గుర్రం నుంచి పడిపోయినా తగ్గని విజయ్.. రణబాలి కోసం రౌడీ బాయ్ రిస్క్!
వీడియో చూసిన అభిమానులు విజయ్ డెడికేషన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక పాత్ర కోసం ఇంతలా ఫిజికల్‌గా, మెంటల్‌గా సిద్ధమవడం సాధారణ విషయం కాదని కామెంట్స్ చేస్తున్నారు.;
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను నిర్మించుకున్న విజయ్ దేవరకొండ మరోసారి తన డెడికేషన్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రణబాలిలో నటిస్తున్న విజయ్, ఈ సినిమా కోసం పడుతున్న కష్టం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
ఈ వీడియోలో విజయ్ దేవరకొండ పూర్తిస్థాయి వారియర్ అవతారంలో కనిపించారు. ముఖ్యంగా గుర్రపు స్వారీ కోసం ఆయన తీసుకున్న ట్రైనింగ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా పీరియాడిక్ సినిమాల్లో యాక్షన్ సీన్స్ కోసం బాడీ డబుల్స్‌ను ఉపయోగించే సందర్భాలు చాలానే ఉంటాయి. కానీ రణబాలి విషయంలో మాత్రం విజయ్ స్వయంగా ట్రైనింగ్ తీసుకుని గుర్రపు స్వారీ నేర్చుకున్నట్టు వీడియో ద్వారా స్పష్టమైంది. ప్రాక్టీస్ సమయంలో పలుమార్లు గుర్రం నుంచి కిందపడినా, గాయాలపాలైనా ఆయన వెనక్కి తగ్గకుండా మళ్లీ లేచి అదే ఎనర్జీతో రైడింగ్ కొనసాగించడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పడి లేచిన కెరటంలా విజయ్ చూపించిన పట్టుదల ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ వీడియోలో మా స్టాలిన్ విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు అనే ట్యాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీడియో చూసిన అభిమానులు విజయ్ డెడికేషన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక పాత్ర కోసం ఇంతలా ఫిజికల్‌గా, మెంటల్‌గా సిద్ధమవడం సాధారణ విషయం కాదని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రణబాలిలో విజయ్ పోషిస్తున్నక్యారెక్టర్ ఆయన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ రోల్స్‌లో ఒకటిగా ఉండబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌కు ఇప్పటికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత మళ్లీ ఈ జంట కలిసి నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజైన వీరి పెళ్లి సీక్వెన్స్ వీడియో కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రెండ్ అయింది. ఈసారి మాత్రం ప్రేమకథకు తోడు భారీ యాక్షన్, ఎమోషన్స్, చారిత్రక నేపథ్యం కూడా జత కావడంతో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది.
కాగా ఈ సినిమా కథ 1854 నుంచి 1878 మధ్య జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్టు సమాచారం. బ్రిటిష్ కాలం నాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను యాక్షన్ డ్రామాగా మలుస్తున్నారని తెలుస్తోంది. డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ టాక్సీవాలా తర్వాత మరోసారి విజయ్‌తో కలిసి పనిచేస్తుండటం కూడా సినిమాపై నమ్మకాన్ని పెంచుతోంది. ఇక ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్- అతుల్ సంగీతం అందిస్తుండటం మరో హైలైట్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం విడుదలైన ఒక్క ట్రైనింగ్ వీడియోతోనే ఇంత హైప్ క్రియేట్ అయితే, రాబోయే రోజుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.