చైనా మార్కెట్‌ని టాలీవుడ్ క్యాచ్ చేసే ఛాన్సుందంటారా?
అమెరికా, కెనడా, గల్ఫ్ లేదా కొరియా మార్కెట్ల కంటే చైనీస్ బాక్సాఫీస్ సరికొత్త మైలేజ్‌ను అందించగలదని ట్రేడ్ నిపుణులు ఎప్పటి నుంచో విశ్లేషిస్తున్నారు.
దేశీ సినిమా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ కి చేరుకుంటోంది. భారతీయ కథలకు ప్రపంచవ్యాప్త ఆదరణ పెరుగుతున్న ఈ శుభతరుణంలో సినీట్రేడ్ లో ఒక ఆసక్తికర డిబేట్ ప్రారంభమైంది. భారతదేశ బాక్సాఫీస్ కి, చైనీ బాక్సాఫీస్ ని జోడిస్తే ఆ విజయం అపారమైనది. చైనీస్ సినిమాలు వాటిలోని డ్రామాల సృజనాత్మకతను, అక్కడి స్థానిక కథాంశాలను మన టాలీవుడ్ దర్శకులు క్యాచ్ చేస్తే ఆసియా వినోద మార్కెట్లో మనదే హవా నడుస్తుందని.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త విజయాలను సాధించే అవకాశం ఉందని ఒక అంచనా. దీనికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రాలతో అమీర్ ఖాన్ దీనిని సాధించి చూపించారు. చైనా చిత్రపరిశ్రమ అనుసరిస్తున్న నిర్మాణ విలువలు, ఎమోషనల్ కనెక్టివిటీ, విజువల్ గ్రాండియారిటీ పరిశీలించదగినది. మన దర్శకులు ఆ శైలిని ఆకళింపు చేసుకుని ప్రయోగాలు చేస్తే.. అక్కడి స్థానిక ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకునే శక్తి మన కథలకు లభిస్తుందనే విశ్లేషణ సాగుతోంది.
భారతదేశం తర్వాత అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా రికార్డుల్లో నిలవడం వల్ల.. అక్కడి బాక్సాఫీస్ ఆర్జన శక్తి అనూహ్యమైనది. మన దేశంలో వచ్చే వసూళ్లతో పాటు చైనా మార్కెట్ ను కూడా విజయవంతంగా టార్గెట్ చేయగలిగితే బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డులు తలకిందులవుతాయి. ఇండియాలో రూ. 3000 కోట్లు.. చైనాలో మరో రూ. 3000 కోట్లు వసూలు చేయగల సత్తా ఉన్న యూనివర్సల్ కంటెంట్‌ను టాలీవుడ్ రూపొందించగలిగితే... ఆసియాలోనే అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమగా మన పరిశ్రమ అవతరిస్తుందనే ఆశాభావం ఉంది.
అమెరికా, కెనడా, గల్ఫ్ లేదా కొరియా మార్కెట్ల కంటే చైనీస్ బాక్సాఫీస్ సరికొత్త మైలేజ్‌ను అందించగలదని ట్రేడ్ నిపుణులు ఎప్పటి నుంచో విశ్లేషిస్తున్నారు. అక్కడి ప్రేక్షకుల నాడికి తగినట్టుగా ఎమోషన్స్- యాక్షన్ - విజువల్ వండర్స్‌ను మిళితం చేసి కథలను సిద్ధం చేయాలి. గ్లోబల్ ఆడియెన్స్‌ను కట్టిపడేసేలా కంటెంట్ ఎలివేషన్ ఉంటే.. టాలీవుడ్ సినిమాలు హాలీవుడ్ సినిమాలతో సమానంగా అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించగలవు.
ప్రస్తుతం కొరియన్ డ్రామాలు భారతదేశంలో ప్రధాన స్రవంతిలో నిలుస్తున్నా.. చైనీస్ డ్రామాలు.. హిస్టారికల్ రొమాంటిక్ స్టోరీలు.. ఫాంటసీ ఎపిక్స్.. క్రైమ్ థ్రిల్లర్లు కూడా నిశ్శబ్దంగా తమకంటూ ప్రత్యేక ప్రేక్షకులను సంపాదించుకుంటున్నాయి. రకుటెన్ వికీ, వీటీవీ, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చైనీస్ కంటెంట్ మన ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది. ఈ తరహా డిజిటల్ అవైలబిలిటీ భారతీయ ప్రేక్షకులకు ఆయా కథల నేపధ్యంపై చక్కటి అవగాహన ఏర్పడింది.
ఈ నేపథ్యంలో మన టాలీవుడ్ మేకర్స్ చైనీస్ కంటెంట్ లోని ప్రత్యేకతలను అధ్యయనం చేసి.. గ్లోబల్ అప్పీల్ ఉన్న కథలను వెండితెరపైకి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. సరైన ప్రణాళిక, భారీ బడ్జెట్ , పాన్-ఏషియన్ అప్పీల్ ఉన్న క్యారెక్టరైజేషన్లతో సినిమాలు తెరకెక్కిస్తే టాలీవుడ్ కీర్తి ప్రపంచవ్యాప్తంగా పతాకస్థాయికి చేరుకుంటుందని అంచనా. చైనా వ్యాప్తంగా ఉన్న 91,000 థియేటర్లకు మన సినిమా చేరుకుంటే ఆ మేరకు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ జరిగే ఛాన్సుంది. అంతర్జాతీయ మార్కెట్‌ను శాసించే స్థాయికి మన తెలుగు సినిమా ఎదుగుతుందని కూడా విశ్లేషిస్తున్నారు. అయితే చైనా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థపైనా, మార్కెటింగ్ వ్యూహాలపైనా గ్రిప్ సంపాదిస్తూనే, ఉన్నతమైన కంటెంట్ ని మన దర్శకులు ఆవిష్కరించాల్సి ఉంటుంది.