130 కోట్ల విల్లాలో స్టార్ క్రికెటర్ సెహ్వాగ్ విలాసం..ఇంట్లో అడుగుపెడితే కళ్లు జిగేల్!
భారత క్రికెట్ చరిత్రలో తనదైన దూకుడుతో `హార్డ్ హిట్టింగ్ సుల్తాన్`గా పేరుగాంచిన వీరేంద్ర సెహ్వాగ్.. మైదానంలో ఎంత వేగంగా ఆడతారో తన వ్యక్తిగత జీవితంలో అంత ప్రశాంతతను, కళాత్మకతను ఇష్టపడతారు.;
భారత క్రికెట్ చరిత్రలో తనదైన దూకుడుతో `హార్డ్ హిట్టింగ్ సుల్తాన్`గా పేరుగాంచిన వీరేంద్ర సెహ్వాగ్.. మైదానంలో ఎంత వేగంగా ఆడతారో తన వ్యక్తిగత జీవితంలో అంత ప్రశాంతతను, కళాత్మకతను ఇష్టపడతారు. ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఆయన నిర్మించుకున్న `కృష్ణ నివాస్` అనే విలాసవంతమైన విల్లా ఇందుకు నిదర్శనం. సుమారు 130 కోట్ల రూపాయల విలువైన ఈ భవనం కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు... సెహ్వాగ్ వ్యక్తిత్వానికి.. ఆయన సాధించిన విజయాలకు అద్దం పట్టే ఒక అద్భుతమైన కళాఖండం.
సెహ్వాగ్ తన ఇంట్లో అత్యంత ప్రాధాన్యతనిచ్చిన అంశాల్లో `ట్రోఫీ రూమ్` ఒకటి. ఒక క్రికెటర్‌గా ఆయన దశాబ్దాల కాలం పాటు దేశం కోసం సాధించిన లెక్కలేనన్ని మెడల్స్, ట్రోఫీలు, జ్ఞాపికలను ఇక్కడ ఎంతో కళాత్మకంగా ప్రదర్శించారు. ఈ గది అతడి కష్టానికి .. క్రికెట్ పై ఉన్న అంకితభావానికి గుర్తుగా నిలుస్తుంది. సందర్శకులను మంత్రముగ్ధులను చేసే ఈ ప్రదేశం సెహ్వాగ్ కెరీర్‌లోని ప్రతి మైలురాయిని కళ్లముందు ఉంచుతుంది.
ఆధునిక సౌకర్యాలతో పాటు సెహ్వాగ్ తన ఇంట్లో ఆధ్యాత్మికతకు పెద్దపీట వేశారు. భవనం లోపల ఎంతో ప్రశాంతంగా ఉండేలా ఒక ప్రత్యేక `స్పిరిచువల్ కార్నర్` (పూజా గది)ను ఏర్పాటు చేసుకున్నారు. వెలుతురు ధారాళంగా వచ్చేలా.. మనసుకి ప్రశాంతతనిచ్చే రంగులతో ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. బిజీ లైఫ్ నుండి విరామం తీసుకుని ఏకాంతంగా ప్రార్థనలు చేసుకోవడానికి, మానసిక ప్రశాంతత పొందేందుకు సెహ్వాగ్ ఈ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తారు.
ప్రకృతి ప్రేమికుడైన సెహ్వాగ్.. తన విల్లా చుట్టూ పచ్చని తివాచీ పరిచినట్లుండే విశాలమైన గార్డెన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఢిల్లీ వంటి కాంక్రీట్ అడవిలో కూడా స్వచ్ఛమైన గాలిని, ప్రకృతి ఒడిని ఆస్వాధించేలా ఈ గార్డెన్‌ను డిజైన్ చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం వేళల్లో ఇక్కడ గడపడాన్ని ఆయన ఎంతో ఇష్టపడతారు. ఈ గార్డెన్ ఇంటికి ఒక రిసార్ట్ లాంటి అనుభూతిని ఇస్తుంది.
మొత్తానికి సెహ్వాగ్ నివాసంలో విలాసవంతమైన గదులు.. అత్యున్నత స్థాయి కిచెన్.. హోమ్ థియేటర్ వంటి సకల సౌకర్యాలు ఉన్నా... అతడు తనలోని కళాత్మకతకు, ఆధ్యాత్మికతకు... ప్రకృతికి ఇచ్చిన ప్రాధాన్యత ఈ ఇంటిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. సెహ్వాగ్ కి `కృష్ణ నివాస్` నిజంగానే ఒక కలల సౌధం అని చెప్పవచ్చు.