సమ్మర్ 'సినీ' సీజన్.. ఐపీఎల్ ఎఫెక్ట్ గట్టిగా పడుతుందా?

అందుకే పెద్ద సినిమాలు కూడా ఆ టైమ్ లో ప్లాన్ చేస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే ఆశలతో సమ్మర్ సీజన్ ప్రారంభమైంది.;

Update: 2026-04-07 11:27 GMT

టాలీవుడ్‌ లో సమ్మర్ సీజన్‌ ను ఎప్పటికీ గోల్డెన్ పీరియడ్‌ గా భావిస్తారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఉండటంతో కుటుంబాలతో థియేటర్లకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆశిస్తుంటారు. అందుకే పెద్ద సినిమాలు కూడా ఆ టైమ్ లో ప్లాన్ చేస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే ఆశలతో సమ్మర్ సీజన్ ప్రారంభమైంది.

ఇప్పటికే విడుదలైన బైకర్, రాకాస సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొంత ఊపును తీసుకొచ్చాయి. సంక్రాంతి తర్వాత టాలీవుడ్‌ లో కనిపించిన నిరుత్సాహ పరిస్థితికి కొంత బ్రేక్ ఇచ్చాయని చెప్పాలి. బ్లాక్‌ బస్టర్ టాక్ రాకపోయినా, పాజిటివ్ రివ్యూస్‌ తో ఆ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యాయి. దీంతో సమ్మర్ సీజన్ మంచి ఆరంభం దక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే ఈసారి పరిస్థితి అంత ఈజీగా లేదనే చెప్పాలి. కారణం క్రికెట్ ఫీవర్. ముఖ్యంగా ఐపీఎల్ కొనసాగుతుండటంతో థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్యపై ప్రభావం పడుతోంది. వీకెండ్స్‌ లో డబుల్ మ్యాచ్‌ లు ఉండటంతో ప్రేక్షకులు టీవీల ముందు, మొబైల్ స్క్రీన్స్ ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో థియేటర్ల ఆక్యుపెన్సీపై ప్రభావం పడుతున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం నడుస్తున్న సినిమాల వసూళ్లపై కూడా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా శనివారం, ఆదివారం రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే సంఖ్య తగ్గుతున్నట్టు సమాచారం. ఇదే ట్రెండ్ కొనసాగితే రాబోయే చిత్రాలకు కూడా ఇది ఒక సవాల్‌ గా మారే అవకాశముంది. అయితతే వచ్చే వారం మూడు సినిమాలు రిలీజ్‌ కు రెడీ అవుతున్నాయి.

డెకాయిట్, ఎల్ఐకే, పళ్లిచట్టంబి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో డెకాయిట్ తెలుగు ఒరిజినల్ మూవీ కాగా, మిగతా రెండు డబ్బింగ్ చిత్రాలు. అయినప్పటికీ ఆ మూడు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ట్రైలర్స్, టీజర్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో బజ్ పెరిగింది. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ థియేటర్లకు వస్తారన్న నమ్మకం ఇండస్ట్రీలో ఉంది.

కాబట్టి ఆ సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. అయితే ఐపీఎల్ మ్యాచ్లతో పోటీ పడాల్సిన పరిస్థితి ఉండటం వల్ల మొదటి మూడు రోజులు కీలకంగా మారనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీకెండ్ వసూళ్లతో పాటు వీక్‌ డేస్ కలెక్షన్స్ కూడా ముఖ్యం. మంచి కంటెంట్ ఉంటే మౌత్ టాక్ ద్వారా ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉంది. అదే సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ ను టార్గెట్ చేసే సినిమాలు కొంత వరకు ఐపీఎల్ ప్రభావాన్ని తట్టుకునే అవకాశముందని చెప్పాలి. మొత్తానికి సమ్మర్ సీజన్ కు ఐపీఎల్ సవాల్ గా మారింది. ఒకవైపు సినిమాలపై మంచి బజ్ ఉండగా, మరోవైపు ఐపీఎల్ క్రేజ్ గట్టిగా ఉండటం వల్ల వసూళ్లు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News