ముంబైలో చరణ్ - అల్లు అర్జున్ ఆఫీస్‌లకు కేజీఎఫ్ యష్ ఇల్లు ఎంత దూరం?

పాన్-ఇండియా ప్రాజెక్టుల వేగవంతమైన పనుల కోసం రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇప్పటికే ముంబైలో లగ్జరీ నివాసాలను ఏర్పాటు చేసుకోగా... తాజాగా కన్నడ సూపర్ స్టార్ యష్ కూడా ముంబై పరిసరాల్లో భారీ ఆస్తిని కొనుగోలు చేశారు.

Update: 2026-06-19 07:28 GMT

దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన టాప్ స్టార్స్ ఇప్పుడు ముంబై నగరంలో తమదైన ముద్ర వేస్తున్నారు. పాన్-ఇండియా ప్రాజెక్టుల వేగవంతమైన పనుల కోసం రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇప్పటికే ముంబైలో లగ్జరీ నివాసాలను ఏర్పాటు చేసుకోగా... తాజాగా కన్నడ సూపర్ స్టార్ యష్ కూడా ముంబై పరిసరాల్లో భారీ ఆస్తిని కొనుగోలు చేశారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇళ్లకు, యష్ కొనుగోలు చేసిన కొత్త ఇంటికి మధ్య ఏకంగా 100 కిలోమీటర్లకు పైగా దూరం ఉంది. ముంబైలో చరణ్ సొంత ఇల్లు, బన్నీ అద్దె ఇల్లు కం ఆఫీస్ ఉన్న ఏరియాలతో పోలిస్తే యష్ ఇల్లు కొనుగోలు చేసిన ప్రాంతం భౌగోళికంగా చాలా దూరంలో ఉండటం విశేషం. ముంబైలోని జూహు నుంచి అలీభాగ్ కు వెళ్లాలంటే క‌నీసం రెండున్న‌ర గంట‌లు కార్ లో ప్ర‌యాణించాల్సి ఉంటుంది. అయితే బోట్ లో స‌ముద్ర మార్గం ద్వారా వెళితే ఈ దూరం చాలావ‌ర‌కూ త‌గ్గుతుంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు ముంబైలోని అత్యంత సంపన్నమైన `ఖర్` ఏరియాలో దాదాపు 30 కోట్ల విలువైన సొంత లగ్జరీ పెంట్‌హౌస్ ఉంది. కేకేడీ స్టూడియోస్ డిజైన్ చేసిన ఈ 3200 చదరపు అడుగుల సీ-ఫేసింగ్ పెంట్‌హౌస్ అత్యాధునిక వసతులతో కూడి ఉంటుంది. ముంబైలో తన ప్రాజెక్ట్‌లు, బిజినెస్ మీటింగ్‌ల కోసం వచ్చినప్పుడు చరణ్ ఇక్కడే బస చేస్తారు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్‌లో అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి దర్శకులతో ప్లాన్ చేసిన‌ పాన్-ఇండియా చిత్రాల వర్క్‌స్పేస్ కోసం జూహూ తారా రోడ్‌లో నెలకు 16 లక్షల భారీ అద్దెతో ఒక విలాసవంతమైన 5-బెడ్ రూమ్ ఫ్లాట్‌ను లీజుకు తీసుకున్నారు. ప్రైవేట్ పూల్ తో సౌక‌ర్య‌వంతంగా ఉండే ఈ ఇల్లు ఈ 6,000 చదరపు అడుగుల్లో ఉంది. విరాట్ కోహ్లీ, విక్కీ కౌశల్ వంటి స్టార్లకు బ‌న్ని ఇప్పుడు పొరుగువారిగా మారారు.

ముంబైలోని చాలా మంది సినిమా స్టార్లు, రాజ‌కీయ‌, పారిశ్రామిక రంగాల నుంచి ప్ర‌ముఖులు ఫామ్ హౌస్ ల‌ను ఏర్పాటు చేసుకునే `అలీబాగ్` ప్రాంతంలో `కేజీఎఫ్` స్టార్ యష్ సరికొత్త ప్రాపర్టీని కొనుగోలు చేశారు. ఈ ఏరియాలో కిహిమ్ బీచ్‌కు ఆనుకుని ఉన్న కామత్ గ్రామంలో 1.3 ఎకరాల లో లగ్జరీ బీచ్ ఏరియా ఆస్తిని.. అందులోని ఇంటిని యష్-రాధిక పండిత్ దంపతులు 24 కోట్ల భారీ వ్యయంతో దక్కించుకున్నారు. 2026 మే 18న రిజిస్టర్ అయిన ఈ స్థలం కోసం వారు కేవలం స్టాంప్ డ్యూటీ రూపంలోనే 1.44 కోట్లు చెల్లించారు. ఈ కొనుగోలుతో అలీబాగ్‌లో లగ్జరీ తీరప్రాంత ఇళ్లు ఉన్న షారుఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ వంటి టాప్ ఎలైట్ క్లబ్‌లో యష్ కూడా చేరిపోయారు.

అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్ ముంబైలో ఎంచుకున్న ప్రాంతాలు పూర్తిగా వారి రోజువారీ సినిమా షూటింగ్‌లు, ఆఫీస్ మీటింగ్‌లు, ప్రొడక్షన్ హౌస్‌ల యాక్సెసిబిలిటీకి అనుకూలంగా ఉండే `వర్క్ బేస్` నివాసాలు. కానీ యష్ ఎంచుకున్న అలీబాగ్ పూర్తిగా భిన్నమైనది. ముంబై నగర బిజీ లైఫ్, ట్రాఫిక్ హడావుడికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో రిలాక్స్ అవ్వడానికి సెలబ్రిటీలు ఇక్కడ గెస్ట్ హౌస్‌లను నిర్మించుకుంటారు. ఇక్కడి అందమైన బీచ్‌లు, కొబ్బరి తోటలు, ప్రశాంతత ముంబై స్టార్స్‌ను వీకెండ్స్‌లో ఇటువైపు రప్పిస్తుంటాయి.

రామ్ చరణ్ తన సొంత పెంట్‌హౌస్‌ను, అల్లు అర్జున్ తన తాత్కాలిక అద్దె ఫ్లాట్‌ను ముంబై నడిబొడ్డున బాలీవుడ్ హబ్‌కు దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసుకోగా... యష్ మాత్రం కెరీర్ బ్రేక్స్ లో ఫ్యామిలీతో ప్రశాంతంగా గడపడానికి వీలుగా ముంబైకి అవతలి తీరాన ఉన్న అలీబాగ్‌లో లగ్జరీ హాలిడే హోమ్‌ను సొంతం చేసుకున్నారు. ముంబైలో చరణ్, బన్నీల ఆఫీస్ వర్క్‌స్పేస్‌ల స్పీడ్‌కు.... యష్ అలీబాగ్ హోమ్ ఇచ్చే పీస్‌ఫుల్ వైబ్స్‌కు మధ్య డిస్టెన్స్ 100 కిలోమీటర్లకు పైగానే ఉన్నా.. ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో సౌత్ స్టార్ల హవా ఇప్పుడు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది.

Tags:    

Similar News