మ‌హిళల్ని ఆకాశంలో నిల‌బెట్టిన‌ య‌ష్ వ్య‌క్తిత్వానికి హ్యాట్సాఫ్‌

వందల కోట్ల భారీ పెట్టుబడితో రూపొందే ప్రాజెక్టును ఒక మహిళా దర్శకురాలి చేతిలో పెట్టడం కేవలం ఒక సినిమా నిర్ణయం మాత్రమే కాదు..

Update: 2026-08-23 11:37 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కేజీఎఫ్ వంటి పాన్ ఇండియా విజయం సాధించిన తర్వాత ఏ అగ్ర కథానాయకుడైనా సాధారణంగా సురక్షితమైన కమర్షియల్ ఫార్ములాను.. భారీ బడ్జెట్ మాస్ దర్శకులనే ఎంచుకుంటారు. అయితే రాకింగ్ స్టార్ యష్ ఆ సాంప్రదాయక మార్గాన్ని పక్కనపెట్టి.. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో పనిచేయడానికి ముందుకు రావడం చాలా ప్ర‌శ్న‌ల‌కు సందేహాల‌కు తావిచ్చింది. ఒక మ‌హిళా ద‌ర్శ‌కురాలితో ప‌ని చేయాల‌నే ఆలోచ‌న చాలా ఉన్న‌త‌మైన‌ది. కానీ దానిని ప‌రిశ్ర‌మ అలా తీసుకోలేదు.

వందల కోట్ల భారీ పెట్టుబడితో రూపొందే ప్రాజెక్టును ఒక మహిళా దర్శకురాలి చేతిలో పెట్టడం కేవలం ఒక సినిమా నిర్ణయం మాత్రమే కాదు.. అది ఆ రంగానికి చెందిన లింగ వివక్షత.. మూసధోరణులపై యష్ చూపిన దృఢమైన విశ్వాసానికి- సామాజిక మార్పు వైపు వేసిన కీలక అడుగుకి స్పష్టమైన సూచికగా నిలిచింది.

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ వేదికగా విద్యార్థినులను ఉద్దేశించి యష్ చేసిన వ్యాఖ్యలు ఆయనలోని సామాజిక బాధ్యతను, సమాజ నిర్మాణం విష‌యంలో ఉన్న అవగాహనను బహిర్గతం చేశాయి. పురుషులు సాధించే విజయాల కంటే మహిళలు సమాజంలో ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి చేసే ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులు, కష్టాలు రెట్టింపుగా ఉంటాయి! అని ఆయన స్పష్టం చేశారు. సమాజం నేటికీ మహిళల సామర్థ్యాలపై వ్యక్తపరిచే అనుమానాలు... ఎదురయ్యే వ్యంగ్య బాణాలు.. వారి శ్రమను తక్కువ చేసి చూపే ధోరణులను ఆయన నిష్కపటంగా ఎత్తిచూపారు. స్త్రీలు తమ కలలను నెరవేర్చుకునే క్రమంలో సమాజపు ప్రాథమిక అడ్డంకులను అధిగమించాల్సి వస్తుందనే నిజాయితీపూర్వక గుర్తింపు ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.

సినిమా రంగంలో అత్యున్నత శిఖరాలను తాకినా.. ధనార్జన కంటే కూడా కళాత్మక గౌరవానికి, నాణ్యమైన పనికే ప్రాధాన్యత ఇస్తానని యష్ చాటిచెప్పడం ఆయన వ్యక్తిత్వంలోని ఉన్నతిని తెలియజేస్తుంది. ``నాకు కేవలం డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు.. నాకు కావలసినంత ఆదరణ, ప్రేమాభిమానాలు ప్రేక్షకులు ఇప్పటికే అందించారు.. నేను చేసే పని ద్వారా లభించే గౌరవమే నాకు ముఖ్యం`` అని వ్యాఖ్యానించడం ద్వారా అతడు తన వృత్తి పై ఉన్న నిబద్ధతను చాటుకున్నారు. వ్యాపార కోణంలోనే కాకుండా.. సామాజిక మార్పుకు సాధనంగా సినిమాను ఉపయోగించుకోవాలనే అత‌డి ఆలోచనా దృక్పథం వర్తమాన సినీ పరిశ్రమకు ఎంతో ఆదర్శవంతమైనది.

నేటి సమాజంలో మహిళా సాధికారత గురించి ప్రసంగాలు ఇవ్వడం సులభమే అయినా.. దానిని నిజ జీవితంలో ..వృత్తిగత నిర్ణయాల్లో ఆచరించి చూపడం చాలా అరుదు. ఈ చిత్రంలో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ద్వారా ప్రతి మహిళ తన ఆలోచనలను, విజన్‌ను ధైర్యంగా వ్యక్తీకరిస్తూ.. ఏలాంటి కష్టతరమైన పరిస్థితులనైనా ఎదుర్కొని సమాజంలో విజయం సాధించగలదని రుజువు చేయబోతున్నారని యష్ ధీమా వ్యక్తం చేశారు. కేవలం తెరపై నటనకే పరిమితం కాకుండా.. ఒక నారీమణి నాయకత్వంలో పనిచేసి.. ఆమె ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక మాస్ హీరో ముందుకు రావడం మహిళా లోకానికి గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే అంశం.

యష్ విశ్లేషణాత్మకమైన- స్ఫూర్తిదాయకమైన ఈ వ్యాఖ్యలు కేవలం ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్‌కు మాత్రమే పరిమితమైనవి కావు. అవి ఆధునిక సమాజంలో స్త్రీల పాత్ర, వారి ప్రాధాన్యత.. వారికి లభించాల్సిన అవకాశాలపై సరికొత్త చర్చకు తెరలేపాయి. యువతులకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని నూరిపోస్తూ.. పరిశ్రమలోని ఇతర అగ్ర నటులకు కూడా విభిన్నమైన ఆలోచనా ధోరణిని అలవర్చుకోవాలని అత‌డు తన ప్రవర్తన ద్వారా చూపించారు. యష్ చూపిన ఈ ఆదర్శవంతమైన ఐడియాలజీ త‌దుప‌రి రోజుల్లో చిత్ర పరిశ్రమలో మరిన్ని సమూలమైన మార్పులకు... మహిళా సాంకేతిక నిపుణులకు విస్తృతమైన అవకాశాలు లభించడానికి మార్గదర్శకంగా నిలుస్తుదనడంలో ఎలాంటి సందేహం లేదు. య‌ష్ క‌థానాయ‌కుడిగా మ‌హిళా ద‌ర్శ‌కురాలు గీతూ మోహ‌న్ దాస్ తెర‌కెక్కించిన టాక్సిక్ ఈనెల 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Tags:    

Similar News