సీనియ‌ర్లు న‌లుగురు బ్రేక్ లోనేనా!

ద‌స‌రా పండుగ కావ‌డంతో ఇంట్లో మన‌వ‌ల‌తో ఆడుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారుట‌. ఇక విక్ట‌రీ వెంక‌టేష్ ఇంకా కొత్త సినిమా ప‌ట్టాలెక్కించ‌లేదు.;

Update: 2025-10-02 13:30 GMT

సీనియ‌ర్ హీరోలు న‌లుగురు విరామంలోనే ఉన్నారా? ఇంకొన్ని రోజుల పాటు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతారా? అంటే అవుననే తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `మ‌న శంక‌ర‌వ‌ర ప్రసాద్` కొన్ని నెల‌లుగా ఆన్ సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ మొద‌లైన నాటి నుంచి చిన్న చిన్న బ్రేక్ త‌ప్ప లాంగ్ బ్రేక్ తీసుకుంది లేదు. ఈ నేప‌థ్యంలో ద‌స‌రా కూడా క‌లిసి రావ‌డంతో చిరు లాంగ్ బ్రేక్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. ద‌స‌రా కంటే ముందు నుంచే చిరంజీవి సెట్స్ కు వెళ్ల‌డం లేదు. దీంతో అనీల్ రావిపూడి ఇత‌ర న‌టీన‌టుల‌పై షూటింగ్ చేస్తున్నారు.

చిరు..బాల‌య్య మ‌న‌వ‌లతో స‌ర‌దాగా:

షూటింగ్ మొద‌లైన నాటి నుంచి అనీల్ చిరుపైనే స‌న్నివేశాలు పూర్తిచేసే ప‌నిలో ప‌డ్డారు. ఈ క్ర‌మంలో చాలా వ‌ర‌కూ చిరుపై పార్ట్ పూర్త‌యింది. ఈనేప‌థ్యంలోనే చిరు కూడా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. న‌ట‌సింహ బాల‌కృష్ణ కూడా `అఖండ 2` మొద‌లైన నాటి నుంచి నిర్విరామంగా ప‌ని చేస్తూనే ఉన్నారు. మ‌ధ్య‌లో రాజ‌కీయాలు చేస్తూ షూటింగ్ కి హాజ‌ర‌వుతున్నారు. ఇలా రెండు ప‌నుల్లో కొన్ని నెల‌లుగా బిజీ బిజీగానే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ద‌స‌రా హాలీడేస్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. వారం ప‌ది రోజుల పాటు బాల‌య్య ఇంటికే పరిమితం కానున్న‌ట్లు తెలిసింది.

ఇంట్లో సంద‌డే సంద‌డి:

ద‌స‌రా పండుగ కావ‌డంతో ఇంట్లో మన‌వ‌ల‌తో ఆడుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారుట‌. ఇక విక్ట‌రీ వెంక‌టేష్ ఇంకా కొత్త సినిమా ప‌ట్టాలెక్కించ‌లేదు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రాజెక్ట్ మొద‌లైనా? రెగ్యుల‌ర్ షూటింగ్ ఇంకా మొద‌లు పెట్టలేదు. దీంతో వెంకీ కూడా ఇంటికే ప‌రిమితమైన‌ట్లు తెలుస్తోంది. షూటింగ్ మొద‌లైన నాటి నుంచి ఎలాంటి గ్యాప్ లేకుండా పూర్తి చేయాలి అన్న ఉద్దేశంతో వెంకీ -గురూజీ సెట్స్ కు వెళ్ల‌డానికి ముందే రిలాక్స్ అవుతున్నారు. అలాగే కింగ్ నాగార్జున ఇంత వ‌ర‌కూ స్టార్ హీరోల చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డిపారు.

హాలీడేస్ త‌ర్వాతే కొత్త అప్ డేట్:

దీంతో సోలోగా చేసే సెంచ‌రీ ప్రాజెక్ట్ విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. త‌మిళ ద‌ర్శ‌కు పా. కార్తీక్ తో ప్రాజెక్ట్ లాక్ అయింది. కానీ ఇంకా ప‌ట్టాలెక్కించ‌లేదు. ఒక‌సారి సెట్స్ కు వెళ్లిన త‌ర్వాత ఎలాంటి గ్యాప్ లేకుండా పూర్తి చేయాల‌ని ముందుకు క‌దులుతున్నారు. అలాగే వీలైనంత వేగంగానూ పూర్తిచేయాలి అన్న‌ది నాగ్ ప్లాన్. నాగ్ సొంత బ్యాన‌ర్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న చిత్ర‌మిది. వంద‌వ సినిమాతో 100 కోట్ల క్ల‌బ్ లో అడుగు పెట్టే సినిమా అవ్వాల‌ని క‌సి మీద ఉన్నారు. ఇలా న‌లుగురు హీరోలు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ద‌స‌రా సెల‌వుల అనంత‌రం కొత్త అప్ డేట్ వ‌స్తుంది.

Tags:    

Similar News