ఆన్‌ స్క్రీన్‌ నరేంద్ర మోదీ... దాడి కేసులో కోర్ట్‌ సమన్లు

భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. 'మా వందే' అనే టైటిల్‌తో ప్రధాని నరేంద్ర మోడీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఆవిష్కరించేందుకు రెడీ అయ్యారు.;

Update: 2025-09-23 05:20 GMT

భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. 'మా వందే' అనే టైటిల్‌తో ప్రధాని నరేంద్ర మోడీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఆవిష్కరించేందుకు రెడీ అయ్యారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్స్‌ విడుదల అయ్యాయి. ఆ సమయంలో మోదీ పాత్రలో కనిపించబోతున్నది మలయాళ ప్రముఖ నటుడు ఉన్ని ముకుందన్‌ అనే వార్తలు వచ్చాయి. వార్తలు నిజమే అన్నట్లుగా తాజాగా ఉన్ని ముకుందన్‌ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్‌ సభ్యులు మా వందేకు సంబంధించిన మరిన్ని పోస్టర్స్‌ను వేయడం జరిగింది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం మా వందే పోస్టర్స్‌, సినిమా గురించిన ముచ్చట్లు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ సమయంలో ఉన్ని ముకుందన్‌కి కోర్ట్‌ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం కేరళలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ విషయం గురించి చర్చ జరుగుతోంది.

ఉన్ని ముకుందన్‌ మాజీ మేనేజర్‌పై దాడి

కేసు వివరాల్లోకి వెళ్తే.. కొన్నాళ్ల క్రితం ఉన్ని ముకుందన్‌ తన మాజీ మేనేజర్‌ విపిన్‌ కుమార్‌ పై దాడి చేశాడు అనేది ఆరోపణ. ఈ విషయమై ఉన్ని ముకుందన్‌ చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసు విషయమై ముకుందన్‌ కేరళలోని కాకనాడ్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. అక్టోబర్‌ 27వ తారీకున ఖచ్చితంగా కోర్ట్‌ ముందు ఉన్ని ముకుందన్‌ హాజరు కావాల్సి ఉంది. ఈ కేసులో పోలీసులు లోతుగా ఎంక్వౌరీ చేశారు. కొన్ని సీసీ టీవీ ఫుటేజ్‌లను, పదుల సంఖ్యలో సాక్ష్యులను విచారించిన పోలీసులు వారు ఇచ్చిన సమాచారంను కోర్ట్‌ ముందు ఉంచడం జరిగిందట. అంతే కాకుండా దాడి జరిగిన సమయంలో వినియోగించిన ఫోన్లు, అప్పుడు జరిగిన ఫోన్ సంభాషణలకు సంబంధించిన విషయాలను గురించి కూడా మొబైల్ టవర్స్ సమాచారం ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు ఆ విషయాలను కోర్టు ముందు ఉంచడం జరిగిందట.

హీరోకి సమన్లు జారీ చేసిన కోర్ట్‌

సీసీ టీవీ ఫుటేజ్‌లో ఉన్ని ముకుందన్‌ తన మాజీ మేనేజర్‌పై దాడి చేసినట్లుగా లేదని పోలీసులు చెబుతున్నారు. అంతే కాకుండా ఉన్ని ముకుందన్‌ పై విపిన్‌ చేస్తున్న ఆరోపణల్లో చాలా వరకు అవాస్తవం అని కూడా పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారని తెలుస్తోంది. కేసు విచారణ చివరి దశకు చేరిన నేపథ్యంలో ఉన్ని ముకుందన్‌ను కోర్ట్‌ కు హాజరు కావాల్సిందిగా కోర్ట్‌ ఆదేశించి ఉండవచ్చు అని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఉన్ని ముకుందన్‌కు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కొందరు యాంటి ఫ్యాన్స్ ఈ కేసులో ఖచ్చితంగా ముకుందన్‌కి శిక్ష పడాలని, హీరో అనే గర్వంతో తన మాజీ మేనేజర్‌ను ఆయన దుర్భాషలాడుతూ, కొట్టాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

ఎన్టీఆర్‌ జనతా గ్యారేజ్‌లో ఉన్ని ముకుందన్‌

ఇక ఉన్ని ముకుందన్‌ సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఈయన గెట్-సెట్ బేబీ, మెహ్ఫిల్ సినిమాలతో వచ్చాడు. త్వరలో మిండియుం పరంజుం సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటిని పూర్తి చేసుకున్న తర్వాత మా వందే సినిమా షూటింగ్‌ కి ఆయన జాయిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ సినిమాలో ఎలాంటి కథను చూపించబోతున్నారు, రాజకీయంగా సినిమా ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. తెలుగులో పలు సినిమాల్లో నటించడం ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న ఉన్ని ముకుందన్‌ త్వరలోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరో సినిమాలో కీలక పాత్రలో మరోసారి కనిపించే అవకాశాలు ఉన్నాయి. జనతాగ్యారేజ్‌లో ఈయన పోషించిన పాత్రకు మంచి పేరు వచ్చిన విషయం తెల్సిందే. అందుకే టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ని అంతా కోరుతున్నారు.

Tags:    

Similar News