టెకీల కష్టాలు: రెపిడో డ్రైవర్లుగా మారి ఇళ్ల అద్దెల కోసం పోరాటం

గ్రేటర్‌ నోయిడా నుండి బెంగళూరు, హైదరాబాద్‌ వంటి దేశంలోని ప్రధాన నగరాల్లోని ఐటీ ఉద్యోగుల పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది.;

Update: 2025-11-26 16:30 GMT

గ్రేటర్‌ నోయిడా నుండి బెంగళూరు, హైదరాబాద్‌ వంటి దేశంలోని ప్రధాన నగరాల్లోని ఐటీ ఉద్యోగుల పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. విస్తృత స్థాయిలో జరుగుతున్న లేఆఫ్ లు, తగ్గుతున్న కొత్త అవకాశాలు, ఉద్యోగ భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి.. ఇవన్నీ కలిసి అనేక ఐటీ కుటుంబాల ఆర్థిక పునాదులను తీవ్రంగా కుదిపేశాయి.

* ఇఎంఐ భారం: ఊపిరి బిగపట్టే స్థితి

ఐటీ ఉద్యోగులకు అతిపెద్ద ఆర్థిక భారంగా మారింది వారి హోమ్ లోన్ ఇఎంఐలు. నెలనెలా చెల్లించాల్సిన ఈ భారీ చెల్లింపులు ఉద్యోగం కోల్పోయిన వెంటనే అసాధ్యంగా మారాయి. ఆదాయం లేకుండా భారీ ఇఎంఐలను ఎలా భరించాలి? అనే భయం అనేక మందిని వెంటాడుతోంది. ఇఎంఐ డిఫాల్ట్ అయ్యే ప్రమాదం పెరుగుతుందనే ఆందోళనతో కొంతమంది టెకీలు తమ అపార్ట్‌మెంట్‌లను అమ్మకానికి కూడా పెట్టేశారు. ఏళ్ల కష్టంతో కొన్న ఇంటిని విడిచి పెట్టడం వారికి బాధగా ఉన్నా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు వారిని ఈ కఠినమైన నిర్ణయం తీసుకునేలా నెట్టేస్తున్నాయి.

* అద్దె ఇళ్లు… అయినా భారమే

ఫ్లాట్లు అమ్మేసి కొందరు మళ్లీ అద్దె ఇళ్లకు మారుతున్నారు. నగరాల్లో నెలకు ₹20,000 నుండి ₹30,000 వరకు ఉన్న అద్దెలు కూడా ఉద్యోగం లేని కుటుంబాలకు పెద్ద సవాలుగా ఉన్నాయి. అయినప్పటికీ, భారీ ఇఎంఐ కంటే ఈ అద్దె ఓ కొద్దిగా భరించగలిగే ఎంపికగా కనిపిస్తోంది.

* బతుకు దెరువు కోసం రెపిడో డ్రైవింగ్

ఉద్యోగాలు కోల్పోయిన అనేక మంది టెకీలు బతుకుదెరువు కోసం కొత్త మార్గాలు వెతుకుతున్నారు. అందులో భాగంగా కొంతమంది రెపిడో డ్రైవర్లుగా పనిచేయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఏసీ ఆఫీసుల్లో కూర్చుని పనిచేసిన వారు.. ఇప్పుడు రోడ్ల మీద బైక్ టాక్సీలను నడుపుతూ జీవనోపాధి కోసం పోరాడుతున్నారు. వారి మాటల్లో... “ఇది మనం ఎప్పుడూ ఊహించుకున్న జీవితం కాదు. కానీ కుటుంబాన్ని నెట్టుకొచ్చుకోవడం కోసం మరో మార్గం లేదు. అద్దె కట్టాలన్నా, నిత్యవసరాలు కొనాలన్నా కష్టపడక తప్పట్లేదు.” అని నిట్టూరుస్తున్నారు.

* లేఆఫ్ ల దెబ్బ: ఏఐ ప్రభావం స్పష్టం

ఐటీ రంగాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సంక్షోభం ఒక్కరోజులో రాలేదు. దీనికి అనేక అంశాలు దోహదపడుతున్నాయి. భారీ స్థాయి లేఆఫ్ లు ప్రధాన కారణం. కొత్త అవకాశాలు, ప్రాజెక్టులు తగ్గిపోవడం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పనులను ఆటోమేట్ చేయడం.. ఔట్‌సోర్సింగ్ ప్రాజెక్టులు పడిపోవడం.. ఈ పరిణామాలు ఐటీ ఉద్యోగుల జీవనాన్ని పూర్తిగా మార్చేశాయి. అభివృద్ధి, అపారమైన అవకాశాలకు మారుపేరుగా భావించిన ఐటీ రంగం, ఇప్పుడు అనేక కుటుంబాలకు ఆర్థిక ఒత్తిడి, భయాందోళనలకు కారణమవుతోంది. ఇళ్ల అద్దెల కోసం టెకీలు రెపిడో డ్రైవర్లుగా మారాల్సిన పరిస్థితి, ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో ఉన్న అస్థిరతను స్పష్టంగా చూపిస్తోంది. రాబోయే రోజుల్లో ఉద్యోగ భద్రత, నైపుణ్యాల పెంపు (రీ-స్కిల్లింగ్), మరియు ఏఐ ప్రభావానికి తగిన విధంగా ఐటీ రంగం మార్పులు పొందడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News