6 ఒప్పందాలు, 529 బాంబింగ్ లు... ట్రంప్ కు నోబెల్ సాధ్యమేనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఎలాగైనా నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలని నానారకాల తాపత్రయాలు పడుతున్నారు.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఎలాగైనా నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలని నానారకాల తాపత్రయాలు పడుతున్నారు. ఏ రెండు దేశాల మధ్య ఏ చిన్న సమస్య ఉన్నా.. వెంటనే అక్కడ వాలిపోతున్నారు. ఆ దేశాధినేతలను వైట్ హౌస్ కి రప్పించి శాంతి ఒప్పందాలు చేయించేస్తున్నారు. అనంతరం వారితో నోబెల్ ప్రైజ్ కు మద్దతు ప్రకటించే కార్యక్రమానికి తెరలేపుతున్నారు!
మొన్న పాకిస్థాన్ అయినా, నిన్న ఇజ్రాయెల్ అయినా, అనంతరం కంబోడియా అయినా.. తాజాగా అర్మేనియా, అజార్ బైజాన్ అయినా... ప్రొసీజర్ సేమ్ అనే చెప్పాలి! కాకపోతే వీటిలో భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ పాత్ర లేకపోయినా... పాక్ మాత్రం ట్రంప్ ని ఈ విషయంలో తెగ పొగిడేసింది. ఈ క్రమంలో అసలు ట్రంప్ కు శాంతి బహుమతి సాధ్యమేనా అనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... ఇప్పటికే మూడుసార్లు నోబెల్ కమిటీకి నామినేషన్లు పంపించి, తిరస్కరణకు గురైన ట్రంప్.. ఈసారి ఎలాగైనా సంపాధించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతర దేశాధినేతల సంగతి అలా ఉంచితే... ఈ ప్రయత్నం కోసం వైట్ హౌస్ ప్రయత్నమూ పీక్స్ కి చేరిందని అంటున్నారు. దీనికి ఉదాహారణ... ఇటీవల వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వ్యాఖ్యలు!
నెలకు సగటున ఒకటి చొప్పున శాంతి ఒప్పందాలు!:
ఇటీవల కరోలిన్ లీవిట్ స్పందిస్తూ... శాంతి రంగంలో అధ్యక్షుడు ట్రంప్ థాయిలాండ్ - కంబోడియా మధ్య తక్షణ, బేషరతు కాల్పుల విరమణకు సహాయం చేశారని తెలిపారు. ఇదే సమయంలో... ఇజ్రాయెల్ - ఇరాన్, రువాండా - కాంగో, భారత్ - పాక్, సెర్బియా - కొసావో, ఈజిప్ట్ - ఇథియోపియా మధ్య ఘర్షణలను ట్రంప్ ఇప్పటివరకూ ముగించరని తెలిపారు.
అంటే... అధ్యక్షుడు ట్రంప్ తన ఆరు నెలల పదవీకాలంలో సగటున నెలకు ఒక శాంతి ఒప్పందం లేదా సీజ్ ఫైర్ కు మధ్యవర్తిత్వం వహించారని కరోలిన్ అన్నారు. అనంతరం... ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేందుకు ఇదే సరైన అవకాశం అని తెలిపారు.
240 ప్రదేశాల్లో 529 బాంబింగ్ లు!:
వైట్ హౌస్ ప్రకటించినట్లు సగటు నెలకు ఒకటి చొప్పున శాంతి ఒప్పందాలు చేయిస్తున్న మాటల సంగతి అలా ఉంటే... ట్రంప్ ఆరు నెలల వ్యవధిలో చేయించిన బాంబింగ్ ల అంశం సంగతేమిటి అనే చర్చ తెరపైకి వచ్చింది. కారణం... ఆరు నెలల వ్యవధిలో సుమారు 240 ప్రదేశాల్లో 529 బాంబింగ్ లను ట్రంప్ చేయించారు!
ఈ విషయాన్ని ‘ఆర్మ్డ్ కాన్ ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా’ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో... పై ఆరు ఒప్పందాల సంగతి అలా ఉంచితే, ఈ 529 బాంబింగ్ ల సంగతి ఏమిటి? ఇటీవల ఇరాన్ పై బంకర్ బ్లస్టర్ బాంబులతో చేసిన దాడుల పరిస్థితి ఏమిటి? అనేవి ట్రంప్ ఆశలకు గట్టిగానే గండికొట్టే అవకాశం ఉందని అంటున్నారు.
నేతలు ప్రతిపాదిస్తే అవుతుందా?
ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి ఆయా దేశాల నేతలు ప్రతిపాదించడం ఇదే తొలిసారి కాదు. ఉత్తర కొరియా, అమెరికా మధ్య చర్చలను కారణంగా చూపిస్తూ.. 2018లో అణు నిరాయుధీకరణ యత్నాలకు ఇద్దరు నార్వే ప్రజాప్రతినిధులు, 18 మంది రిపబ్లికన్ సభ్యులు ట్రంప్ పేరును తొలిసారి ప్రతిపాదించారు. అప్పుడు ట్రంప్ కు నోబెల్ రాలేదు.
రెండోసారి పశ్చిమాసియాలో అబ్రహం ఒప్పందాలు చేయించినందుకు ఓ స్వీడిష్ చట్టసభ సభ్యుడు, ఫిన్లాండ్ చట్టసభ సభ్యుడు, ఐరోపా పార్లమెంట్ సభ్యుడితో పాటు కొందరు ఆస్ట్రేలియా లా ప్రొఫెసర్లు 2020లో మరోసారి ట్రంప్ పేరును నోబెల్ కు ప్రతిపాదించారు. అప్పుడు కూడా ఆయన కోరిక తీరలేదు.
ఈ క్రమంలో.. 2024లో అధ్యక్ష పదవి చేపట్టేందుకు సిద్ధమైన వేళ ఆయన పేరును కాంగ్రెస్ ఉమెన్ క్లాడియా టెన్ని.. నోబెల్ కు నామినేట్ చేశారు. అప్పుడు కూడా నోబెల్ కమిటీ ట్రంప్ ను పక్కకెళ్లి ఆడుకోమన్న పరిస్థితి! మరి ట్రంప్ ప్రయత్నం వచ్చే ఏడాది ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.
భారత్ సెటైర్ ఇది!:
మరోవైపు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి అంశంపై భారత్ ఇటీవల స్పందించింది. ఈ సమయంలో... 'ట్రంప్ కు నోబెల్ శాంతి ఇవ్వాలా..?' అంటూ విలేకరుల ప్రశ్నించగా స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్.. "ఈ ప్రశ్నను మీరు వైట్ హౌస్ నే అడుగుతే మంచిదని నా అభిప్రాయం" అంటూ పేర్కొన్నారు.