'దృశ్యం 3' తెలుగు వెర్షన్ చప్పుడు లేదేమిటీ?
క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ కథలతో తెరకెక్కిన దృశ్యం, దృశ్యం 2 మలయాళంలో బంపర్ హిట్లు అయ్యాయి. ఇప్పుడు పార్ట్ 3 తెరకెక్కి విడుదలకు వస్తోంది.;
క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ కథలతో తెరకెక్కిన దృశ్యం, దృశ్యం 2 మలయాళంలో బంపర్ హిట్లు అయ్యాయి. ఇప్పుడు పార్ట్ 3 తెరకెక్కి విడుదలకు వస్తోంది. దర్శకుడు జీతూ జోసెఫ్ ఫ్రాంఛైజీలో ఇదే చివరి సినిమా అని చెబుతున్నారు... కథకు ముగింపును కూడా ఇస్తున్నారు. కానీ తెలుగు వెర్షన్ రీమేక్ గురించి అసలు అప్ డేట్ లేనే లేదు. దీనికి కారణం ఏమిటి? వెంకీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారా? వివరం రాలేదేమిటీ!
మలయాళంలో ఉన్న క్రేజ్ తెలుగులో లేదా? అంటే .. `దృశ్యం 3` రీమేక్ నుండి వెంకటేష్ తప్పుకున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. తెలుగు వెర్షన్ విషయంలో కొన్ని సమీకరణాలు మారినట్లు కనిపిస్తున్నాయి. అధికారికంగా ధృవీకరించకపోయినా కానీ, వెంకీ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని అర్థమవుతోంది. మాతృకలో ఈ ఫ్రాంచైజీకి క్రేజ్ ఉన్నా తెలుగు వెర్షన్ కి వచ్చిన సమస్య ఏమిటో వెంకీ వెల్లడించాల్సి ఉంది.
టాలీవుడ్ లో ఇటీవల రీమేక్‌లపై విముఖత ఉందన్నది కాదనలేని వాస్తవం. గత కొంతకాలంగా రీమేక్ సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద రాణించడం లేదు. ప్రేక్షకులు ఒరిజినల్ వెర్షన్‌ను ఓటీటీలోనే చూసేస్తుండటంతో రీమేక్ చిత్రాలకు థియేటర్లో ఆదరణ తగ్గుతోంది.
మలయాళ వెర్షన్ ఏప్రిల్ 2న థియేటర్లలోకి వస్తోంది. ఇది విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. వెంకీ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `ఆదర్శ కుటుంబం` (AK 47) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయి `దృశ్యం 3` మొదలుపెట్టేలోపు మలయాళ వెర్షన్ సస్పెన్స్ అందరికీ తెలిసిపోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఆ `సర్ ప్రైజ్ ఎలిమెంట్ లేకపోతే సినిమా ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే వెంకీ నటించలేదని కూడా విశ్లేషిస్తున్నారు.
త్రివిక్రమ్ - అనిల్ రావిపూడితో వెంకీ ప్రాజెక్టులు దృశ్యం 3 కంటే క్రేజ్ ఉన్నవి అని భావిస్తున్నారు. వెంకటేష్ ప్రస్తుతం `ఆదర్శ కుటుంబం` మీద పూర్తి దృష్టి పెట్టారు. దీని తర్వాత అనిల్ రావిపూడితో మరో సినిమాకు కమిట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. వరుసగా స్ట్రెయిట్ సినిమాలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతానికి వెంకటేష్ ఈ సినిమాను పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. సురేష్ బాబు కూడా ఈ రీమేక్ విషయంలో డైలమాలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ `దృశ్యం 3`ను తెలుగులో చేయాలనుకుంటే, మలయాళ వెర్షన్ తో పాటు సమాంతరంగా పనులు మొదలు పెట్టాల్సి ఉంది .. కానీ అలా జరగలేదు. దీనిని బట్టి మలయాళ వెర్షన్‌నే తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశం కూడా లేకపోలేదని భావిస్తున్నారు. అయితే ఏం జరుగుతోందో వెంకీ కానీ, అతడి టీమ్ కానీ వెల్లడించాల్సి ఉంటుంది.
`దృశ్యం 3` ప్రత్యేకత ఏంటి?
దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ మూడవ భాగాన్ని `ది ఫైనల్ చాప్టర్`గా పేర్కొంటున్నారు. జార్జ్ కుట్టి (తెలుగులో రాంబాబు) తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే చివరి పోరాటం ఇది. గతం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందనే కోణంలో ఈ సినిమా సాగుతుంది. అశా శరత్ (ఐజీ గీతా ప్రభాకర్) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేస్తుందని.. ఇది జార్జ్ కుట్టి ప్రయాణానికి ముగింపు అని పేర్కొన్నారు.