'దురంధర్' డైరెక్టర్ భార్య ఒకప్పుడు తరుణ్ హీరోయిన్!
టాలీవుడ్ యంగ్ హీరో తరుణ్ సరసన `యుద్ధం`(2014) అనే చిత్రంలో నటించింది యామి గౌతమ్.;
టాలీవుడ్ యంగ్ హీరో తరుణ్ సరసన `యుద్ధం`(2014) అనే చిత్రంలో నటించింది యామి గౌతమ్. ఈ చిత్రంలో దివంగత నటుడు శ్రీహరి కూడా కీలక పాత్రలో నటించారు. మూవీ జయాపజయాల సంగతి అటుంచితే, యామి ఆ తర్వాత బాలీవుడ్ లో విక్కీ డోనర్ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకుంది. ఆపై వరుసగా హిందీలో ప్రయోగాత్మక సినిమాలలో నటిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల హృతిక్ రోషన్ సరసన కాబిల్ అనే చిత్రంలోను యామి నటించింది.
యామి గౌతమ్ ఇప్పుడు బాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలు పొందిన కథానాయిక మాత్రమే కాదు, హిందీ చిత్రసీమలో అత్యంత విజయవంతమైన, అత్యంత గౌరవం అందుకుంటున్న ప్రముఖ దర్శకరచయిత ఆదిత్యధర్‌కి భార్య. అతడు తెరకెక్కించిన 2019 బ్లాక్ బస్టర్ మూవీ `యూరి`లో యామి ఓ కీలక పాత్రలో నటించింది. ఆర్మీ అధికారి విక్కీ కౌశల్ వృద్ధ తల్లిని సంరక్షించే డిపార్ట్ మెంట్ నర్స్ పాత్రలో కనిపించింది. అయితే ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే యంగ్ డైరెక్టర్ ఆదిత్యధర్ నటి యామితో ప్రేమలో పడ్డాడు. ఆ ఇద్దరి డేటింగ్ ఏడాది పైగా కొనసాగింది. చివరికి ఆ ఇద్దరూ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలయ్యారు.
ఇప్పుడు ఆదిత్యాధర్ యూరిని మించిన బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించాడు. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా అతడు తెరకెక్కించిన `దురంధర్` బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి 500కోట్ల క్లబ్ దిశగా సాగిపోతోంది. ఇలాంటి సమయంలో ఆదిత్యాధర్ విజయంలో అతడి భాగస్వామి సహాయం ఎంతో గొప్పది అనడంలో ఎలాంటి సందేహం లేదు. యామి అతడి నిరంతర షెడ్యూళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ముందుకు సాగడంలో ఎంతగానో సహకరిస్తుంది. అదే సమయంలో తన నటనా కెరీర్ ని కూడా చక్కదిద్దుకుంటూ బాలీవుడ్ లో ప్రతిభావంతమైన నటిగా తనను తాను ఆవిష్కరించుకుంటోంది. హబ్బీతో విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాధిస్తోంది. చాలా మంది కథానాయికలకు లేని అవకాశం, అదృష్టం యామీకి ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. యామి గౌతమ్ ఒకప్పుడు `యుద్ధం` అనే ఒక చిన్న సినిమాలో నటించింది. ఆ సినిమా అంతగా ఆడలేదు కూడా. కానీ అవకాశం, అదృష్టం కలిసి వస్తే, ఏ స్థాయికి అయినా ఎదిగే ప్రతిభ తనకు ఉందని యామి నిరూపించింది.
100 కోట్ల అధిపతులు..
నిజానికి ఆదిత్యాధర్ ఒక కశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందినవాడు. అతడు పుట్టుకతో ధనవంతుడు. బాలీవుడ్ లో రచయితగా ప్రయత్నించి విజయం సాధించాడు. ప్రస్తుతం తన భార్య యామి, ఇతర కుటుంబంతో అత్యంత సురక్షితమైన స్థానంలో ఉన్నాడు. యామి గౌతమ్‌తో కలిసి ఆదిత్య ధర్ సైలెంట్‌గా ఒక అందమైన చక్కటి ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ జంట మొత్తం నికర ఆస్తుల విలువ సుమారు రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా.
అయితే ఆదిత్య ధర్ ఓవర్‌నైట్‌లో సినీపరిశ్రమలో ఎదిగేయలేదు. `యూరి: ది సర్జికల్ స్ట్రైక్` అతడి జాతకాన్ని మార్చక ముందు చాలా శ్రమించాడు. ఆ ఒక్క సినిమా విజయం గేమ్ ఛేంజర్ గా మారింది. అంతకుముందు కొన్ని సంవత్సరాలుగా కేవలం రచయితగా గుర్తింపు లేకుండా ఉన్నాడు. కొన్నేళ్ల పాటు రచన అనే కళను నేర్చుకుంటూ గడిపాడు. `యూరి` భారీ విజయం సాధించిన తర్వాత పెద్ద బడ్జెట్‌లతో సృజనాత్మక స్వేచ్ఛ లభించింది. అతడి ఓపిక ఫలించి దురంధర్ కోసం అత్యంత భారీ బడ్జెట్ ని అతడి కోసం ఖర్చు చేసారు మేకర్స్.