'యానిమ‌ల్‌'ని పొగ‌డ‌నిదే నిద్ర‌పోని న‌టుడు!

ద‌ర్శ‌కుడు ఆదిత్యాధ‌ర్ పైనా దురంధ‌ర్ సినిమాపైనా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద చాలా రికార్డుల‌ను వేటాడింది.;

Update: 2026-01-10 02:45 GMT

ద‌ర్శ‌కుడు ఆదిత్యాధ‌ర్ పైనా దురంధ‌ర్ సినిమాపైనా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద చాలా రికార్డుల‌ను వేటాడింది. ఆస‌క్తిక‌రంగా ద‌క్షిణాది రాష్ట్రాల్లోని మ‌ల్టీప్లెక్సుల్లోను హిందీ వెర్ష‌న్ రాణించింది. క్రిష్, ధూమ్ ఫ్రాంఛైజీ సినిమాల త‌ర‌హా సినిమా కాక‌పోయినా, ఇది ద‌క్షిణాది ఆడియెన్ కి బాగా న‌చ్చింది. దేశ‌భ‌క్తి, తీవ్ర‌వాదం, గూఢ‌చ‌ర్యం నేప‌థ్యంలోని సినిమా ర‌క్తి క‌ట్టించింద‌ని ప్ర‌శంస‌లు కురిసాయి.

ముఖ్యంగా ద‌ర్శ‌కుడు ఆదిత్యాధ‌ర్ ప్ర‌తిభను చాలా మంది ప్ర‌ముఖులు ప్ర‌శంసించారు. ఆర్జీవీ కొన్ని వారాల పాటు అదే ప‌నిగా ప్ర‌శంసిస్తూనే ఉన్నాడు. దురంధ‌ర్ సినిమాని కాస్త అటూ ఇటూగా ఆధునిక‌ మ‌హాభార‌తం తో పోల్చాడు ఆర్జీవీ. యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, `దురంధ‌ర్` ఒక మనిషిలా నిర్మిత‌మైన సినిమా అని వ‌ర్ణంచ‌గా, ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆదిత్యను `దేవుని సొంత బిడ్డ` అని పొగిడేసారు. ఇప్పుడు నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాని సమీక్షించారు. దర్శకుడు ఆదిత్యాధ‌ర్‌ని, సినిమా కథాంశాన్ని, నటీనటులను ప్ర‌శంసించాడు. ముఖ్యంగా రెహమాన్ డకాయిత్ పాత్రలో న‌టించిన‌ అక్షయ్ `క్రూరమైన హింస`ను ప్రశంసించారు.

ఒబెరాయ్ త‌న ఎక్స్ ఖాతాలో ఇలా రాసారు. నేను `దురంధ‌ర్` సినిమా చూసి షాక‌య్యాను. ఇది సినిమాని మించి.. చిమ్మచీకటి గదిలో స్విచ్ వేసినప్పుడు కలిగే తీవ్రమైన షాక్ లాంటిది. మీరు ఎప్పుడైనా ఒక అమరవీరుడి ఇంటిలోని నిశ్శబ్ద వాతావరణంలో నిలబడి ఉంటే.. అక్కడ గోడలు జ్ఞాపకాలతో నిండి ఉంటాయి.. కానీ కుర్చీలు ఎప్పటికీ ఖాళీగా ఉంటాయి. మన శాంతియుతమైన నేటి కోసం, పేరు తెలియని వీరులు తమ రేపటిని త్యాగం చేసిన కారిడార్లలో మీరు చరిత్ర తాలూకా చల్లని శ్వాసను అనుభూతి చెందితే. ఫ్రేమ్ కట్టిన ఫోటోలోని గాజులోంచి మాత్రమే తన తండ్రిని తెలిసిన ఒక చిన్నారి కళ్ళలోకి మీరు చూస్తే... అప్పుడు మీరు ఈ సినిమా స్పందనను గుర్తిస్తారు. వాస్తవాలను ఎప్పుడూ ఎదుర్కోని వారికి ఆగ్రహం అనేది ఒక విలాసం.. మనలో మిగిలిన వారికి ఇది కేవలం నిజం`` అంటూ చాలా క‌వితాత్మ‌కంగా ఎమోష‌న‌ల్ గా స్పందించారు.

ఆదిత్యాధ‌ర్ పైనా ప్ర‌శంస‌లు కురిపించారు. ``అత‌డు కేవలం కథ చెప్పడు.. కథను రక్తసిక్తం చేస్తాడు. 3 గంటల 34 నిమిషాల పాటు మీ కళ్ళను స్క్రీన్ నుండి పక్కకు తిప్పకుండా సవాల్ చేస్తాడు. ఈ సినిమాటిక్ ప్రతిభ, కేవలం ఆర్భాటానికి కాకుండా, కళకే అంకితమైన ఒక దర్శకుడి దృష్టికోణం నుండి విక‌శించింది. ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకుడిని మాయ చేస్తుంది.. ప్రతి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది కేవలం హద్దులను చెరిపేసిన‌ చిత్రమే కాదు.. 2023లో యానిమల్ చేసినట్లే హద్దులను పూర్తిగా చీల్చి చెండాడిన సినిమా`` అని ప్ర‌శంసించాడు.

ఈ సినిమాలో న‌టీన‌టులు భ‌యం అన్న‌దే లేని వారిగా త‌మ‌ను తాము అంకిత‌మిచ్చార‌ని ప్ర‌శంసించాడు. ర‌ణ్ వీర్ తన సంయమనం కింద మరుగుతున్న అంతర్గత అగ్నితో రగిలిపోతున్నాడు.. ఏ గర్జన కంటే నిశ్శబ్దమే మరింత వెంటాడగలదని నిరూపించాడు. అక్షయ్ ఖన్నా అద్భుతంగా న‌టించాడు. ఆ చూపులో, ఆ చిరునవ్వులో ఉన్న శక్తి, క‌సాయిలోని హింస తీవ్ర‌త డెకైత్ హృదయాన్ని దోచుకుంటాడు.. అని ప్ర‌శంసించాడు.

ఒబెరాయ్ ది గ్రేట్...

ఆస‌క్తిక‌రంగా ఒక బాలీవుడ్ సినిమాని టాలీవుడ్ ద‌ర్శ‌కుడు రూపొందించిన సినిమాతో ఒబెరాయ్ పోల్చేందుకు సిగ్గుప‌డ‌లేదు.. ఎలాంటి భేష‌జానికి పోలేదు. ఖాన్ ల త్ర‌యం కానీ, ఇత‌ర హిందీ అగ్ర తార‌లు కానీ `యానిమ‌ల్‌`ని ప్ర‌శంసించేందుకు కూడా సిద్ధంగా లేరు. కానీ ఒబెరాయ్ లాంటి న‌టుడు అప్పుడ‌ప్పుడు త‌మ స్వ‌రాన్ని బ‌లంగా వినిపిస్తాడు. సందీప్ వంగాను అత‌డు చూసే దృష్టి కోణం కూడా ఇత‌రుల కంటే వైవిధ్య‌మైన‌ది. కుట్ర‌, ద్వేష‌పూరిత‌మైన మ‌న‌సు అత‌డికి లేద‌ని నిరూపించాడు. స్త్రీ ద్వేషం, హింస‌, ర‌క్త‌పాతం అంటూ సందీప్ వంగాను త‌క్కువ చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన ఒక వ‌ర్గానికి వ్య‌తిరేకంగా వివేక్ ఒబెరాయ్ త‌న అభిప్రాయాల‌ను ధైర్యంగా చెబుతున్నాడు. దురంధ‌ర్ `యానిమ‌ల్‌`ని మించిపోయింద‌ని, రికార్డులు బ్రేక్ చేసింద‌ని హిందీ మీడియాలు రాస్తున్నాయి కానీ, యానిమ‌ల్ ఎప్పుడూ గ్రేట్ అని మాత్రం పొగ‌డ‌ని మీడియాల‌కు అతీతంగా వివేక్ ఒబెరాయ్ త‌న అభిప్రాయాల‌ను చెబుతున్నాడు.

Tags:    

Similar News