టాలీవుడ్‌లో పెరుగుతున్న మల్టీస్టారర్ చిత్రాల హవా!

ఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలు రావడం అరుదైన ఎంతో విషయం.

Update: 2026-06-06 18:34 GMT

ఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలు రావడం అరుదైన ఎంతో విషయం. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూపించాలంటే కథలు కుదరడం లేదనో? ఇమేజ్ బ్యాలెన్స్ చేయడం కష్టమనో? మేకర్స్ వెనకడుగు వేసేవారు. హీరోల మధ్య ఉండే అంతర్గత ఈగోలు, అభిమానుల మధ్య వచ్చే గొడవలు కూడా మల్టీస్టారర్లకు పెద్ద అడ్డంకులుగా క‌నిపించేవి. కానీ మారుతున్న కాలంతో పాటు టాలీవుడ్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. నేటితరం హీరోలు సరికొత్త ఆలోచనలతో, కథ డిమాండ్ చేస్తే ఎవరితోనైనా స్క్రీన్ పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చాటిచెబుతున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో ఈ సరికొత్త మల్టీస్టారర్ ధోరణికి `ఆర్ ఆర్ ఆర్` పెద్ద మైలురాయిగా నిలిచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించి అంతర్జాతీయ స్థాయి విజయాన్ని అందుకోవడంతో టాలీవుడ్ రూపురేఖలు మారిపోయాయి. అంతకుముందే రిలీజ్ అయిన `F2`, `F3` వంటి చిత్రాలు కమర్షియల్‌గా భారీ వసూళ్లు సాధించి మల్టీస్టారర్ కథలకు ఉండే క్రేజ్‌ను నిరూపించాయి. ఈ చిత్రాల విజయాలు టాలీవుడ్‌లో కొత్త నమ్మకాన్ని కలిగించాయి. ఇద్దరు హీరోలు కలిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ రిపీట్ అవుతుందని మేకర్స్ గట్టిగా నమ్ముతున్నారు.

ఆర్థిక కోణంలో చూస్తే? భారీ బడ్జెట్ సినిమాలకు మల్టీస్టారర్ ట్రెండ్ నిర్మాతలకు రక్షణ కవచంలా మారుతోంది. వందల కోట్ల వ్యయంతో తెరకెక్కే పాన్ ఇండియా చిత్రాలకు ఒక్క హీరో మార్కెట్ మాత్రమే సరిపోవడం లేదు. అదే ఇద్దరు స్టార్ హీరోలు జతకడితే వారిద్దరి మార్కెట్ వాల్యూ కలిసి సినిమాపై పెట్టే భారీ పెట్టుబడికి గ్యారెంటీ ఇస్తుంది. ప్రత్యేకించి సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండగ సీజన్లలో ఇలాంటి క్రేజీ మల్టీస్టారర్లు బాక్స్ ఆఫీస్ వద్ద ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పడుతున్నాయి. బడ్జెట్ టెన్షన్ల నుంచి బయటపడటానికి నిర్మాతలు సైతం ఈ తరహా కథల వైపు మొగ్గు చూపుతున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో మరికొన్ని క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి. సీనియర్ హీరో వెంకటేష్, నందమూరి కల్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ జరుగుతోంది. ఈ ఇద్దరు విభిన్న శైలి కలిగిన హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే సరికొత్త వినోదం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దర్శకులు సైతం హీరోల ఇమేజ్ పరిధులను దాటి కథలోని పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ స్క్రిప్ట్‌లను సిద్ధం చేస్తున్నారు. ఒకే పరిశ్రమకు చెందిన హీరోలే కాకుండా.. ఇతర భాషల స్టార్లతోనూ తెలుగు హీరోలు చేతులు కలుపుతున్నారు.

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాలను గమనిస్తే ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఇప్పటికే `సలార్` చిత్రంలో మాలీవుడ్ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోగా, `కల్కి 2898 AD` లో ఇండియన్ సినిమా లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లతో కలిసి న‌టించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి సైతం `వాల్తేరు వీరయ్య`లో రవితేజతో కలిసి సందడి చేయగా.. తదుపరి భారీ చిత్రంలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి మాఫియా డాన్‌గా సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

తమిళ చిత్ర పరిశ్రమలోనూ రజనీకాంత్ - కమల్ హాసన్ కాంబినేషన్‌లో నెల్సన్ దిలీప్‌కుమార్ సినిమా అనౌన్స్ కావడం ఈ మార్పుకు నిదర్శనం. ప్రాంతీయ సరిహద్దులు చెరిగిపోతున్న నేటి కాలంలో కథల డిమాండ్‌ను బట్టి హీరోలు కలిసి నటించడం సినిమా రంగానికి ఆరోగ్యకరమైన పరిణామం. ఈగోలను పక్కన పెట్టి స్టార్స్ అందరూ ఒకే తాటిపైకి రావడం వల్ల ప్రేక్షకులకు కనువిందు కలగడమే కాకుండా టాలీవుడ్ మార్కెట్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటోంది. రాబోయే రోజుల్లో మల్టీస్టారర్ విప్లవం మరిన్ని అద్భుతమైన చిత్రాలకు బాటలు వేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News