచాయితీ ఎన్నికలు ఎంత ప్రతిష్ఠాత్మకంగా సాగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. నిజానికి అసెంబ్లీ.. ఎంపీ ఎన్నికలు పంచాయితీ ఎన్నికల ముందు దిగదుడుపుగా చెప్పాలి. పంచాయితీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం. అందుకే.. తమకు ఓటు వేసే అవకాశం ఉంటే వారి కోసం ఎంతకైనా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో సొంతూరులో జరిగే స్థానిక ఎన్నికల్లో ఓటేసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంది. ఇందుకు తగ్గట్లే మరికల్ పట్టణానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తి పంచాయితీ ఎన్నికల్లో ఓటేసేందుకు దుబాయ్ నుంచి ప్రత్యేకంగా వచ్చి మరీ ఓటేశారు. ఈ ఉదంతం పలువురు పంచాయితీ ఎన్నికల ప్రాధాన్యత గురించి మరోసారి మాట్లాడుకునేలా చేసింది.

Tags:    

Similar News