అనిరుధ్ వల్లే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా!
తమిళ సినీ పరిశ్రమలో క్రియేటివ్ డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన విఘ్నేష్ శివన్ తాజాగా తన జీవితంలోని కష్టకాలాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.;
తమిళ సినీ పరిశ్రమలో క్రియేటివ్ డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన విఘ్నేష్ శివన్ తాజాగా తన జీవితంలోని కష్టకాలాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, ఆ సమయంలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన సహాయం గురించి చెప్పిన వివరాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తన కొత్త చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న విఘ్నేష్ శివన్, తన జీవితాన్ని మార్చిన కీలక సంఘటనను పంచుకున్నారు. తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన నానుమ్ రౌడీ దాన్ సినిమా షూటింగ్ కోసం పాండిచ్చేరి వెళ్లాల్సిన సందర్భంలో తన దగ్గర కేవలం రూ.250 మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఆ సమయంలో తన ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉండేదని, భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొని ఉందని వెల్లడించారు.
అయితే ఆ సంక్షోభ సమయంలో అనిరుధ్ చేసిన సహాయం తన జీవితాన్ని మలుపుతిప్పిందని ఆయన గుర్తుచేసుకున్నారు. తాను బస్సులో వెళ్తున్న టైమ్ లో తన బ్యాగ్ లో రూ.50,000 డబ్బును సీక్రెట్ గా పెట్టానని అనిరుధ్ పంపిన మెసేజ్ చూసి తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని, ఆ క్షణం తన న జీవితంలో మరిచిపోలేనిదిగా మిగిలిందని విఘ్నేష్ తెలిపారు.
ఆ రోజు అనిరుధ్ నా పక్కన నిలబడకపోయి ఉంటే, ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదేమో అంటూ విఘ్నేష్ భావోద్వేగంతో పేర్కొన్నారు. కేవలం సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా, ఒక స్వచ్ఛమైన మనిషిగా కూడా మానసికంగా మరియు ఆర్థికంగా అనిరుధ్ తనకు అండగా నిలిచాడని ఆయన స్పష్టం చేశారు.
ఇక నానుమ్ రౌడీ దాన్ మూవీ విఘ్నేష్ లైఫ్ ను ఎంత బాగా మార్చివేసిందో తెలిసిందే. ఆ సినిమా ద్వారానే నయనతారతో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారి, చివరకు వివాహానికి దారితీసిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు అనిరుధ్ అందించిన మద్దతు విఘ్నేష్ లైఫ్ లో మరింత ప్రత్యేక స్థానం సంపాదించిందని అర్థమవుతుంది. కాగా విఘ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏప్రిల్ 10న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇందులో ప్రదీప్ రంగనాథన్ మరియు కృతి శెట్టి జంటగా నటించారు.