రాజకీయ క్షేత్రంలో విజయ్ బిగిల్ వ్యూహం!

తమిళ ద‌ళ‌ప‌తి, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రస్తుతం రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టాన్ని ఎదుర్కొంటున్నారు.;

Update: 2026-05-09 17:41 GMT

తమిళ ద‌ళ‌ప‌తి, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రస్తుతం రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టాన్ని ఎదుర్కొంటున్నారు. 2019లో విజ‌య్ నటించిన `బిగిల్` చిత్రంలో ఒక కోచ్‌గా చెల్లాచెదురైన జట్టును ఏకం చేసి ఎలాగైతే విజేతగా నిలిపారో? తాజాగా వాస్తవ రాజకీయ మైదానంలో కూడా అదే తరహా డ్రిల్ చేస్తున్నారు. క్రీడల్లో ఛాంపియన్‌షిప్ కోసం పోరాడిన విజయ్ ఇప్పుడు ముఖ్య మంత్రి పీఠం కోసం సంకీర్ణ రాజకీయాల చుట్టూ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో జరుగుతోన్న పరిణామాలు అచ్చం అట్లీ దర్శకత్వంలో వచ్చిన సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల లెక్కలు చూస్తే విజయ్ పరిస్థితి ఉత్కంఠభరితంగా ఉంది.

మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీకి 118 సీట్లు అవసరం కాగా టీవీకే పార్టీ 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే విజయ్ రెండు నియోజకవర్గాల నుండి గెలవడంతో ఒక సీటును వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆయన బలం 107కి పడిపోయింది. మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి మరో 11 మంది అభ్యర్థుల మద్దతు అవసరం . సరిగ్గా ఒక ఫుట్‌బాల్ జట్టులో ఉండాల్సిన క్రీడాకారుల సంఖ్య 11 మేరకే ఆయనకు లోటు ఉండటం యాదృచ్ఛికం.`బిగిల్` సినిమాలో కోచ్ మైఖేల్ తన జట్టులోని క్రీడాకారులను ఒప్పించడానికి పడ్డ కష్టాలే ఇప్పుడు విజయ్ రాజకీయంగా ఎదుర్కొంటున్నారు. ముందుగా కాంగ్రెస్ తన ఐదు సీట్లతో మద్దతు ప్రకటించినా? బిజెపి లేదా అన్నాడీఎంకేతో జట్టు కట్టకూడదనే కఠినమైన షరతు విధించింది.

ఆ తర్వాత సిపిఐ, సిపిఎం పార్టీలు బయటి నుండి మద్దతు ఇస్తామని ప్రకటించాయి. దీంతో విజయ్ బలం 116కి చేరింది. మెజారిటీకి కేవలం రెండు సీట్ల దూరంలో నిలిచిన తరుణంలో సినిమా క్లైమాక్స్ తరహాలో ఊహించని ట్విస్టులు ఎదురవుతున్నాయి. ఈ రాజకీయ థ్రిల్లర్‌లో స్టార్ ప్లేయర్ పాత్రను వీసీకే అధినేత తిరుమావళవన్ పోషిస్తున్నారు. కేవలం రెండు సీట్లు ఉన్నప్పటికీ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఇవే కీలకంగా మారాయి. అయితే వీసీకే నేతలు తమకు ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని డిమాండ్ చేయడంతో చర్చలు కొలిక్కి రావడం లేదు. మధ్యలో నకిలీ లేఖలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడం, ఐయూఎంఎల్ వంటి పార్టీలు మద్దతుపై గందరగోళం సృష్టించడం వంటివి చూస్తుంటే ఒక భారీ బడ్జెట్ పొలిటికల్ మూవీలో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి.

మరోవైపు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తీరు కూడా సినిమాలో కఠినమైన అసోసియేషన్ అధికారిలా కనిపిస్తోంది. మూడు రోజుల్లో విజయ్ మూడుసార్లు గవర్నర్‌ను కలిసినా? 118 మంది ఎమ్మెల్యేల రాతపూర్వక మద్దతు ఉంటే తప్ప ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించలేమని స్పష్టం చేశారు. మరోవైపు టీటీవీ దినకరన్ వంటి నేతలు విజయ్ పై విమర్శలు గుప్పిస్తూ రాజకీయ వేడిని పెంచుతున్నారు. మే 10లోగా ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన వచ్చే ముప్పు ఉండటంతో విజయ్ ఇప్పుడు పెనాల్టీ షూటౌట్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు.తాజా సమాచారం ప్రకారం వీసీకే ఎట్టకేలకు మద్దతు లేఖను సమర్పించడంతో విజయ్ బలం 118 మార్కును దాటినట్లు తెలుస్తోంది.

సినిమా చివరలో `బిగిల్` జట్టు పెనాల్టీల ద్వారా గెలిచినట్లే విజయ్ కూడా ఈ రాజకీయ పోరులో గెలిచేలా కనిపిస్తున్నారు. అయితే వివిధ పార్టీల కలయికతో ఏర్పడే ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయ్ ఎంతకాలం సమర్థవంతంగా నడిపిస్తారు అనేది మిగిలి ఉన్న అతిపెద్ద ప్రశ్న. వెండితెర దళపతి ప్రజాక్షేత్రంలో అసలైన కోచ్ గా మారి తమిళనాడు రాజకీయ చరిత్రను మారుస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News