కొడుకు మ‌ర‌ణంతో దిగాలైపోయిన దిగ్గ‌జ‌ ద‌ర్శ‌కుడు

భార‌తీయ సినిమా క్లాసిక్ డే సెల‌బ్రేష‌న్స్ లో భాగ‌స్తుడు అయిన ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌క‌నిర్మాత, ర‌చ‌యిత భార‌తీరాజా ఈ ఏడాది మార్చిలో కోలుకోలేని దెబ్బ తిన్నారు. అత‌డి కుమారుడు మ‌నోజ్ భార‌తీరాజా 48 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు.;

Update: 2025-10-01 01:30 GMT

కుంగుబాటు మ‌నిషిని తిరిగి కోలుకోనివ్వ‌దు. అలాంటి దుస్థితికి వెళ్లిపోయాడు ఈ ప్ర‌ముఖ త‌మిళ ఫిలింమేక‌ర్. భార‌తీయ సినిమా క్లాసిక్ డే సెల‌బ్రేష‌న్స్ లో భాగ‌స్తుడు అయిన ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌క‌నిర్మాత, ర‌చ‌యిత భార‌తీరాజా ఈ ఏడాది మార్చిలో కోలుకోలేని దెబ్బ తిన్నారు. అత‌డి కుమారుడు మ‌నోజ్ భార‌తీరాజా 48 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. కొడుకు ఆక‌స్మిక‌ మరణంలో అంత్యక్రియల దృశ్యాలలో భారతీరాజా పూర్తిగా కుంగిపోయి క‌నిపించారు.

తాజా ఇంట‌ర్వ్యూలో భార‌తీరాజా సోదరుడు జయరాజ్ పెరియమయతేవర్ త‌న అన్న మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింద‌ని చెప్పారు. ఆయన త‌న‌కు జ‌రిగిన‌ నష్టాన్ని తట్టుకోలేకపోతున్నారని వెల్లడించారు. ఇటీవల ఒక మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయరాజ్ మాట్లాడుతూ.. నా అన్న‌ కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఉన్నాడు. తన కుమారుడు మనోజ్ భారతీరాజా వియోగాన్ని తట్టుకోలేకపోతున్నాడు. అతడు ఎప్పుడూ మనోజ్ ఫోటోలను చూస్తూ కుంగిపోతాడు. స్థల మార్పు అతన్ని ఓదార్చి, నయం చేస్తుందని ఆశించి మేం అతడిని మలేషియాకు కూడా తీసుకెళ్లాం. కానీ అక్కడ కూడా అతడిని కొడుకు ఆలోచనలు వెంటాడాయి. ఇంత డ‌బ్బు, కీర్తి ఉన్నా, అతడు ఈ నష్టాన్ని తట్టుకోలేకపోతున్నాడు. అతడు నెమ్మదిగా తన పాత జ్ఞాపకాల నుండి దూరమవుతున్నాడు`` అని తెలిపారు.

మ‌నోజ్ తన తండ్రి దర్శకత్వం వహించిన తాజ్ మహల్ (1999) తో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఈ చిత్రానికి మ‌ణిర‌త్నం ర‌చ‌యిత‌. రెహ‌మాన్ సంగీతం అందించారు. తాజ్ మహల్ లోని `ఈచి ఎలుమిచి` పాటను అత‌డు ఆల‌పించి నేప‌థ్య గాయ‌కుడిగాను ప్ర‌య‌త్నించాడు. ఇంకా అత‌డికి చాలా భ‌విష్య‌త్ ఉంద‌ని భార‌తీరాజా భావించారు. కానీ మ‌నోజ్ గుండెపోటుతో మ‌ర‌ణించారు.

భారతీరాజాకు కొడుకు పుట్టిన త‌ర్వాత అన్నివిధాలా క‌లిసొచ్చింది. తన కుమారుడు జన్మించిన ఒక సంవత్సరం తర్వాత 1977లో `16 వయత్తినిలే`(ప‌ద‌హారేళ్ల వ‌య‌సు -తెలుగు)తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కిజాకే పోగుమ్ రైల్, సిగప్పు రోజక్కల్, అలైగల్ ఓవతిల్లై, కాదల్ ఓవియం, ముదల్ మరియాతై వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇయక్కునం ఇమ్మాయమ్ అనే బిరుదును కూడా సంపాదించాడు. ఇటీవల మోహన్‌లాల్ తుడరమ్‌లో న‌టుడిగాను కనిపించాడు. మోడరన్ లవ్ చెన్నై లో ఒక భాగం-` ఇది పరవై కూటిల్ వాజుమ్ మంగళ్`కి ఇటీవ‌ల భార‌తీరాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Tags:    

Similar News