'జాంబీ రెడ్డి 2'కి మరో దర్శకుడు.. వర్మ టచ్ ఎంత?

‘జాంబీ రెడ్డి’ మొదటి భాగం పూర్తిగా ప్రశాంత్ వర్మ స్టైల్‌లో వచ్చింది. జాంబీస్ అనే కొత్త కాన్సెప్ట్‌ను రాయలసీమ బ్యాక్‌డ్రాప్, కామెడీతో కలిపి తెలుగు ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయ్యేలా చేశారు.

Update: 2026-08-23 10:50 GMT

‘జాంబీ రెడ్డి’ మొదటి భాగం పూర్తిగా ప్రశాంత్ వర్మ స్టైల్‌లో వచ్చింది. జాంబీస్ అనే కొత్త కాన్సెప్ట్‌ను రాయలసీమ బ్యాక్‌డ్రాప్, కామెడీతో కలిపి తెలుగు ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయ్యేలా చేశారు. తేజ సజ్జకు కూడా అదే సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు రెండో భాగం వస్తోంది కానీ ఈసారి దర్శకత్వం మాత్రం ప్రశాంత్ వర్మ చేయడం లేదు. అక్కడినుంచే ఈ సీక్వెల్ మీద కొత్త లెక్క మొదలవుతోంది.




‘జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవల్’కు సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అతను ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘రానా నాయుడు’, ‘హక్’ వంటి ప్రాజెక్టులకు వర్క్ చేశాడు. అంటే మొదటి పార్ట్‌లో ఉన్న కామెడీ టోన్ అలాగే ఉంటుందా, లేక ఈసారి యాక్షన్, డార్క్ టచ్ పెరుగుతుందా అన్నది చూడాలి. ఫస్ట్ అనౌన్స్ మెంట్ వీడియో లో కారులో వెళ్ళడం జాంబిల్ చేజింగ్ చూస్తుంటే యాక్షన్ గట్టిగా ఉండవచ్చని అర్థమవుతుంది. మొదటి భాగం కంటే పెద్ద స్కేల్‌లో వెళ్లేలా హింట్ ఇచ్చారు.

అయితే ప్రశాంత్ వర్మ పూర్తిగా బయటకు వెళ్లిపోలేదు. ఈ సీక్వెల్‌ను ఆయన క్రియేట్ చేశారు. స్క్రీన్‌ప్లేలో కూడా హుస్సేన్ దలాల్, సుపర్ణ్ వర్మతో కలిసి ప్రశాంత్ వర్మ పేరు ఉంది. అంటే కథ ప్రపంచం, ఫ్రాంచైజీ ఫీల్ దగ్గర ఆయన టచ్ ఉండే అవకాశం ఉంది. దర్శకుడు మాత్రం మారడంతో తెరపై ఆ టోన్ ఎంత వరకు అలాగే ఉంటుంది అనేదే అసలు పాయింట్.

మరోవైపు తేజ సజ్జ మార్కెట్ కూడా ఇప్పుడు చాలా మారిపోయింది. ‘హనుమాన్’, ‘మిరాయ్’ తర్వాత సినిమా అంటే చిన్న స్థాయిలో ప్లాన్ చేసే పరిస్థితి లేదు. అందుకే ఈసారి ఉపేంద్రను కీలక పాత్రలో తీసుకున్నారు. షనాయ కపూర్‌ను కూడా పరిచయం చేస్తున్నారు. సినిమా ఏడు భాషల్లో విడుదల కానుంది. గౌర హరి సంగీతం అందిస్తున్నారు.

ఇక్కడ సుపర్ణ్ వర్మకు ఒక చిన్న ఛాలెంజ్ ఉంటుంది. మొదటి భాగాన్ని ఇష్టపడిన వాళ్లు అదే ఫన్, అదే పిచ్చి టోన్ కోసం వస్తారు. కానీ రెండో భాగం పెద్దదైంది కాబట్టి కొత్తగా ఏదో ఇవ్వాల్సిందే. ప్రశాంత్ వర్మ రాసిన ప్రపంచాన్ని అలాగే కొనసాగిస్తూ, తన స్టైల్‌లో యాక్షన్ లేదా థ్రిల్ పెంచితే ఈ సీక్వెల్‌కు కొత్త ఫీల్ రావచ్చు. ఇప్పుడు సుపర్ణ్ వర్మ ఆ టచ్‌ను తీసుకుని ఎంత కొత్తగా చూపిస్తారన్నదే చూడాలి.


Full View


Tags:    

Similar News