మెగాస్టార్ కోసం క‌థ రెడీ కానీ ఇప్పుడే చేయ‌నంటున్న స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్

టాలీవుడ్‌లో డైరెక్ట‌ర్ గా వెంకీ అట్లూరి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తొలిప్రేమతో డైరెక్ట‌ర్ గా పరిచయమైన ఆయన.. మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాల‌ను తెర‌కెక్కించారు.

Update: 2026-08-16 07:50 GMT

టాలీవుడ్‌లో డైరెక్ట‌ర్ గా వెంకీ అట్లూరి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తొలిప్రేమతో డైరెక్ట‌ర్ గా పరిచయమైన ఆయన.. మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాల‌ను తెర‌కెక్కించారు. త‌ర్వాత ధ‌నుష్ తో సార్, దుల్క‌ర్ తో లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో స‌క్సెస్‌ల‌తో పాటూ తన ఫిల్మ్‌మేకింగ్‌పై నమ్మకాన్ని పెంచుకున్నారు. రీసెంట్‌గా సూర్య‌తో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతోనూ మంచి స‌క్సెస్‌ను అందుకున్న వెంకీ.. వరుస విజయాలతో తన రేంజ్‌ను క్రమంగా పెంచుకుంటున్నారు. ముఖ్యంగా లక్కీ భాస్కర్ స‌క్సెస్ ఆయన కెరీర్‌లో కీలకమైన మలుపుగా నిలిచింది.

ఇప్పటివరకు వెంకీ అట్లూరి చేసిన సినిమాలను గమనిస్తే.. ప్రతి సినిమాతోనూ ఒక కొత్త జానర్ లేదా కొత్త కథనాన్ని ప్రయత్నించే డైరెక్ట‌ర్ గా ఆయన ఇమేజ్ పెరిగింది. సార్ సినిమాతో స్ట్రాంగ్ సోషల్ మెసేజ్‌ను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చెప్పిన ఆయన.. లక్కీ భాస్కర్ తో పీరియాడిక్ క్రైమ్ డ్రామాను డీల్ చేసిన విధానం ఆడియ‌న్స్ తో పాటూ ఇండస్ట్రీ దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ స‌క్సెస్‌ల తర్వాత పెద్ద హీరోలతో సినిమాలు చేసే స్థాయికి వెంకీ చేరుకున్నారనే డిస్క‌ష‌న్ మొదలైంది.

అయితే ఇంతటి స‌క్సెస్‌లు వచ్చినా.. తనను తాను ఇంకా పూర్తిగా సంతృప్తి చెందిన డైరెక్ట‌ర్ గా వెంకీ భావించడం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడ‌దే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చిరంజీవి కోసం తాను ఒక థ్రిల్లర్ స్టోరీని ప్లాన్ చేశామని, అయితే దాన్ని తొందరపడి చేయాలని అనుకోవడం లేదని వెంకీ వెల్లడించారు. అంతేకాదు.. అలాంటి కథను, చిరూ లాంటి భారీ స్టార్‌ను హ్యాండిల్ చేయాలంటే డైరెక్ట‌ర్ గా తాను ఇంకా ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక్కడే లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి రేంజ్ ఎంతవరకు మారిందనే ప్రశ్న ఆసక్తిని కలిగిస్తోంది. ఒకవైపు వరుస స‌క్సెస్‌ల‌తో పెద్ద హీరోల దృష్టిలో పడుతున్న వెంకీ, మరోవైపు మెగాస్టార్ స్థాయి హీరోతో సినిమా విషయంలో మాత్రం తొందరపడకుండా తనను తాను మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నారు. అయితే చిరంజీవి కోసం అనుకున్న ఆ థ్రిల్లర్ కథ పూర్తిగా పక్కన పెట్టినట్టేనా? లేక సరైన టైమ్ కోసం దాన్ని వెంకీ అట్లూరి తన దగ్గరే ఉంచుకున్నారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న దానికంటే.. వెంకీ ఆ కథను తెరకెక్కించే స్థాయికి తనను తాను ఎప్పుడు సిద్ధం చేసుకుంటారన్నదే మరింత ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News