'ఐబొమ్మ' దెబ్బకు కదిలిన ఇండస్ట్రీ.. సజ్జనార్‌ను కలిసిన స్టార్ హీరోలు
తెలుగు సినిమా పరిశ్రమకు ఏళ్లుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న 'ఐబొమ్మ' పైరసీ వెబ్‌సైట్ అడ్డంకి తొలగిపోయింది.;
తెలుగు సినిమా పరిశ్రమకు ఏళ్లుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న 'ఐబొమ్మ' పైరసీ వెబ్‌సైట్ అడ్డంకి తొలగిపోయింది. ఈ వెబ్‌సైట్ ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవి అరెస్ట్ కావడంతో ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. ఈ కీలక పరిణామం నేపథ్యంలో, సోమవారం నాడు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, అగ్ర నిర్మాత దిల్ రాజు.. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ బీసీ సజ్జనార్‌తో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో 'ఐబొమ్మ' అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అనంతరం సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించి సంచలన విషయాలు బయటపెట్టారు. "పైరసీ అనేది దేశవ్యాప్త సమస్య. దీనివల్ల సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఎంతో శ్రమించి ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని ఎట్టకేలకు పట్టుకున్నాం" అని సజ్జనార్ వెల్లడించారు.
ఇమ్మడి రవి కార్యకలాపాల గురించి సీపీ సజ్జనార్ వివరిస్తూ, "రవి కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్‌కు చెందిన సినిమాలను పైరసీ చేశాడు. అతని నుంచి 3 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నాం" అని తెలిపారు. అంతేకాదు, విచారణలో రవి సుమారు 20 కోట్ల వరకు సంపాదించినట్లు అంగీకరించాడని కూడా సజ్జనార్ చెప్పడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
ఈ కేసులో మరో భయంకరమైన కోణం కూడా బయటపడింది. ఇమ్మడి రవి వద్ద ఏకంగా 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా ఉందని, ఆ డేటాను డార్క్ వెబ్‌లో అమ్మడం ద్వారా దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉండేదని సజ్జనార్ హెచ్చరించారు. పైరసీ ముసుగులోనే రవి, ఎంతో మంది యువకుల ప్రాణాలు తీసిన, కుటుంబాలను నాశనం చేసిన బెట్టింగ్ యాప్స్‌ను కూడా ప్రమోట్ చేసినట్లు ఆయన తెలిపారు.
రవి నేర చరిత్ర గురించి వివరిస్తూ, "అతనికి ముందు నుంచే క్రిమినల్ మైండ్ ఉంది. మహారాష్ట్రలో 'ప్రహ్లాద్' పేరుతో నకిలీ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ సృష్టించుకున్నాడు" అని అన్నారు. అంతేకాదు, పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఏకంగా కరేబియన్ ఐలాండ్స్ పౌరసత్వం తీసుకున్నాడని, ఫ్రాన్స్, దుబాయ్, థాయిలాండ్ దేశాలు తిరుగుతూ, అమెరికా, నెదర్లాండ్స్‌లో సర్వర్లు పెట్టి ఈ రాకెట్‌ను నడిపించాడని సీపీ వెల్లడించారు.
ఈ కేసుకు సంబంధించి మొత్తం 5 కేసులు నమోదు చేశామని, దుద్దెల శివరాజ్, ప్రశాంత్ అనే మరో ఇద్దరిని ఇదివరకే అరెస్ట్ చేశామని సజ్జనార్ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఇంకా పెద్ద రాకెట్ ఉందని, దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.