విశ్వంభర : భీమ్స్ స్టైల్‌లో ఆట కావాలా పాట కావాలా...!
ముఖ్యంగా టీజర్ అంటూ వచ్చిన ఒక వీడియోను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు.;
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'విశ్వంభర'. 2025 సంక్రాంతికి విడుదల చేస్తామంటూ గత ఏడాది ప్రకటించిన మేకర్స్ ఇప్పటి వరకు సినిమాను పూర్తి చేయలేదు. షూటింగ్ సైతం ఇంకా బ్యాలన్స్ ఉంది. ఇక వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలోనూ జాప్యం జరుగుతోంది. అదుగో ఇదుగో అంటూ ఆలస్యం చేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ విశ్వంభర పై ఉన్న పాజిటివ్ ఒపీనియన్ అనేది తగ్గుతూ వస్తుంది. విశ్వంభర సినిమాకి మొదట్లో ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు ఒప్పుకోక తప్పదని మెగా ఫ్యాన్స్ స్వయంగా అంటున్నారు. సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో చాలా అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి.
ముఖ్యంగా టీజర్ అంటూ వచ్చిన ఒక వీడియోను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. అమీర్ పేట్ వీఎఫ్‌ఎక్స్ వర్క్ అంటూ చాలా మంది మెగా ఫ్యాన్స్ సైతం దర్శకుడు వశిష్టపై దుమ్మెత్తి పోశారు. సీరియల్‌లో వచ్చే గ్రాఫిక్స్ ఇంతకంటే బెటర్ ఉంటాయి అంటూ కొందరు ట్రోల్ చేయడంతో మేకర్స్ వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సన్నివేశాల గ్రాఫిక్స్‌కి ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు. విదేశాలకు చెందిన వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు విడుదల తేదీ విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ రాకపోవడంకు కారణం వీఎఫ్‌ఎక్స్ వర్క్ అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పలు పాటల రికార్డింగ్ సైతం పూర్తి అయిన విషయం తెల్సిందే. చిరంజీవి స్వయంగా మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చుని పాటలను ఎంజాయ్ చేశాను అంటూ గతంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఐటెం సాంగ్ గురించి చర్చ మొదలైంది. గత రెండు మూడు రోజులుగా ఈ సినిమాలో బ్రహ్మాస్త్ర ఫేం మౌనీ రాయ్ తో విశ్వంభరలో ఐటెం సాంగ్ చేయించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆమె వైపు నుంచి స్పందన రాలేదు, మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ పాట గురించి మరో ఆసక్తికర పుకారు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సడన్‌గా సంగీత దర్శకుడు భీమ్స్ ఈ సినిమాలో ఎంట్రీ అంటూ వార్తలు వస్తున్నాయి.
వరుస విజయాలతో దూకుడు మీదున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోతో 'విశ్వంభర' సినిమాలోని ఐటెం సాంగ్ కంపోజ్ చేయించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ అనిల్ రావిపూడితో చిరంజీవి చేస్తున్న సినిమా కోసం భీమ్స్ అందించిన పాటలు బాగున్నాయట. చిరంజీవి ఆ పాటలకు ఇంప్రెస్ అయ్యి విశ్వంభరలో ఐటెం సాంగ్ చేయిస్తే బాగుంటుందని అనుకున్నాడట. అందుకు కీరవాణి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ ఒక్క పాట బాధ్యతను భీమ్స్‌కు ఇచ్చారని తెలుస్తోంది.
ఇక ఆ పాట కొత్తగా కాకుండా చిరంజీవి సూపర్ హిట్ మూవీ అన్నయ్యలోని ఆట కావాలా పాట కావాలా కి రీమిక్స్‌లా ట్యూన్ చేయబోతున్నారట. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 50 శాతం ట్యూన్ మార్చడంతో పాటు, లిరిక్స్ సైతం మార్చనున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ విభిన్నంగా ఫీల్ కావడంతో పాటు, ఈ తరం ప్రేక్షకులకు తగ్గట్లుగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఆలోచన బాగుందని సోషల్ మీడియాలో ఇప్పటికే టాక్ నడుస్తోంది.