రూ.4000 కోసం రాష్ట్ర‌ప‌తి ముందు మంత్రితో గొడవపడ్డ జాతీయ అవార్డు దర్శకుడు

నేడు భారతీయ చలనచిత్ర రంగంలో విధు వినోద్ చోప్రా అత్యంత ప్రతిష్టాత్మకమైన దర్శకులలో ఒకరు.

Update: 2026-06-15 02:30 GMT

నేడు భారతీయ చలనచిత్ర రంగంలో విధు వినోద్ చోప్రా అత్యంత ప్రతిష్టాత్మకమైన దర్శకులలో ఒకరు. ఏడుసార్లు జాతీయ చలనచిత్ర పురస్కారాలను (నేషనల్ అవార్డ్స్) అందుకున్న ఘనత ఆయన సొంతం. అయితే పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (FTII) లో విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన తీసిన డిప్లొమా ఫిల్మ్ `మర్డర్ ఎట్ మంకీ హిల్`కు గాను తన కెరీర్‌లో మొదటి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు.. ఆయన దృష్టి అవార్డు ట్రోఫీపై లేదు. దానికి బదులుగా వేదికపైనే అప్పటి సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్.కె. అద్వానీతో రూ. 4,000 నగదు బహుమతి కోసం ఆ యువ దర్శకుడు వాదనకు దిగాడు. 2023లో ఒక ఇంటర్వ్యూలో విధు వినోద్ చోప్రా స్వయంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. ఈ విచిత్రమైన సంఘటన అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సమక్షంలోనే జరగడం విశేషం.

ఈ అవార్డు వేడుక అనుభవాన్ని చోప్రా గుర్తుచేసుకున్నారు. నేను స్టేజ్ మీద ఉన్నాను. మొదట భారత రాష్ట్రపతి నాకు అవార్డు ఇచ్చారు.. కానీ నా దృష్టి మాత్రం ప్రైజ్ మనీ కవర్‌పైనే ఉంది. ఎందుకంటే నాకు ఇచ్చిన ఎన్వలప్ కవర్ చాలా పల్చగా ఉంది. అక్కడే స్టేజ్ మీద దాన్ని ఓపెన్ చేసి చూస్తే.. అందులో పోస్టల్ ఆర్డర్ ఉంది. దానిపై ``ఏడేళ్ల తర్వాతే క్యాష్ చేసుకోవాలి`` అని రాసి ఉంది. అది చూసి ఆశ్చర్యపోయి... సార్! నాకు రూ. 4000 క్యాష్‌ ఇస్తామని చెప్పి ఈ పోస్టల్ ఆర్డర్ ఇస్తున్నారేంటి? అని అద్వానీ గారిని అక్కడే నిలదీశాను. ఏడేళ్ల తర్వాత ఈ డబ్బు రెట్టింపు అవుతుందని అద్వానీ నన్ను ముందుకు వెళ్లమన్నారు.. కానీ నేను అక్కడి నుండి కదలడానికి అస్సలు ఒప్పుకోలేదు! అని చోప్రా వివరించారు.

స్టేజ్ మీద జరుగుతున్న ఈ వాదనను గమనించిన అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జోక్యం చేసుకుని ``ఏదైనా సమస్య ఉందా యంగ్ మేన్? అని అడిగారు. దానికి చోప్రా స్పందిస్తూ.. `చాలా పెద్ద సమస్యే ఉంది సార్` అంటూ విషయం చెప్పారు. అద్వానీ మధ్యలో సర్దిచెప్పబోగా.. ``ఈ పోస్టల్ ఆర్డర్ మీరే ఉంచుకోండి, నాకు మాత్రం ప్రామిస్ చేసిన నగదు ఇవ్వండి`` అని చోప్రా పట్టుబట్టారు. దాంతో చేసేదేమీ లేక మరుసటి రోజు తనను శాస్త్రి భవన్‌లోని ఆఫీస్‌కు రమ్మని అద్వానీ చెప్పారు. అప్పటికి కూడా నమ్మకం కుదరని చోప్రా.. ఒకవేళ అద్వానీ గారు మాట మార్చితే నేరుగా మీకే ఫోన్ చేస్తానని రాష్ట్రపతితో అనగా ఆయన నవ్వుతూ ``అద్వానీ మంచి వ్యక్తి.. వెళ్లు`` అని సర్దిచెప్పారు.

మరుసటి రోజు శాస్త్రి భవన్‌కు వెళ్లిన చోప్రాపై అద్వానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ``జాతీయ అవార్డు గ్రహీత కేవలం రూ. 4,000 కోసం రాష్ట్రపతి ముందు.. నేషనల్ టెలివిజన్ లైవ్‌లోనే ఇలా గొడవపడతాడా? నీ తండ్రికి ఫోన్ చెయ్... భారతదేశ భవిష్యత్తు ఇదేనా? అని ఆయన్ని అడుగుతాను`` అని కోప్ప‌డ్డారు. దానికి చోప్రా ఏమాత్రం తగ్గకుండా.. ``సార్.. మీరు బ్రేక్‌ఫాస్ట్ చేశారా? నేను ఇంకా చేయలేదు. ఇక్కడికి రావడానికి ఒకరి దగ్గర రూ. 1200 అప్పు తీసుకున్నాను. ఈ వేడుక కోసం కొత్త షర్ట్ కొని, ఏసీ చైర్ కార్‌లో ప్రయాణించి వచ్చాను. ఇప్పుడు తిరిగి వెళ్లాక అప్పు ఇచ్చిన వాడికి ఏం చెప్పాలి? మీ ఉపన్యాసాలు పక్కన పెట్టి నా రూ. 4000 నాకు ఇవ్వండి. లేదంటే నేను మళ్లీ రాష్ట్రపతి దగ్గరికే వెళ్తాను`` అని తెగేసి చెప్పారు. చోప్రా ధైర్యానికి ముగ్ధుడైన అద్వానీ.. మొదట ఆయనకు టిఫిన్ ఇప్పించి ఆ తర్వాత సంతకం చేసి ఆ రూ. 4000 నగదును అందజేశారు.

దశాబ్దాల క్రితం జరిగిన ఈ సరదా ఎమోష‌న‌ల్ ఘ‌ట్టం ఇటీవలే స‌ర్కిల్‌ని పూర్తి చేసుకుంది. విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన `ట్వ‌ల్త్ ఫెయిల్` చిత్రం 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లో రెండు అవార్డులను గెలుచుకుంది. ఈ అవార్డులను అందుకున్న అనంతరం చోప్రా దంపతులు నేరుగా సీనియర్ బీజేపీ నేత ఎల్.కె. అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. నాాడు తన మొదటి అవార్డు ఇచ్చిన వ్యక్తిని నేడు తన 7వ జాతీయ అవార్డు సాధించిన తర్వాత కలిసి దీవెనలు అందుకోవడం ఎంతో భావోద్వేగాన్ని కలిగించిందని చోప్రా భార్య, సినీ విమర్శకురాలు అనుపమ చోప్రా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఒక సాధారణ యువకుడి నుండి దేశం గర్వించే దర్శకుడిగా ఎదిగిన చోప్రా సినీ ప్రయాణంలో ఈ ఘటన ఎప్పటికీ మరువలేనిది.

Tags:    

Similar News