స్టూడియోపై నింద.. వివరణ ఇచ్చిన సురేష్ ప్రొడక్షన్స్
టాలీవుడ్ పాపులర్ ఫిల్మ్‌స్టూడియోలు రామానాయుడు ఫిలింస్టూడియోస్, అన్నపూర్ణ ఫిలింస్టూడియోస్ ఈ ఏడాది ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ ఫీజు చెల్లించలేదని జీహెచ్ఎంసి అధికారులు నోటీసులు పంపినట్లు వార్తా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.;
టాలీవుడ్ పాపులర్ ఫిల్మ్‌స్టూడియోలు రామానాయుడు ఫిలింస్టూడియోస్, అన్నపూర్ణ ఫిలింస్టూడియోస్ ఈ ఏడాది ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ ఫీజు చెల్లించలేదని జీహెచ్ఎంసి అధికారులు నోటీసులు పంపినట్లు వార్తా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ స్పందించింది. రామానాయుడు స్టూడియోస్ రెగ్యులర్ గా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లిస్తోందని, అలాగే ఆస్తి పన్నును కూడా సకాలంలో కట్టేస్తున్నామని వెల్లడిస్తూ ఒక నోట్ రిలీజ్ చేసారు.
అయితే ఈ ఏడాది ఆస్తి పన్ను చాలా ఎక్కువ పెంచారు. అలా జరగకుండా ప్రభుత్వం సవరించాలని కూడా సురేష్ ప్రొడక్షన్స్ తన నోట్ లో అభ్యర్థించింది. 68,276 స్క్వేర్ ఫీట్(చదరపు అడుగుల) బిల్ట్ అప్ ఏరియాలోని స్టూడియో కోసం చాలా సంవత్సరాలుగా సకాలంలో పన్ను చెల్లించామని కూడా నోట్ లో పేర్కొన్నారు. అలాగే తమ స్టూడియో బిల్టప్ ఏరియా గురించి ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వడం లేదని కూడా సురేష్ ప్రొడక్షన్స్ తన నోట్ లో వెల్లడించింది. ఈ ఏడాది ఎప్పుడూ లేనంతగా ట్రైడ్ లైసెన్స్ ఫీజు అమాంతం పెంచారు. రూ. 7614 నుంచి ఏకంగా రూ.2,73,104 లక్షల కు లైసెన్స్ ఫీజును అసంబద్ధంగా పెంచారని సురేష్ ప్రొడక్షన్స్ నివేదించింది. దీనిని పాలనావిభాగం అధికారులు పరిశీలించాలని కూడా కోరింది. జీవీఎంసి ఈ విషయంలో పునఃపరిశీలన చేస్తుందని మేమంతా నమ్మకంగా ఉన్నామని కూడా నోట్ పేర్కొంది.
అలాగే మేం ప్రత్యేకంగా చెప్పదలిచినది ఏమిటంటే రామానాయుడు స్టూడియోస్ బిల్టప్ ఏరియా గురించి అవసరమైన సమాచారం ఇచ్చేందుకు అధికారులతో తాము కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా సహకరిస్తున్నామని కూడా వెల్లడించింది. దీనిపై సామాజిక మాధ్యమాలలో ప్రచారమవుతున్న కథనాలన్నీ తప్పుడు సమాచారంతో ఉన్నాయని కూడా నోట్ లో పేర్కొంది. జీ.హెచ్.ఎం.సి నియమనిబంధనల ప్రకారం ప్రతిదీ రామానాయుడు స్టూడియోస్ లో అమలులో ఉంటుందని కూడా నోట్ లో పేర్కొన్నారు. అధికారులతో నిరంతరం తాము టచ్ లో ఉన్నామని, అన్నివిధాలా సహకరిస్తున్నామని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను నమ్మొద్దని కూడా నోట్ లో అభ్యర్థించారు.
అసలు నోటీసుల్లో ఏం ఉంది?
వాస్తవానికి అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ వాస్తవ వాణిజ్య ప్రాంతాన్ని(బిజినెస్ ఏరియా) తక్కువ చేసి చూపిస్తున్నాయని, తద్వారా ట్రేడ్ లైసెన్స్ ఫీజును చాలా వరకూ తగ్గింపు ధరలతో చెల్లిస్తున్నాయని, ఫలితంగా భారీ పన్ను ఎగవేస్తున్నారని జీహెచ్ఎంసి సర్కిల్ 18 అధికారులు గుర్తించినట్టు కథనాలొచ్చాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ రూ.11.52 లక్షల బకాయి చెల్లించాల్సి ఉందని కథనాలొచ్చాయి. అధికారుల ప్రకారం, అన్నపూర్ణ స్టూడియోస్ 1.92 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలంలో పనిచేస్తుంది కానీ పన్ను ప్రయోజనాల కోసం 8,100 చదరపు అడుగులను మాత్రమే రికార్డుల్లో చూపుతోంది. తద్వారా అన్నపూర్ణ స్టూడియో రూ.11,52,000 ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉండగా, రూ.49,000 మాత్రమే చెల్లిస్తోంది. రూ.11 లక్షలకు పైగా పన్నులు ఎగవేస్తోంది.
రామానాయుడు స్టూడియోస్ రూ.2.73 లక్షల బకాయి చెల్లించాల్సి ఉంది. స్టూడియోస్ 68,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పనిచేస్తుంది కానీ పన్ను లెక్కింపు ప్రయోజనాల కోసం 1,900 చదరపు అడుగులను మాత్రమే రికార్డుల్లో చూపిస్తోంది. స్టూడియో రూ.2,73,000 చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.1,900 మాత్రమే చెల్లిస్తోంది. ట్రేడ్ లైసెన్స్ ఫీజులో దాదాపు రూ.2.65 లక్షలు ఎగవేసిందని అధికారులు పేర్కొన్నట్టు కథనాలొచ్చాయి. జీ హెచ్ ఎంసి జూబ్లీ హిల్స్ సర్కిల్ అధికారులు నవంబర్ 21న రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేశారు. స్టూడియోల వాస్తవ వాణిజ్య ప్రాంతం ఆధారంగా పూర్తి ట్రేడ్ లైసెన్స్ ఫీజులను చెల్లించాలని హెచ్చరించారు. రెండు సంస్థలు పెద్ద ఎత్తున పన్నులను ఎగవేసేందుకు తప్పుడు పత్రాలను సమర్పించాయని అధికారులు పేర్కొన్నట్టు కథనాలొచ్చాయి. అయితే రామానాయుడు స్టూడియోస్ తాజా నోట్ లో ఈ వివరాలను ఖండించింది.