మే ఎండలో బాక్సాఫీస్‌కు చల్లని ఊపిరి పోసేది ఎవరు?

టాలీవుడ్ బాక్సాఫీస్ ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన దశలో ఉంది. సమ్మర్ సీజన్ అంటే సాధారణంగా స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు సందడిగా ఉండాలి.

Update: 2026-05-20 19:18 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన దశలో ఉంది. సమ్మర్ సీజన్ అంటే సాధారణంగా స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు సందడిగా ఉండాలి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. భారీ సినిమాలు లేకపోవడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకుల రద్దీ తగ్గిపోయింది. ఈ పరిస్థితిలో ప్రస్తుతం కొంతమేర నిలకడగా వసూళ్లు రాబడుతున్న సినిమా గోదారి గ‌ట్టుపైన మాత్రమే కావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇక జూన్ 4న రిలీజ్ కానున్న పెద్ది వరకు థియేటర్లను నిలబెట్టేది ఎవరు? బాక్సాఫీస్‌కు ఊపిరి పోసేది ఏ సినిమా? అన్న ప్రశ్న ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వారం రిలీజ్‌కు రెడీ అవుతున్న మూడు సినిమాలపైనే ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టి ఉంది. అందులో మొదటగా చర్చలో నిలిచింది నందు నటించిన అగ్లీ స్టోరీ సినిమా. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌తోనే సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించింది. యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ సినిమా కంటెంట్ పరంగా కొత్తదనం చూపిస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందన్నది కీలకంగా మారింది.

మరోవైపు పురుషః మాత్రం పూర్తిగా భిన్నమైన జోనర్‌తో వస్తోంది. ఫన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవింపుతో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే మంచి బజ్ తెచ్చుకుంది. కొత్త హీరో పవన్ కళ్యాణ్ పరిచయం అవుతున్నప్పటికీ, సినిమాలో కనిపిస్తున్న క్యాస్టింగ్ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చారు. ముఖ్యంగా సమ్మర్ హాలీడేస్ టైమ్ లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక ఈ వారంలో అత్యధిక అంచనాలు నెలకొన్న సినిమా మాత్రం మోహన్‌లాల్ నటించిన దృశ్యం3. గతంలో వచ్చిన దృశ్యం సిరీస్‌కు తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. ఈసారి రీమేక్ కాకుండా నేరుగా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవుతుండ‌టం ఆసక్తిని మరింత పెంచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే శక్తి ఈ సినిమాకే ఎక్కువగా ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. సస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ నేరేషన్ కలిసొస్తే ఈ సినిమా సైలెంట్‌గా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్ పరిస్థితి చూస్తే మే నెల చివరి వారమే బాక్సాఫీస్‌కు కీలక పరీక్షగా మారింది. పెద్ద సినిమాలు లేకున్నా కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకాన్ని ఈ సినిమాలు నిలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సమ్మర్ సీజన్ చివర్లో సైలెంట్‌గా సర్ప్రైజ్ హిట్ కొట్టే సినిమా ఏది అన్న ఆసక్తి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News