బాలీవుడ్ పై టాలీవుడ్ దండ‌యాత్ర‌!

ఒకప్పుడు టాలీవుడ్ అంటే ప్రాంతీయ చిత్ర పరిశ్రమగా మాత్రమే గుర్తింపు ఉండేది.;

Update: 2026-04-27 02:45 GMT

ఒకప్పుడు టాలీవుడ్ అంటే ప్రాంతీయ చిత్ర పరిశ్రమగా మాత్రమే గుర్తింపు ఉండేది. కానీ `బాహుబలి` తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. తొలి ద‌శ‌లో తెలుగు హీరోలు నటనతో బాలీవుడ్‌ను ఆక్రమించగా, మ‌లి ద‌శ‌లో టాలీవుడ్ దర్శకులు మేకింగ్ స్టైల్‌తో బాలీవుడ్ స్టార్లను ఆకట్టుకుంటున్నారు. తాజాగా మూడవ దశ మొదలైంది. తెలుగు చలనచిత్ర నిర్మాణ సంస్థలు నేరుగా బాలీవుడ్‌లోకి ప్రవేశిస్తున్నాయి. అక్కడా భారీ చిత్రాలను నిర్మించే దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. తెలుగు సినిమాల్లో ఉంటోన్న గ్రాండియ‌ర్ ను చూసి అక్క‌డ హీరోలు ఏ మాత్రం వెన‌క్కి త్గ‌డం లేదు. స‌రైన నిర్మాణ సంస్థ అనుకుంటే నో చెప్ప‌కుండా క‌మిట్ అవుతున్నారు.

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒక‌రైన‌ దిల్ రాజు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే కొన్ని హిందీ రీమేక్స్‌తో అక్క‌డా ఉనికిని చాటుకున్నారు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఓ భారీ ప్రాజెక్టునే నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు లాంటి సక్సెస్ ఫుల్ నిర్మాత బాలీవుడ్ టాప్ స్టార్‌తో చేతులు కలపడం అనేది టాలీవుడ్ తో పాటు, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అలాగే ఫామ్ లో ఉన్న మ‌రో అగ్ర‌గామి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా హిందీలో వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతోంది. ఇప్ప‌టికే సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన `జాట్` చిత్రా న్ని జీ స్టూడియోస్ తో క‌లిసి మైత్రీ సంస్థ నిర్మించిన సంగ‌తి తెలిసిందే.

అక్క‌డ తొలి సినిమాతోనే మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ యువ హీరోలతో కూడా మైత్రీ సంస్థ‌ చర్చలు జ‌రుపుతోంది. టాలీవుడ్ మేకర్స్ దగ్గర ఉన్న మాస్ పల్స్ ని నార్త్ మార్కెట్ కి ఎక్కించే ప్లాన్ లో భాగంగా మైత్రీ సంస్థ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. అయితే ఈ ట్రెండ్‌కు ఆద్యులు నిర్మాత అల్లు అరవింద్. ఆయన గతంలో కొన్ని హిందీ సినిమాల్ని నిర్మించారు. `గజిని` వంటి ఇండస్ట్రీ హిట్లతో బాలీవుడ్ లో మంచి పేరొచ్చింది. తాజాగా తెలుగు సినిమా పాన్ ఇండియాలో స‌త్తా చాటుతోన్న నేప‌థ్యంలో మ‌ళ్లీ హిందీ నిర్మాణంపై అర‌వింద్ దృష్టి పెట్టారు.

స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న చిత్రాల్ని నిర్మించాల‌ని భావిస్తున్నారు. తెలుగు నిర్మాతలు సినిమాని కేవలం కళగానే కాదు. పక్కా వ్యాపార వ్యూహంతో నిర్మించడంలో దిట్టలు. భారీ బడ్జెట్‌ను ఎలా ఖర్చు చేయాలి? దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి? అనే విషయంలో తెలుగు నిర్మాతలు పండితులు. తెలుగు నిర్మాత‌ల స్ట్రాట‌జీకి బాలీవుడ్ నిర్మాత‌లే షాక్ అవుతుంటారు. అలాగే టాలీవుడ్‌లో స‌క్సెస్ అయినా అవకాశాల ఆల‌స్య మ‌వ్వ‌డంతో ఎదురు చూస్తోన్న‌ దర్శకులు కూడా ముంబై వైపు మ‌ళ్లుతున్నారు. సందీప్ రెడ్డి వంగా `అర్జున్ రెడ్డి` బాలీవుడ్ లో అలాగే రీమేక్ చేసారు. దీంతో `యానిమ‌ల్` కు ప‌నిచేసే అవ‌కాశం వెంట‌నే ల‌భించింది.

ఇండియన్ సినిమా మార్కెట్ ఇప్పుడు ఒకే గొడుగు కిందికి వస్తోంది. భాషా పరమైన విభజనలు తగ్గిపోతున్నాయి. తెలుగు నిర్మాతలు బాలీవుడ్‌పై చూపుతున్న ఫోకస్ తో వ్యాపారమే కాకుండా వినూత్నమైన కథలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాది స్టార్ పవర్ కి టాలీవుడ్ నిర్మాణ విలువలు తోడైతే ఇండియన్ సినిమా గ్లోబల్ లెవల్లో మరింత దూసుకుపోవడం ఖాయం. మ‌రో ఐదేళ్ల‌లో బాలీవుడ్ స్క్రీన్ పై టాలీవుడ్ బ్యానర్ల సందడి త‌ధ్య‌మే.

Tags:    

Similar News