జాతీయ అవార్డు చిత్రంలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో!

దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ కథను సిద్ధం చేసిన‌ప్పుడు కథానాయకుడిగా మొదట ఆయుష్మాన్ ఖురానాను అనుకోలేదట.

Update: 2026-06-09 01:30 GMT

బాలీవుడ్ క్లాసిక్ చిత్రాల్లో 2018లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ `అంధాధున్` ఒకటి. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాదు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో నటించాల్సిన అసలు నటీనటులు వీరు కాదంటూ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. కెరీర్ లో వ‌దులుకున్న గొప్ప అవ‌కాశం ఏదైనా ఉందా? అని ప్ర‌శ్నించ‌గా వ‌రుణ్ ధావ‌న్ ఏమాత్రం సంకోచించ‌కుడా అంధాధున్ అని సమాధానమిచ్చారు. కలెక్షన్ల పరంగానే కాకుండా కంటెంట్ పరంగా ఆ సినిమాను వదులుకోవడం తనను ఇప్పటికీ వెంటాడుతుందని పేర్కొన్నారు.

దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ కథను సిద్ధం చేసిన‌ప్పుడు కథానాయకుడిగా మొదట ఆయుష్మాన్ ఖురానాను అనుకోలేదట. వరుణ్ ధావన్ శైలికి ఈ పాత్ర సరిపోతుందని భావించి ఆయనను సంప్రదించారు. అయితే ఆ సమయంలో వరుణ్ ధావన్ ఇతర చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల కాల్‌షీట్లు సర్దుబాటు చేయలే కపోయారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ నుండి ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. వరుణ్ తప్పుకున్న తర్వాతే ఈ అవకాశం ఆయుష్మాన్ ఖురానాకు దక్కింది. ఆయన అద్భుత నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశారు.

ఇదే ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ ఎవరికీ తెలియని మరొ పెద్ద రహస్యాన్ని బయటపెట్టారు. ఈ సినిమాలో హీరోగా తనను అనుకున్నప్పుడు హీరోయిన్‌గా కంగనా రనౌత్‌ను చిత్రబృందం పరిశీలించిందని వెల్లడించారు. అంధాధున్ సినిమాలో కంగనా పేరు వినపడటం అభిమానులకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటి వరకు వరుణ్ ధావన్ స్థానంలో ఆయుష్మాన్ వచ్చాడనే విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసినప్పటికీ కంగనా రనౌత్ కూడా ఈ రేసులో ఉందనే విషయం మాత్రం వెలుగులోకి రావ‌డం ఇదే తొలిసారి.ఈ ప్రకటనతో ప్రేక్షకులలో ఓ కొత్త ఉత్కంఠ మొదలైంది. సినిమాలో కంగనా రనౌత్‌ను ఏ పాత్ర కోసం అనుకుని ఉంటారనే దానిపై విశ్లేషణలు మొదలయ్యాయి. కథ ప్రకారం టబు పోషించిన ప్రతికూల ఛాయలున్న బలమైన పాత్ర కోసమా? లేక? రాధికా ఆప్టే పోషించిన కథానాయిక పాత్ర కోసమా? అనేది వరుణ్ రివీల్ చేయ‌లేదు.

ఏదేమైనప్పటికీ వరుణ్ ధావన్ - కంగనా రనౌత్ కాంబినేషన్‌లో ఈ సినిమా గనుక పట్టాలెక్కి ఉంటే బాలీవుడ్‌లో ఒక విభిన్నమైన క్రేజీ కాంబినేషన్ చూసే అవకాశం ప్రేక్షకులకు ద‌క్కేది. కాలం కలిసి రాకపోవడం వల్ల కొందరు వదులుకున్న అవకాశాలు మరికొందరి జీవితాలను మలుపు తిప్పుతాయి అనడానికి అంధాధున్ ఓ ఉదాహరణ. వరుణ్- కంగనా ఈ ప్రాజెక్ట్ నుండి దూరం కావడం ఆయుష్మాన్‌కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టేలా చేసింది. ఈ సినిమా సాధించిన ఘనవిజయం.. ప్రేక్షకులలో ఆ చిత్రానికి ఆద‌ర‌ణ చూస్తే? ఒకవేళ నటీనటులు మారి ఉంటే ఈ స్థాయి విజయం దక్కేదా ? అనే సందేహాలు రావడం సహజం. ఇండ‌స్ట్రీలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Tags:    

Similar News