కొత్త వర్క్–ఫ్రం–హోమ్ చట్టం అమలు: ఉద్యోగులకి మరింత స్వేచ్ఛ, భరోసా
ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చిన ఈ మార్పులు ముఖ్యంగా వర్క్–ఫ్రం–హోమ్ మోడల్‌కు చట్టబద్ధత కల్పించాయి, అలాగే గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతను అందించాయి.;
దేశవ్యాప్తంగా నాలుగు కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వచ్చాయి. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చిన ఈ మార్పులు ముఖ్యంగా వర్క్–ఫ్రం–హోమ్ మోడల్‌కు చట్టబద్ధత కల్పించాయి, అలాగే గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతను అందించాయి.
హైబ్రిడ్ మోడల్‌కు చట్టపరమైన గుర్తింపు
కరోనా మహమ్మారి సమయంలో అనివార్యంగా మారిన వర్క్–ఫ్రం–హోమ్ విధానానికి కొత్త కార్మిక చట్టాల్లో శాశ్వత గుర్తింపు లభించింది. సేవా రంగంలోని కంపెనీలు ఇకపై యజమాని , ఉద్యోగి పరస్పర అంగీకారంతో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించవచ్చు. తాత్కాలిక పరిష్కారంగా మొదలైన ఈ విధానం ఇప్పుడు చట్టబద్ధ అవకాశంగా మారడంతో, కంపెనీలు హైబ్రిడ్ మోడల్‌ను సులభంగా అమలు చేసుకునే వీలు ఏర్పడింది. దీని ద్వారా ఉద్యోగులు ఇంటి నుంచీ, కార్యాలయం నుంచీ పని చేసుకునే అదనపు స్వేచ్ఛ , సౌలభ్యం పొందనున్నారు.
గిగ్ వర్కర్లకు భరోసా: సోషల్ సెక్యూరిటీ కవరేజ్
కొత్త లేబర్ కోడ్స్‌లో అత్యంత ముఖ్యమైన అంశం గిగ్ వర్కర్లకు గుర్తింపు. చిన్నకాలపు కాంట్రాక్టులపై పని చేసే డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ప్లాట్‌ఫార్మ్ వర్కర్లు మొదటిసారిగా చట్టం పరిధిలోకి వచ్చారు.
గిగ్ వర్కర్లకు ముఖ్య ప్రయోజనాలు
యూనివర్సల్ సోషియల్ సెక్యూరిటీ కవరేజ్ లో భాగంగా సామాజిక భద్రత అన్నిరంగాల గిగ్ వర్కర్లకు వర్తిస్తుంది. అన్ని రంగాల్లో కనీస వేతనాలు మరియు సమయానికి చెల్లింపులు తప్పనిసరి. అందరికీ తప్పనిసరిగా నియామక పత్రం జారీ చేయాలి. సంక్షేమ పథకాలు పొందేందుకు వీలుగా ఆధార్-అనుసంధానమైన యూనివర్సల్ అకౌంట్ నంబర్ కేటాయింపు. పోర్టబుల్ బెనిఫిట్స్ ఉంటుంది. రాష్ట్రం మారినా కూడా సామాజిక ప్రయోజనాలు కోల్పోకుండా చూస్తారు. అగ్రిగేటర్ కంపెనీలు తమ వార్షిక టర్నోవర్‌లో 1–2% నిధులను గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి తప్పక చెల్లించాలి.
స్వాగతించిన ఎటర్నల్
ఈ కొత్త నిబంధనలను జొమాటో, బ్లింకిట్ సంస్థల మాతృ సంస్థ ఎటర్నల్ లిమిటెడ్ స్వాగతించింది. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత చేరువవుతుందని, ఈ మార్పులు తమ దీర్ఘకాలిక వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపవని కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్‌కు తెలియజేసింది.
ఈ నూతన కార్మిక చట్టాలు ఉద్యోగులకు, గిగ్ వర్కర్లకు సంస్థలకు మధ్య సమతుల్యతను తీసుకువచ్చి, ఆధునిక కార్మిక రంగానికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయి.